నిర్మాతగా తనకంటూ ప్రత్యేక హోదాను ఏర్పర్చుకున్న వ్యక్తి రామచంద్రారెడ్డి.. ఉరఫ్.. రాజు.. అందరూ పిలిచేది 'దిల్' రాజు. 'దిల్' సినిమా హిట్ కొట్టడంతో దాన్ని ఇంటిపేరుగా ఇండస్ట్రీ మార్చేసింది. అప్పటినుంచి ప్రతి చిత్రాన్ని తనే దగ్గరుండి చూసుకుంటూ... డా. డి. రామానాయుడుని ఆదర్శంగా తీసుకుని చిత్రాలు నిర్మిస్తున్నారు. తెలుగులోనే సినిమాలు నిర్మించే ఆయన తొలిసారిగా హిందీలో కూడా తన చిత్రాన్ని డబ్ చేయనున్నాడు. దానికి ఇంకా టైం పడుతుందని.. కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోయే సినిమాను డబ్ చేస్తానని ప్రకటించాడు. తాజాగా సునీల్‌తో 'కృష్ణాష్టమి' చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ఈనెల 19న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ..
ఇండస్ట్రీలో మొనోపొలీ వుంది.. 'ఆ నలుగురు' నిర్మాతల్లో మీరొకరని ప్రచారం వుంది?
అలా వుంటే.. నా సినిమాకు ఎందుకు థియేటర్లు దొరకవు. అదంతా ప్రచారం మాత్రమే. కృష్ణాస్టమి.. సినిమా ఆగస్ట్‌లోనే పూర్తయింది. సెప్టెంబర్‌లో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా విడుదల వల్ల అక్టోబర్‌లో 'కృష్ణాష్టమి' అనుకున్నాం. కాని ఆ సమయంలో వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత సంక్రాతికి అనుకున్నాం. అప్పుడూ నాలుగు సినిమాలు వచ్చాయి. థియేటర్లు లేవు. అదే మొనోపొలీ అయితే.. నాకెందుకు ఈ పరిస్థితి. ఇక్కడ ఎవరైనా సినిమాలు తీయవచ్చు. ప్రదర్శించవచ్చు.
అల్లు అర్జున్ కథ సునీల్‌కు ఎలా సెట్ చేశారు?
ఈ కథక నాకు దర్శకుడు గోపీచంద్ మలినేని 'పండగ చేస్కో' సినిమాకు ముందు చెప్పాడు. బావుందని అల్లు అర్జున్‌కి వినిపించాను. ఆర్య, పరుగు.. లాంటి సినిమాల తరువాత మన కాంబినేషన్‌లో వచ్చే సినిమా కొత్తగా ఉండాలని తను సూచించాడు. కరెక్టే అనిపించింది. ఈ కథను అప్పటికే నా బేనర్‌లో పలు సినిమాలకు పనిచేసిన వాసువర్మకు అవకాశం ఇవ్వడం కోసం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తే బావుంటుందని తనకి స్టొరీ చెప్పాను. ఆ కథను తను డెవలప్ చేశాడు. అయితే వాసు వర్మ అప్పటికే సాయి ధరం తేజ్‌తో 'లవర్' అనే సినిమా చేస్తున్నాడు. ఇక తేజుని 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాకు షిఫ్ట్ చేసి వాసుతో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాను. సునీల్‌కు కథ చెప్పగానే చేసేస్తానన్నాడు. అయితే పెద్దహీరోతో చేయాల్సిన కథ అని సంకోసించినా.. తన మార్కెట్ దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశాం.
'జోష్'తో డిజాస్టర్ ఇచ్చిన వాసుతో సినిమా ఎలా తీయగలిగారు?
'జోష్' విషయంలో తప్పంతా నాదే. వాసు వర్మ నాతో దిల్, ఆర్య, బొమ్మరిల్లు నుండి పని చేస్తున్నాడు. తనలో మంచి టాలెంట్ ఉంది. అలాంటి తనతో 'జోష్' సినిమా చేయడం కరెక్ట్‌కాదని సినిమా రిలీజ్ తర్వాత తెలిసింది. ఎందుకంటే... రిలీజ్ సమయంలో కాలేజీలలో ఎలాంటి ఎలక్షన్ గొడవలు లేవు.. లేని ఒక ఇష్యూని తీసుకొని జనాలపై రుద్దాలనుకోవడం పొరపాటు. అంతేకాకుండా నాగార్జున ఫ్యామిలీనుంచి వచ్చిన హీరోను ఎంపిక చేసుకోవడం తప్పు. ఫ్యాన్స్ కూడా గ్రాండ్‌గా వుంటుందని ఆశించారు. ఇక ఆ సమయంలో వైఎస్‌ఆర్ చనిపోవడం ఈ కారణాల వల్ల ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. అయినా ఆ తప్పులు హీరోల వలనో, దర్శకుల వలనో జరిగినవి కావు. ప్రొడ్యూసర్‌గా నా తప్పు.
'కృష్ణాస్టమి' ఎలాంటి కథ?
సింపుల్ స్టొరీ.. పక్క వాళ్లకు సమస్య వస్తేనే దాన్ని సాల్వ్ చేసే వ్యక్తి.. తనకు వచ్చిన సమస్యను ఎలా పరిష్కరిస్తాడో అనేదే కథ. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీశాం. సునీల్ నటించిన 'అందాల రాముడు','పూల రంగడు' సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొత్తగా ఉంటుంది. తనలో ఉండే ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా హీరోయిజం చూపించాం. ఆ ట్రీట్మెంట్ ప్రేక్షకులకు కొత్తగా వుంటుంది. నవ్విండచమేకాకుండా.. చివరల్లో కాస్త ఏడిపిస్తాడు కూడా.
మీ సినిమాల్లో రీష్యూట్‌లుంటాయెందుకు?
సినిమా అనుకున్నట్లు రాకపోతే రీషూట్స్, రీ ఎడిటింగ్స్, రీవర్క్ చేయడం మంచిదే. 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాకు 17 రోజులు రీషూట్ చేశాం. 'కేరింత' సినిమా కూడా ముప్పై రోజులు షూట్ చేసిన తరువాత నచ్చక మొత్తం మార్చేశాం. కాని సునీల్ సినిమాకు మాత్రం ఎలాంటి రీషూట్స్ చేయలేదు కాని రీ ఎడిటింగ్స్ చేశాను. ఆడియన్స్ డబ్బులు ఇచ్చి వాళ్ళ సమయాన్ని కూడా మనకు ఇస్తున్నారు. అలాంటప్పుడు రెండు గంటల పాటు వారిని ఆనందం ఇచ్చే బాధ్యత మాపై ఉంటుంది. కొత్తగా ఉంటుందని చెప్పను..
అన్ని సినిమాలు ఎందుకు ఆడవంటారు?
డెబ్బై శాతం ప్రేక్షకులకు నచ్చితే అది హిట్ కిందే లెక్క. ప్రేక్షకుల్లో అభిప్రాయాలుంటాయి. ఒక్కోసారి బాగాలేదని టాక్ వచ్చినా.. బ్రహ్మాండగంగా ఆడుతుంది. 'బాహుబలి' మొదటిషో చూసి కొందరు బాగోలేదన్నారు. నేను చూశాక.. ప్రభాస్‌కు ఫోన్‌చేసి బ్రహ్మాండం అన్నాను. మొన్నీమధ్య 'సోగ్గాడే..' సినిమా కష్టమని నా స్నేహితులు చెప్పారు. నేను చూశాను. నాకు నచ్చింది. ఆ తర్వాత ప్రేక్షులు తీర్పు తెలిసిందే. నిర్మాతనైనా ప్రేక్షకుడిగా నేను చూస్తా.
కృష్ణవంశీ సినిమా ఎప్పుడు?
త్వరలోనే.. దానికి 'రుద్రాక్ష' టైటిల్ అనే వార్తలు వినిపిస్తున్నాయి కాని ఆ టైటిల్ పెట్టకపోవచ్చు. ఆ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో చేసి హిందీలో డబ్ చేస్తున్నాం.
మీరు కాంబినేషన్‌లు చూసుకుంటారే?
కాంబినేషన్‌లు ఎన్నున్నా అసలు కథలేకపోతే... సినిమా ఆడదు. నా దృష్టిలో కథే హీరో. ఆ తర్వాత ఏ కాంబినేషన్ అయినా. కొన్ని అగ్రహీరోలున్న సినిమాలు హిట్‌కాలేదు. కారణం సరైన కథలేకపోవడమే.
పవన్‌తో సినిమా అన్నారు ఎప్పుడు?
వపన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనేది నా జీవితాశయం. ఇద్దరం మాట్లాడుకున్నాం. కథ కుదిరాక వెల్లడిస్తా.
ఒకేసారి నాలుగు సినిమాలు ఎలా చేయగలుగుతున్నారు?
ఎన్నో కథలు విన్నా. దాన్ని జస్టిఫై చేయగల సత్తా నాలో వుంది. అది చిన్నతనం నుంచి అలవడింది. నేను విన్న కథ.. నా టీమ్‌కు వినిపిస్తాను. అందులో ఏవైనా లోపాలుంటే చెప్పమంటా. దాన్ని వారు సరిగ్గా ఎనలైజ్ చేసేట్లుగా వుంటారు. అన్నీ కుదిరాక.. సెట్ పైకి వెళ్ళడం ఈజీ. నా బ్రదర్స్ కూడా నాతో వుండటంతో సులువుగా వుంది.