ఇప్పుడు వస్తున్న చిత్రాల కథలు ఎప్పుడో తీసిన కథల్నే మార్చి అటూఇటూ తీస్తున్నారు. నటులు కూడా వేసుకున్న మేకప్పే వేసుకుంటున్నారు. రచయితలు రాసిన కథలనే రాస్తున్నారు. సాహిత్యంలో వచ్చిన మాటలే వస్తున్నాయి. ప్రేక్షకులు చూసినవే చూస్తున్నారు.... అంటూ సంగీత దర్శకుడు కీరవాణి అంటున్నారు. ఆయన తాజాగా 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రానికి బాణీలు సమకూర్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ఇప్పటి సంగీతం అంతా గందరగోళంగా వుంది. సాహిత్యం వినిపించకుండా బాదుడు ఎక్కువైంది. ఒకవేళ వినిపిస్తే మీరు బాధపడతారు. ఏదో ఒకటి నవ్యత అనేది సంగీతంలోనే అంటూ వ్యాఖ్యానించారు.
సాయికొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి నిర్మాతగా రూపొందుతోన్న 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రం అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈనెల 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రం గురించి సంగీత దర్శకుడు యం.యం.కీరవాణితో ఇంటర్వ్యూ విశేషాలు...
'దిక్కులు చూడకు రామయ్య' సినిమాతో మరోసారి వారాహి బ్యానర్‌లో పనిచేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది..?
ఈ సినిమాకి పనిచేయడం చాలా హ్యపీగా ఉంది. ఏ సినిమాకైనా డైరెక్టర్, నిర్మాత, హీరో మూడు స్తంభాలు. ముఖ్యంగా నిర్మాత నమ్మాలి. ఈ సినిమాకి ఏం అవసరమో దానికి అనుగుణంగా నేను పనిచేశాను. ఈ సినిమా విషయంలో సాయికొర్రపాటిగారు పూర్తిగా నన్ను నమ్మారు. మా సలహాలను వింటూ, ఆయన సలహాలను మాతో పంచుకుంటూ ఈ సినిమాకి పనిచేశాం. త్రికోటి రాజమౌళి దగ్గర పనిచేస్తున్నప్పట్నుంచి నాకు పరిచయం. తనతో కంఫర్ట్‌గా పనిచేశాను. త్రికోటిలో మంచి టాలెంట్ ఉంది. అది ఈ సినిమాతో ప్రూవ్ అవుతుంది. మంచి టీమ్ కుదిరింది. రిజల్ట్ మీరే చూస్తారు.
కథలోని కొత్తదనం ఏమిటి?
డిఫరెంట్ కథ. తండ్రి, కొడుకు ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. చివరికి ఏమైంది. దాని పరిణామాలేమిటి? అనే కాన్సెప్ట్‌తో కథ సాగుతుంది. సినిమా బాగా వచ్చింది. అంటే క్యారెక్టర్స్ బాగా కుదిరాయి. అలా కుదిరినప్పుడు ప్రేక్షకులు ఈ సినిమానే ఏ సినిమానైనా బాగా ఎంజాయ్ చేస్తారు. కథలో ప్రతి పాత్ర మొదటి నుండి చివరి దాకా కథకు అనుగుణంగా కరెక్ట్‌గా సాగాలి. ఈ సినిమాలో అది మీరు గమనించవచ్చు. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈసినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది.
దిక్కులు చూడకు రామయ్య' సంగీతం వినడానికి కొత్తగా ఉంది. ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా?
ఇందులో దాదాపు అన్నీ సిచ్యువేషన్ సాంగ్సే ఉన్నాయి. ఒక సాంగ్ కూడా లవ్, డ్యాన్స్ సాంగ్స్ లేవు. సిచ్యువేషన్ సాంగ్స్ కాబట్టే మ్యూజిక్ వినేవారికి కొత్తగా అనిపిస్తుంది. కథ కొత్తగా ఉంది. కొత్త సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకే అలా అనిపించి ఉండవచ్చు.
నాన్నగారితో పాటలు రాయించారు కదా?
నాన్నగారు రెగ్యులర్‌గా పాటలు రాస్తున్నారు. 'రాజన్న' సినిమాకి కూడా సాంగ్స్ రాశారు. కాబట్టి ఈ సినిమాకి కూడా ఆయన పాటలు రాస్తే బావుంటుదనిపించింది. అందుకే ఆయనతో పాటలు రాయించాం. అయితే మేజర్ సాంగ్స్‌ని అనంత్‌శ్రీరామ్ రాశాడు.
నటీనటులు పెర్ఫామెన్స్ గురించి?
అందరూ బాగా చేశారు. అజయ్ పెర్ఫామెన్స్ అద్భుతంగా చేశాడు. ఈగ సినిమాలో సుదీప్ పాత్ర ఎంత బాగా ఎలివేట్ అయిందో అలాగే ఈ సినిమాలో అజయ్ రోల్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా మరో ఎత్తు.
ఈ సినిమాకి మీరే హీరో అని నిర్మాత అంటున్నారు?
నా మీద అభిమానం కొద్ది సాయికొర్రపాటి ఈ సినిమాకి హీరో నేనే అని అంటున్నారు. కానీ ఈ సినిమాలో అందరూ తమ వంతుగా కష్టపడ్డారు. మ్యూజిక్ బాగున్నంత మాత్రాన సినిమా హిట్ కావాలని లేదు కదా. ఇదంతా టీమ్ వర్క్.
మ్యూజిక్‌కి పరిమితులుంటాయా?
మ్యూజిక్‌కి బడ్జెట్ పరిమితులుంటాయని అనుకోను. వంద రూపాయలు సినిమాకి పెట్టుబడి పెడుతున్నారనుకుంటే అందుకు తగిన విధంగా సంగీతానికి కూడా ఒక బడ్జెట్ ఉంటుంది. అంతే తప్ప దాని వల్ల మ్యూజిక్ క్వాలిటీ ఎఫెక్ట్ కాదు. బడ్జెట్ అనేది మన చేతుల్లో పని.
ఇప్పటి సంగీత దర్శకుల్లో ఎవరి సంగీతాన్ని ఇష్టపడతారు?
ఇప్పటి సంగీత దర్శకుల్లో చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. అయితే 'స్వామిరారా' ఫేమ్ సన్నీ యం.ఆర్. నాకు బాగా ఇష్టమైన దర్శకుడు.
నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్..?
'దిక్కులు చూడకు రామయ్య' పూర్తయ్యింది. ప్రస్తుతం 'బాహుబలి'కి మ్యూజిక్ కంపోజ్ చేయాలి. అలాగే బాలీవుడ్‌లో 'బేబి', 'టిట్లీ' అనే రెండు సినిమాలు చేయాల్సి ఉంది.