''కొత్తగా వచ్చినప్పుడు చేసిన పెద్ద బేనర్‌లో పారితోషికం రాకపోగా, పేరు కూడా రాలేదు. అందుకే సినిమాసినిమాకు కథలో వైవిధ్యాన్ని చూపించాలనే తాపత్రయం నాది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి కథ ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా. 'జోరు' సినిమాలో వైవిధ్యం కన్పిస్తుంది'' అని సందీప్ కిషన్ తెలియజేస్తున్నారు. ఈ చిత్రానికి 'గుండెల్లో గోదారి..' దర్శకుడు కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించారు. ఈ నెల 7న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ పలు విషయాలు వెల్లడించారు.
'జోరు' ఎలా వుండబోతుంది?
నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్న చిత్రమిది. రెండున్నర గంటలు నాన్‌స్టాప్ కామెడీగా అలరిస్తుంది. కథలోని అనూహ్య మలుపులు, పాత్రల్లోని గందరగోళం నుంచి పుట్టే కామెడీ ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురిచేస్తుంది. వినోదం కూడా కొత్తకోణంలో వుంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా కథ, కథనాలు కొత్తగా వుంటాయి.
కన్‌ఫ్యూజ్ కామెడీ ఫార్ములా గతంలో చాలా వున్నాయి. జోరులో ప్రత్యేకత ఏమిటి?
ఫార్ములా పాతదే అయినా కథ, కథనాల్లో నవ్యత వుంటే ప్రేక్షకుల్ని మెప్పించవచ్చు. సినిమాలోని ముగ్గురు హీరోయిన్లు అన్నపూర్ణ పేరుతో ఒకే పాత్ర చేయడం కథలో అత్యంత ఆసక్తికరమైన అంశం. ఇందులో నా పాత్ర పేరు సందీప్. అతనికి ఇద్దరు అమ్మానాన్నలుంటారు. అదెందుకో సినిమా చూస్తే అర్థమవుతుంది.
నాయకుడిగా కెరీర్‌ను చూసుకుంటే ఎలా అనిపిస్తుంది?
చిత్రసీమలో విజయానికున్న విలువే వేరు. ప్రస్థానం, గుండెల్లో గోదారి చిత్రాల్లో సవాలుతో కూడిన పాత్రల్ని చేశాను. నా నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. కానీ ఆ చిత్రాలు నా కెరీర్ పురోగతిలో దోహదపడలేదు.
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో తొలిసారి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాను. ఆ సినిమాతో కీలక మలుపు తిరిగింది. ప్రస్తుతం పెద్ద సినిమా అవకాశాలొస్తున్నాయి. ప్రతి సినిమాకు వంద శాతం అంకితభావంతో పనిచేయాలన్న సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. అదే సమయంలో ప్రయోగాత్మక చిత్రాలతోపాటు వైవిధ్యమైన కమర్షియల్ చిత్రాలు చేయాలనుకుంటున్నాను.
'జోరు'లో ప్రత్యేకతలు?
తొలిసారిగా బ్రహ్మానందంతో కలిసి నటిస్తున్నాను. సినిమాలో ఆయన పేరు పి.కె. (పెళ్లికొడుకు). చాలా అమాయకంగా కనిపిస్తూనే చక్కటి వినోదాన్ని పండిస్తారు. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. సినిమాలో మేమిద్దరం పౌరాణిక భాషలో మాట్లాడటం హైలైట్‌గా వుంటుంది. పాటలు కూడా సందర్భోచితంగా కన్నులపండువగా వుంటాయి.
సక్సెస్ తర్వాత పారితోషికాన్ని పెంచారనీ వార్తలు వస్తున్నాయి?
ఆ వార్తలో వాస్తవం లేదు. మీకో నిజం చెప్పాలి. ఏడు చిత్రాల వరకు నేను పారితోషికం తీసుకోలేదు. 'రారా కృష్ణయ్య' చిత్రానికి తొలిసారిగా పారితోషికం అందుకున్నాను. సినిమాలంటే విపరీతమైన తపనతో నేను ఇక్కడకు వచ్చాను. నేడు ఈ స్థాయికి రావడం గొప్ప అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నా. ఇక బడ్జెట్ విషయంలో నేను జోక్యం చేసుకోలేదు. ఒకవేళ చేస్తే కథల ఎంపికలో ప్రాధాన్యత తగ్గిపోతుంది.
కొత్త చిత్రాలు?
ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాను. దీనితోపాటు ఎన్‌వి ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న చిత్రం. ఈ రెండూ ప్రయోగాత్మక చిత్రాలే. మరో తమిళ చిత్రం కూడా వుంది. మరిన్ని వివరాలు త్వరలో చెబుతాను అన్నారు.