Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి వంటివి కాదు... 4 నెలల్లో ముగిసే చిత్రాలు చేస్తున్నా : కమల్‌ హాసన్‌ ఇంటర్వ్యూ

Advertiesment
kamal hassan interview
, మంగళవారం, 3 నవంబరు 2015 (20:52 IST)
కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా రాజేష్‌.ఎం.సెల్వ దర్శకత్వంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, శ్రీ గోకుళం మూవీస్‌  సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చీకటిరాజ్యం'. త్రిష, మధుశాలిని కథానాయికలుగా నటించారు. ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రధారి. ఈ సినిమా ఈ నెల 20న రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న కమల్‌హాసన్‌ చెప్పిన విశేషాలు. 
 
'చీకటిరాజ్యం' ఎలా ఉండబోతోంది?
ఓ మంచి యాక్షన్‌ సినిమా తీశాం. టైటిల్‌లానే కథాంశం యూనిక్‌గా ఉంటుంది. అడుగడుగునా ఉత్కంఠ రేకెత్తించే సినిమా ఇది. ఒక డేలో, ఒక నైట్‌లో సాగే కథతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దీనిని ఫాస్ట్‌ ఫేస్‌ థ్రిల్లర్‌ అని అనొచ్చు. ఇది కొత్త జోనర్‌ సినిమా. స్టయిలిష్‌ థ్రిల్లర్‌ మూవీ.
 
దీపావళి రిలీజ్‌ అన్నారు, కాస్త ఆలస్యం అవుతున్నట్టుంది?
మంచి రిలీజ్‌ తేదీ, మంచి థియేటర్ల కోసం వేచి చూశాం. అందుకే కొంత ఆలస్యం.
 
ఫ్రెంచి సినిమా 'స్టీప్‌లెస్‌ నైట్స్‌' ని 'చీకటిరాజ్యం'గా రీమేక్‌ చేయాలనుకోవడానికి కారణం?
'స్టీప్‌లెస్‌ నైట్స్‌' ఆసక్తి రేకెత్తించే ఓ మంచి సినిమా. ఇలాంటి ఓ సినిమా చేయాలి అన్న ఆసక్తితోనే ఈ సినిమా చేశాం. జనక్‌ జనక్‌ పాయల్‌.. ఇన్‌స్పిరేషన్‌తోనే 'సాగర సంగమం' తీశాం. కె.విశ్వనాథ్‌ అలాంటి సినిమా చేయాలనుకున్నారు కాబట్టే 'సాగరసంగమం' తీయగలిగాం. విశ్వనాథ్‌, జంధ్యాల మంచి సినిమాల ఇన్‌స్పిరేషన్‌తో సినిమాలు తీసేవారు. నేను కూడా అలాగే చేస్తున్నా.
 
మీరు దర్శకత్వం చేయకపోవడానికి కారణం?
బాలచందర్‌ గారు నాకు ఎలా అవకాశం ఇచ్చారో.. అలాగే నేను కూడా నా శిష్యునికి అవకాశం ఇచ్చాను. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వారి ప్రతిభ బయట ప్రపంచానికి తెలుస్తుంది. ఒక దర్శకుడు లేదా వ్యక్తిలోని ప్రతిభను గుర్తించడం అనేది ఓవర్‌నైట్‌లో జరగదు. నేను 36 సినిమాలకు పనిచేసిన తర్వాతే బాలచందర్‌ గుర్తించారు. బహుశా 25వ సినిమా నుంచి ఆయనకు అర్థమయ్యానేమో. ఫర్లేదు .. బాగానే చేస్తున్నావ్‌ అని అనడానికి అంత టైమ్‌ పడుతుంది. నా సినిమా దర్శకుడు రాజేష్‌ రాజ్‌కమల్‌ బ్యానర్‌తో చాలా కాలంగా ట్రావెల్‌ అవుతూ బాగానే నేర్చుకున్నాడు. ఎంబిబిఎస్‌ పూర్తి చేసి, డైరెక్టర్‌ అయ్యాడు. సినిమా కూడా ఓ సర్జన్‌ చేసే పనిలాంటిదే. ఆ పని విజయవంతంగా పూర్తి చేశాడు. 
 
ఈ సినిమాలో మీ ప్రమేయం ఎంతవరకు వుంది?
స్క్రీన్‌ప్లే అందించాను. అయినా సినిమా అనేది టీమ్‌ వర్క్‌. కె.విశ్వనాథ్‌, బాలచందర్‌ తమ సినిమాలకు దర్శకులుగా పనిచేసినా అసిస్టెంట్లుగా కలిసిపోయి పనిచేసేవారు. నేను కూడా అంతే. నేనే నటుడిని, నేనే అసిస్టెంటుని, అన్నీ నేనే అన్నట్టే పనిచేస్తాను.
 
మీలో స్టార్‌ని టెక్నీషియన్‌ డామినేట్‌ చేస్తాడని చెబుతారు?
స్టార్‌ అనే పిలుపు కంటే కమల్‌హాసన్‌ అనే టెక్నీషియన్‌ అని పిలిపించుకోవడానికే ఇష్టపడతాను. నా యూనిట్‌లో ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. నటులు, టెక్నీషియన్స్‌ ఆర్డర్‌లో చెప్పాలంటే  రాజేష్‌, ఘిబ్రాన్‌, కమల్‌హాసన్‌ అనే ఆర్డర్‌ని ఇష్టపడతాను. 
 
వైవిధ్యాన్ని ఇష్టపడే నటుడు మీరు .. ఈ చిత్రంలో వైవిధ్యం ఏం ఉంది?
ఈ సినిమాలో కొత్తగా ఏం ఉంది? అని అడిగితే ఏదేదో చూపించేస్తున్నా అనే గలాటా ఉండదు. కన్ఫ్యూజన్‌ లేని సినిమా. మీరంతా సినిమా చూసి .. ఇది వేరేగా చేశాడు కదా అని అంటారు. 
 
హీరో క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
ఈ సినిమాలో హీరో రోల్స్‌ రాయిస్‌లో తిరిగే రిచ్‌ గయ్‌ కానేకాదు. ఓ మెడికల్‌ రిప్‌లా తిరిగేస్తూ అన్నీ తెలుసుకునేవాడిగా కనిపిస్తాడు. 
 
త్రిష పాత్ర గురించి?
త్రిష మా యూనిట్‌కి కొత్తేమీ కాదు.. ఇప్పటికే ఓ సినిమాకి కలిసి పనిచేశాం. తను తన క్యారెక్టర్‌కి రచయితగానూ కొనసాగింది. ప్రతిరోజూ తనతో కలిసి పనిచేస్తుంటే తెలిసిన స్నేహితురాలితో కలిసి పనిచేస్తున్నట్టే ఉంటుంది. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్‌ ప్రతి ఒక్కరూ అసిస్టెంట్‌ డైరెక్టర్లుగానే పనిచేశారు. 
 
ఎన్నిరోజుల్లో సినిమా పూర్తి చేశారు?
ఈ సినిమాకి పనిచేసింది 54 పని దినాలు. అందులోనే తెలుగు వెర్షన్‌, తమిళ వెర్షన్‌ రెండూ షూట్‌ చేశాం. భాషని బట్టి సెట్‌లో బోలెడన్ని మార్పులు, చేర్పులు చేశాం. ఒక్కో వెర్షన్‌కి 30 రోజులు పనిచేశాం అనుకోవచ్చు. 
 
జయాపజయాలకు కారణాల్ని విశ్లేషిస్తుంటారా?
సక్సెస్‌ అనేది ఒకరి వల్లనే అని చెప్పలేం. బ్యాడ్‌ డిస్ట్రిబ్యూషన్‌, బ్యాడ్‌ రిలీజ్‌ వల్ల ఫెయిల్యూర్స్‌ ఎదురవుతుంటాయి. ఫ్లాప్‌కి రకరకాల కారణాలుంటాయి. మంచి కంటెంట్‌ ఉన్నా ఒక్కోసారి సరైన రిలీజ్‌ కుదరపోతే అపజయాలు ఎదురవుతుంటాయి.
 
వైవిధ్యమైన సినిమాలు చేస్తుంటారు.. అవి అనుకున్నంతగా ఆడకపోతే?
దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకునే నటుడు కమల్‌హాసన్‌ అని మీరే అంటుంటారు. అంటే నటుడిగా నా స్థాయిని మీరే నిర్ణయించినట్టే కదా! సినిమాలు ఆడకపోతే అలా పిలుస్తారా?
 
తెలుగులో మీరు పెద్ద స్టార్‌. నేరుగా తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు?
నాకు అనిపించి చేయడం కంటే.. ఎందుకు చేయరు? అని మీరు అడిగారు. అదే గొప్ప అప్లాజ్‌ అని ఫీలవుతాను. అయినా నేను చేసిన 'చీకటిరాజ్యం' తెలుగులో నేరుగా చేసినదే. తెలంగాణలో కొంత భాగం, తమిళనాడులో కొంత భాగం చిత్రీకరించాం. ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమా చేస్తున్నా. అక్కినేని అమల గారు ఆ చిత్రంలో నటిస్తున్నారు. ఓ యువకథానాయికను ఎంపిక చేశాం.
 
ఈ నెల 7న మీ పుట్టినరోజు.. మీ కెరీర్‌ను విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది?
జరిగిపోయిన కాలాన్ని మరలా వెనక్కు తిరిగి చూసుకోవడం ఇష్టముండదు. చూస్తే అందులో వెయ్యి తప్పులు కన్పిస్తాయి. తర్వాత ఏమిటి? అనేది ఆలోచిస్తూ కొత్తగా సాగడమే. అది జీవితమైనా నటన అయినా సరే. 
 
ఇటీవలే చెన్నైలో 'నడిగర్‌ సంఘం' ఎన్నికల్లో.. సంఘం పేరు మార్చాలన్నారు కారణం?
ఒక్కటే కారణం. నటవర్గం అనేది యూనివర్సల్‌. దానికి కులం, మతం, ప్రాంతం అనే తేడా లేనేలేదు. నడిగర్‌లో ఎన్‌టిఆర్‌, ఎఎన్‌ఆర్‌తోపాటు చాలామంది సభ్యులుగా నమోదు అయ్యారు. వారు తెలంగాణా, ఆంధ్రా, చెన్నై అనేమీ చూడరు. అందుకే ప్రాంతీయ భేదం లేకుండా నేషనల్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ అని పేరు పెడితే బాగుంటుందని అన్నాను. అది కార్యరూపం దాలిస్తే మంచిదే.
 
మన సినిమాలకు ఆస్కార్‌ దక్కకపోవడానికి కారణం?
అది అమెరికన్‌ అవార్డు. మన అవార్డులు వేరు. మన సినిమాలు కథలు వారికి తెలీవు. మన సభ్యులు వుండరు. మన అవార్డులు విలువైనవే వున్నాయి. ఆస్కార్‌కు పోటీపడటం అనేది కరెక్ట్‌కాదు. ఎవరినైనా మన పొలిటీషియన్‌ను మీరు అమెరికన్‌ ప్రెస్‌డెంట్‌ ఎందుకవ్వరు? అని అడిగితే.. ఎలా వుంటుంది? ఆయన ఏం సమాధాన చెబుతారు. ఇదీ అంతే.
 
బాహుబలి సినిమా ద్వారా సౌత్‌ ఇండియన్‌ స్పాన్‌ పెరిగింది. ముందు ముందు ఈ రేంజ్‌ని పెంచే అవకాశం ఉంది అంటారా.?
ముందు ముందు కచ్చితంగా పెరుగుతుంది..చెప్పాలంటే మన రీజనల్‌ బాక్స్‌ ఆఫీసు స్టామినా ఎంత అనేది ఎవ్వరికీ తెలియదు. నా ప్రకారం తెలుగు లేదా తమిళ చిత్ర సీమ ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ (ఇన్నర్‌ గా ఒకటి బయటకి ఒకటి పెట్టుకోకుండా)గా ఉంటుందో, అలాగే బ్లాక్‌ మనీ అనేది బయటకి వస్తుందో అప్పుడు మన సౌత్‌ ఇండియన్‌ సినిమా రేంజ్‌ కూడా 1000 కోట్ల మార్కెట్‌ని టచ్‌ చేస్తుంది. అది కూడా చిటికేసినంత సింపుల్‌గా జరిగిపోతుంది. బాహుబలి సినిమాకి అలాంటి ట్రాన్స్పరెన్సీ కనిపించింది, అందుకే ఆ రేంజ్‌ కలెక్షన్స్‌‌ని సాధించింది. అది త్వరలోనే అన్ని సినిమాలకు జరుగుతుందని భావిస్తున్నాను.
 
మీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'మరుదనాయగం' ని ఎప్పుడు మొదలు పెట్టనున్నారు?
నా ప్రకారం మంచి సినిమాలు ఎప్పుడన్నా ఆడుతాయి. బాహుబలి లాంటి సినిమా అప్పట్లో వచ్చినా బాగా ఆడేది. అలాగే మరుదనాయగం ఇప్పుడు వచ్చినా ఆడుతుంది. అప్పట్లో మరుదనాయగం ట్రైలర్‌ షూట్‌ కోసమే 8.7కోట్లు ఖర్చు పెట్టాం.. ఇప్పుడైతే ఇంకెంత ఉంటుందో ఊహించండి. ప్రస్తుతం మరుదనాయగం మీద వర్క్‌ అవుట్‌ చేస్తున్నాం. హాలీవుడ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ వారు కూడా ఈ సినిమాని రీస్టార్ట్‌ చేద్దాం అని అడుగుతున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరో 3-4 నెలల్లో ఆ సినిమాపై క్లారిటీ ఇస్తాం.
 
బాహుబలి లాంటి భారీ బడ్జెట్‌ సినిమా చేయాలి అంటే మీ లాంటి స్టార్‌ హీరోస్‌ వల్లనే అవుతుంది. మరి మీ నుంచి అలాంటి సినిమాని ఆశించవచ్చా.?
మామూలుగా అలాంటి సినిమాలు చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ప్రస్తుతం నేను ఓ మంచి కంటెంట్‌ ఉన్న సినిమాని వరల్డ్‌ స్టాండర్డ్స్‌ క్వాలిటీతో నాలుగు నెలల్లో ఫినిష్‌ చేసేసే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. మహాభారత్‌లోని కొన్ని పాత్రలు చేయాలనీవుంది.
 
తదుపరి సినిమా గురించి చెప్పండి.?
ప్రస్తుతం రాజీవ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాను. అందులో నాతో పాటు సీనియర్‌ యాక్టర్స్‌ అమల అక్కినేని, జరీన వాహీబ్‌‌లతో పాటు ఓ కొత్త హీరోయిన్‌ కూడా నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్‌ చాలా వరకూ అమెరికాలో ఉంటుంది. అది కూడా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో చిత్రిస్తాం అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu