''సినిమాను తీసే టెక్నాలజీ మారలేదు. పరికరాలే మారాయి. తీసే సమయం తగ్గింది. ఖర్చు పెరిగింద"ని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'ఎర్రబస్సు' శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్రం గురించి పలు విషయాలను బుధవారంనాడు పాత్రికేయులకు వెల్లడించారు.
రీమేక్ చేయడానికి కారణం?
చేయకూడదని రూలు పెట్టుకోలేదు. మన నేటివిటీకి సరిగ్గా సరిపోతుందనీ, నేను పాత్ర చేయడానికి సరైందని భావించి చేశా. లోగడ ఎం.ఎల్.ఎ ఏడుకొండలు, సూరిగాడు, 'మామగారు' చేసినా వాటికి ప్రత్యామ్నాయం లేదని చేశాను. అలా ఫీలయి చేసిన పాత్ర తాత పాత్ర.
ఇది చేసేటప్పుడు తొలి చిత్రం 'తాత మనవడు' గుర్తుకు వచ్చిందా?
తొలి సినిమా కథ వేరు. ఈ కథ వేరు. కానీ తాత మనవుడు సెంటిమెంట్ అంతా ఒక్కటే. తండ్రి దగ్గర కంటే తాత దగ్గరే పిల్లలు చాలా చనువుగా వుంటారు. తండ్రి దగ్గర జరగని పనులు తాత చేత చేయించుకుంటారు. ఇప్పటి తరం తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తున్నా వారు పిల్లలు ఎలా అభివృద్ధి చెందాలనే ఆలోచిస్తారు. పిల్లలపై ప్రేమ వుంటుంది. కానీ అభివృద్ధి వేగం డామినేట్ చేస్తుంది. కాబట్టి రిటైర్ అయిన వారే పిల్లలకు దగ్గరవుతారు. అందుకే తాత మనవడు అనుబంధం తరతరాలకు తరగని బంధం.
మీ అనుభవాలు ఇందులో వున్నాయా?
నాకు ఊహ తెలీని వయస్సులోనే మా తాతగారు కాలం చేశారు. ఇప్పుడు మా పిల్లల పిల్లల్తో వున్న అనుబంధం పాత్ర పోషించడానికి దోహదపడింది.
విష్ణును ఏ కోణంలో చూపించగలిగారు?
ఇంతవరకు విష్ణు చేసిన యాక్షన్ సినిమాలు చూశాను. ఆయనలో తెలుగు నవలల్లో కథానాయకుడు కన్పిస్తాడు. ఒకవైపు ప్రేమించిన అమ్మాయి. ఇవతల తను ప్రాణంగా పెంచిన తాతయ్య గ్రామంలో వున్నాడు. అమెరికా వెళ్ళి మూడు నెలల్లో సెటిల్ అవ్వాలనుకున్న తను తాత కోసం ఏం చేశాడనేది కథ. ఇద్దరి మధ్య నలిగిపోయే పాత్రను బాగా రక్తి కట్టించాడు.
ఇప్పటి సినిమాల్లో మానవీయ విలువలకు తక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు?
సినిమా అనేది ఎంటర్‌టైనమెంట్ అయినా హ్యూమన్ రిలేషన్‌కు దగ్గరగా వుంటుంది. సినిమా నుంచి ఏం నేర్చుకోకపోయినా కుటుంబం, ఆప్యాయతలు కన్పిస్తాయి. ఇప్పటి యూత్ కూడా 50 ఏళ్ళనాటి సినిమాలు టీవీల్లో చూస్తున్నారనేందుకు అదే నిదర్శనం. ఆ చిత్రాల్లో కొన్ని విలువలు వున్నాయి. నేడవి విడిచిపెట్టి తీసేవారి తప్పుకాదు. ట్రెండ్ పేరుతో హీరో, హీరోయిన్, విలన్, మరో ఇద్దరు హీరోయిన్లు, ఐటంసాంగ్‌లు, కామెడీ పేరుతో అంత్యాక్షరి వంటివి పెడుతున్నారు.
అవి సక్సెస్ అయితే వెంటనే మరో చిత్రం అవుతుందనే ఆలోచనతో చేస్తున్నారు. గతంలో హిట్ 10 శాతం, ఎబోవ్ ఏవరేజ్ 20 శాతం, ఏవరేజ్ 40.. ఫెయిల్యూర్ 30 శాతం వుండేది. ఇప్పుడదంతా మారిపోయింది. అయితే హిట్ లేదంటే ఫ్లాప్. యాబై, వంద రోజులు ఆడే పరిస్థితి పోయింది. అదేమంటే ఎక్కువ థియేటర్లు వేశామంటారు. కానీ ఎక్కువ థియేటర్లు వేసినా ఆడిన రోజులున్నాయి. తమిళం, మలయాళం, హిందీలో అలా జరుగుతుంది.
సినిమా ట్రెండ్‌ను బట్టి తీస్తున్నారా?
ట్రెండ్ అంటే ఏమిటి? బిర్యానీ తినాలని హోటల్‌కు వెళితే అక్కడ సాంబారు అన్నమే వుంటే దాన్నే తిని వస్తాడు. నా దృష్టిలో సినిమా వీక్షకులు పెరిగారు. దాన్ని మనం సరిగ్గా వుపయోగించుకోలేకపోతున్నాం. అష్టాచెమ్మ నుంచి సీతమ్మ వాకిట్లో.. వరకు ఎలా ఆడాయి. ఆడితే అలాంటి చిత్రాలే వస్తాయి.
టెక్నాలజీ మారిపోతుంది కదా?
నా దృష్టిలో మారలేదు. సాంకేతిక పరికరాలే మారాయి. మొదట్లో కెమెరాపై వస్త్రం వేసి తీసేవారు. ఆ స్థాయి నుంచి ఒక్కో మెట్టు పెరిగింది. అయితే జిమ్మీజిప్ లేని రోజుల్లో ఆ షాట్స్ తీసేవాళ్ళం. స్టడీకామ్ లేకుండానే భుజాలపై మోసి తీసేవారు. పెద్ద క్రేన్ లేకపోతే కెఆర్ స్వామి అనే కెమెరామెన్ పెద్ద చెక్కను గుండ్రంగా చేసి దానిలో మిక్చర్ కెమెరా పెట్టి నాలుగు రోప్‌లతో కెమెరాను పైకి వెళ్ళేట్లు చేశారు. టెక్నాలజీ అభివృద్ధి చెందనప్పుడే వున్న పరికరాలతో అద్భుతంగా సినిమాలు తీశారు. ఇప్పుడు ఆ పేరుతో కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు.
సెల్‌ఫోన్‌నే తీసుకోండి.... దానిలో ఎన్నో ఆఫ్షన్లు వుంటాయి. కానీ చాలామందికి ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్, మెసేజ్‌లు ఎలా చూడాలి అనే వరకే తెలుసు. అలాగే కెమెరా టెక్నాలజీ కూడా. ఈ టెక్నాలజీ వల్ల సమయం తగ్గి, వ్యయం పెరిగింది. డిజిటల్ టెక్నాలజీ వల్ల ప్రింట్లు పెరగవచ్చు. రాష్ట్రంలోని అన్నిచోట్ల థియేటర్లు ఒకేలా వుండవు కనుక ప్రదర్శించేందుకు ఖర్చు పెరిగింది. టెక్నాలజీ వల్ల ఎంత వుపయోగమో 60, 70 కోట్లతో సినిమాలు తీసే నిర్మాతలకి బాగా తెలుసు అని చెప్పారు.