''హిందూ దేశంలో వున్నాం. అలాంటప్పుడు ఒక హిందూ మతాన్నో, ముస్లింలనో, క్రిస్టియన్స్‌నో, జైన్స్, సిక్స్ ఇలా ఏ మతం వారైనా కానీ అందరినీ నా కుటుంబ సభ్యులుగానే చూస్తాను. కాబట్టి ఎవరినో కించపరచాలని నేను సినిమా తీయను'' అని కమల్ హాసన్ చెప్పారు. తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్ పిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్స్‌పై ఈరోస్ ఇంటర్నేషనల్ సమర్పణలో 'ఉత్తమ విలన్' రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రై.లి.బ్యానర్‌పై సి.కళ్యాణ్ అందిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే1 న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం నాడు హైదరాబాద్ వచ్చిన ఆయనతో జరిపిన చిట్‌చాట్..
మీ ప్రతి సినిమాకు ఏదో కాంట్రవర్సీ అవుతుంది? కారణమేమంటారు?
కొంతమంది కావాలని కాంట్రవర్సీ చేస్తున్నారు. సినిమా ఎలా తియ్యాలి, ఎలా రిలీజ్ చెయ్యాలనేది వారి దగ్గరనుంచి నేర్చుకుంటున్నాం. మేం తీసిన సినిమాని చూసి రిలీజ్ చెయ్యాలా వద్దా అనేది కొంతమంది చెప్తారట. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరుగకూడదు. మద్రాస్‌లో ఎవరో కేసు వేశారట. మీకు వేరే పనిలేదా? దేశంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు వున్నాయి. డిస్కస్ చెయ్యడానికి అని జడ్జిగారు వారితో అన్నారట. మేం దీని ద్వారా నేర్చుకున్న కొత్త విషయం ఏమిటంటే మా పని మేం కరెక్ట్ చేస్తే ఎవరికీ ఎలాంటి చెడ్డ ఫీలింగ్ రాదు. హిందూ మతం ఎక్కువగా వున్న ఈ దేశంలో ఆ మతానికి వ్యతిరేకంగా సినిమా తియ్యాలని ఎందుకనుకుంటాము. అన్ని మతాల వారు నా కుటుంబానికి సంబంధించినవారే అని ఫీల్ అయ్యే కళాకారుడ్ని.
ఉత్తమ హీరోగా కాకుండా ఉత్తమ విలన్‌గా ఎందుకొస్తున్నట్టు?
అందరిలోనూ ఒక విలన్ వుంటాడు. నేను చేసే కొన్ని విషయాలు మీకు నచ్చకపోవచ్చు. కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్‌లో అందరూ విలన్స్ అయిపోతారు. అలా ఈ సినిమాలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను విలన్‌ని.
ఈ చిత్రానికి ఇన్‌స్పిరేషన్ ఏమైనా వుందా?
చాలామంది కళాకారులు ఇన్‌స్పిరేషన్. అలాగే నేను కూడా దానికి ఇన్‌స్పిరేషనే. ఇది ఒక ఫిల్మ్ యాక్టర్ లైఫ్ గురించి తీసిన సినిమా. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కానీ, ఈ సినిమా స్పెషల్‌గా వుంటుంది. ఇందులోని విషయాల్ని చాలా డిఫరెంట్‌గా చెప్పాం.
అంటే సెటైర్లు కానీ, సందేశాలుకానీ వుంటాయా?
ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సెటైర్ వుంటుంది. రాజకీయం తీసినా, హాస్యం తీసినా అవి వుంటాయి. వాటిని స్మూత్‌గా చెప్పడమే సినిమా. ఇందులో ఏమి వున్నాయని చూశాక మీరే చెప్పండి.
కేరళ నృత్యాలు కూడా చేశారే?
డాన్స్‌పరంగా చాలా రిహార్సల్స్ చేశాం. చాలా కష్టపడ్డాం. చాలా మంచి కొరియోగ్రాఫర్స్ మా సినిమాకి పనిచేశారు. ఈ సినిమాలో ఒక గ్రూప్ డాన్స్ వుంటుంది. అలాంటి గ్రూప్ డాన్స్ ఏ ఇండియన్ సినిమాలోనూ రాలేదు. ఒక హాలీవుడ్ సినిమాలోని డాన్స్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఆండ్రియా, పూజ... హీరోయిన్లకు మళ్ళీ తీసుకున్నారు. కారణం?
వాళ్ళు బాగా నటిస్తారనీ, ఏం చేయకూడదా? గతంలో శ్రీదేవితో 27, శ్రీప్రియతో 17, ఖుష్బూతో 6 చిత్రాల్లో నటించాను.
వయస్సు పెరుగుతున్నకొద్దీ. ఏజ్ తగ్గిపోతుందే?
ఏజ్ అంటే ఏమిటి?.. దాని గురించి ఆలోచించను. మనస్సే ఏజ్‌ను ఫిక్స్ చేస్తుంది. హీరోయిన్లను దృష్టిలో పెట్టుకుని మీరు అడిగితే కనుక.. ఆ ఏజ్ దాటిపోయాను.. (నవ్వుతూ)
దశావతారంలోలా ఉత్తమ విలన్‌లోనూ శతాబ్దం నాటి కథను తీసుకోవడానికి కారణం?
కథలో భాగమే... ప్రత్యేకంగా సినిమా వుండాలి కదా. చూస్తే మీకే తెలుస్తుంది.
మీ చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఆ దిశగా తీయడంలేదా?
కమర్షియల్‌గా ఆడాలని అందరూ తీస్తారు. సత్యజిత్‌రే లాంటి వారు కూడా కమర్షియల్‌గా ఆడాలని చూస్తారు. అవార్డు కోసం చూడరు కదా.. సినిమాలో ఎంత కొత్తదనం వుందనేది చూసేవారు చాలామంది వుంటారు. వారికి చేరువవుతుంది.
'విశ్వరూపం'లో కొత్త టెక్నాలజీ ఉపయోగించారు? మరి దీనికి?
అది అప్పట్లో బాగుందని చేశాం. కానీ ఈ సినిమాకు అవసరం లేదని వద్దనుకున్నాం.
మీరు తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నారని తెలిసింది?
అవును. ఈ సంవత్సరం తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసే ఆలోచన వుంది. ఆ వివరాలు త్వరలోనే తెలుస్తాయి అన్నారు.
రజనీసార్‌తో కలిసి నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి?
నాకూ తెలిసింది... ప్రస్తుతానికి ఈ చిత్రం గురించే మాట్లాడుకుందాం అని ముగించారు.