పందెం కోడి చిత్రంతో తెలుగువారికి పరిచయమైన నటుడు విశాల్. తెలుగువాడైనా.. తమిళంలో స్థిరపడి పలు తమిళ చిత్రాలు చేశాడు. అయితే నడిగర్ సంఘంలో కార్యదర్శిగా నిలబడి గెలిచాడు. ఎందరో సీనియర్స్ మధ్య అతను నిలదొక్కుకోవడం కష్టమైనా.. పలువురు సీనియర్స్ చేసిన సహకారంతో గెలిచానని అంటున్నాడు. మరోవైపు తమిళంలో చేసిన కథకళి.. తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఈ సందర్భంగా విశాల్‌తో ఇంటర్వ్యూ...
కథకళి.. జనవరి 14నే విడుదల చేయాలనుకున్నారు కదా?
తమిళనాడులో పండుగ నాడు విడుదల చేశాం. తెలుగులోనూ చేయాలనుకున్నా.. థియేటర్లు దొరకలేదు. పైగా పెద్ద హీరోల చిత్రాలు వచ్చాయి. అందుకే సమయం చూసుకుని విడుదల చేయాలని ఈ నెల 22న విడుదల చేయాలనుకున్నాం. కానీ సెన్సార్ ఆలస్యం అయింది. అందుకే త్వరలో డేట్‌ను ప్రకటిస్తాం.
కథకళి అంటే ఏమిటి?
పేరునుబట్టి నృత్యం సంబంధించిన కథకాదు. అలాగే యాక్షన్ సినిమా కాదు. థ్రిల్లర్ కథ. తొలిసారిగా ఇటువంటి కాన్సెప్ట్‌తో నేనే చేశారు. దర్శకుడు పాండిరాజ్ అద్భుతంగా తీశాడు.
తమిళనాడులో ఎలా వుంది?
సంక్రాంతికి విడుదలైన చిత్రం మంచి విజయాన్ని సాధించింది.. డైరెక్టర్ స్నేహితునికి జరిగిన రెండు సంఘటనలను ఆధారంగా చేసుకొని కథ రాశారు. ఇదొక మర్డర్ మిస్టరీ. చెన్నైలో మొదలయ్యి కడలూరులో పూర్తయ్యే కథ. ఒక రోజులో జరిగే కథ. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. మర్డర్ ఎవరు చేశారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఒక నవల చదువుతున్న భావన కలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు మంచి పేరొస్తుంది. రెండు గంటల మూడు నిమిషాల నిడివి గల ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్ ఫీల్ చేస్తుంది. అందుకే ప్రేక్షకులు బాగా ఆదరించారు.
తెలుగులో సినిమా అన్నారు ఎప్పుడు?
ప్రస్తుతం తమిలంలో బిజీగా వున్నాను. ఆ సినిమాలు పూర్తయ్యాక తప్పనిసరిగా తెలుగులో నటిస్తాను.
మీ చిత్రాలు డబ్బింగ్ చేస్తారెందుకు?
కరెక్టే.. ఒకేసారి రెండు భాషల్లో చేయాలనుకున్నా కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నాం. నేటివిటీ ఒకేలా వున్నా... నాకు డబ్బింగ్ చేస్తేనే బాగా హిట్టయ్యాయి. భవిష్యత్‌లో ఒకేసారి చేసే ఆలోచనన పరిశీలిస్తాను.
ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుంది?
ఇంతకుముందు 'ఇంద్రుడు'లో భిన్నమైన పాత్ర చేశాను. ఆ తర్వాత 'వాడువీడు' చేశాను. ఆ పాత్రకు చాలా స్పందన వచ్చింది. ఇప్పుడు కథకళిలోనూ అంతకంటే భిన్నమైన పాత్ర చేశాను. ఇలా పలు డిఫరెంట్ షేడ్స్‌వున్న పాత్రలు చేయాలనేది నా కోరిక
కొత్త చిత్రాలు?
పాండిరాజ్ నాకు రెండు కథలు చెప్పారు. ఈ సినిమా కథ విన్నప్పుడు గెస్సింగ్ గేమ్‌లా అనిపించింది. పూర్తిస్థాయి థ్రిల్లర్ జోనర్ సినిమా పాండిరాజ్‌కు కొత్త అయినా చేయగలడనే నమ్మకంతో ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. ఇక ఈ సినిమా తరువాత తమిళంలో 'మరుద' అనే సినిమాలో నటిస్తున్నాను. ముత్తయ్య దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే సినిమా అది.
నడిగర్ సంఘం పదవి ఎలా ఉంది?
చాలా బాగుంది. అది బాధ్యతగా భావిస్తున్నాను. ఎంతోమంది సీనియర్స్ వుండగా ఆ పదవి నాకు దక్కడం సంతోషంగా వుంది. ఆ పదవి వచ్చాక.. చాలామంది సీనియర్స్ ఆర్టిస్టులకు పనిలేనివారికి హెల్ప్ చేసే అవకాశం దక్కింది. తెలుగబ్బాయి తను ఇక్కడ ఏం చేయగలడని చాలామంది అన్నారు. కాని మంచి పని చేయడానికి భాషతో పని లేదు. 10 సంవత్సరాల తరువాత ఎన్నికలు సవ్యంగా జరిగాయి. 30 సంవత్సరాల తరువాత ఇప్పుడిప్పుడే నడిగర్ సంఘంలో మార్పులు వస్తున్నాయి. మేము చెప్పిన విషయాలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాం.
శరత్ కుమార్‌పై కేసు ఏమయింది?
ఆయన ఆధ్వర్యంలో అకౌంట్స్ సరిగ్గా లేవు. వారి దృష్టికి తెచ్చినా ఇంతరవకు సరైన సమాధానం లేదు. ప్రస్తుతం ఓ కమిటీ దాన్ని పరిశీలిస్తుంది. దాని ఆధారంగా చర్య తీసుకుంటాం.
రెండు పనులు ఎలా చేయగలుగుతున్నారు?
సినిమా అనేది ప్రాణం. దాని ద్వారానే పదవి వచ్చింది. అందుకే రెండింటికి న్యాయం చేస్తాను.
పెండ్లి ముహూర్తం ఎప్పుడు?
సంఘం పనులతో వ్యక్తిగత జీవితాన్ని కొంచెం మిస్ అవుతున్నాను. షూటింగ్, నడిగర్ సంఘంలో పనులతో చాలా బిజీగా ఉంటున్నాను. అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఇంకా నా మైండ్ పెళ్లికి సిద్ధంగా లేదు.
మీరు ఎవరినో ప్రేమించారని వార్తలు వచ్చాయి?
వరలక్ష్మి నా చిన్ననాటి స్నేహితురాలు. తనతో వస్తున్న గాసిప్స్ విషయంలో వాస్తవం లేదు. వాటిని పెద్దగా పట్టించుకోను.
తమిళనాడులో తెలుగుభాషకు అన్యాయం జరుగుతుంది. దీనిపై ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు. కారణం?
ఆ విషయాలు నాకు పెద్దగా తెలీవు. వాటి గురించి తెలుసుకుని అవసరమైతే సి.ఎం.వద్దకు వెళ్ళి సమస్యను వివరిస్తాను.
నడిగర్ సంఘం ద్వారా వారికి అండగా వుండవచ్చుగదా?
తమిళనాడులో పుట్టినా మూలాలు తెలుగు.. తెలుగు భాషకు అన్యాయం జరగుతుందనే విషయాన్ని పూర్తిగా పరిశీలించాక.. తప్పకుండా సంఘం తరపున ఏదో ఒకటి చేస్తాను అని చెప్పారు.