'దిక్కులు చూడకు రామయ్య' చిత్రానికి సంగీతం సమకూర్చిన ఎంఎం కీరవాణి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇతర సంగీత దర్శకుల గురించి వ్యాఖ్యానించడం నా అభిమతం కాదు. ఎవరిష్టం వచ్చినవాళ్లతో వాళ్లు పాడించుకుంటారు. బేసిక్‌గా నాకు తెలుగువాళ్లతో పాడించడం ఇష్టం. ఇప్పుడీ చిత్రంలోని పాటలన్నీ పాడింది తెలుగు గాయనీ గాయకులే. ఫలానా సింగర్ పాడితేనే బాగుంటుందని నాకనిపించే ఏకైక గాయకుడు ‘బాలుగారు’. ఆయన కోసం మాత్రమే ఆగిన సందర్భాలున్నాయి’ అని కీరవాణి చెప్పారు.
కాగా, త్రికోటి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘దిక్కులు చూడకు రామయ్య’ ఈ శుక్రవారం విడుదల కానుంది. నా కెరీర్ ఆరంభం నుంచి అవసరాన్ని బట్టి పెద్ద, చిన్న సినిమాలు చేస్తున్నాను. నాకు చిన్నా, పెద్దా అనే వ్యత్యాసం నాకు లేదన్నారు. అందువల్లే ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాకి ఏం అవసరమో ఆ పరిధిలో ఒదిగిపోయి చేశాను.
'ఈగ'లో సుదీప్ నటన నాకు బాగా నచ్చిందని, ఈ చిత్రంలో అజయ్ నటన అంతకంటే బాగా నచ్చిందని చెప్పారు. సాయి కొర్రపాటితో ‘ఈగ’ సమయంలోనే నాకు మంచి అవగాహన ఏర్పడింది. ఏ నిర్మాత అయినా నన్ను నమ్మితే నేను సౌకర్యవంతంగా సినిమా చేస్తానని చెప్పారు. సాయి కొర్రపాటి కూడా ఆ కోవకు చెందిన నిర్మాతే అని వివరించారు.