నందమూరి బాలకృష్ణ హీరోగా, అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాస్వ క్రియేషన్స్ బ్యానర్ పైన శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం 'డిక్టేటర్'. 14న సంక్రాంతి కానుకగా విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్‌తో ఇంటర్వ్యూ.
సంక్రాంతి తర్వాత కలెక్షన్లు తగ్గినట్లు తెలుస్తోంది?
రిలీజ్ రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే.. ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సహజంగానే కలెక్షన్స్ నాలుగు సినిమాలు ఖచ్చితంగా షేర్ చేసుకున్నట్లు ఉంటుంది. కాని సినిమా కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వలేదు. బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. మొదటి నుండి నైజాంలో బాలయ్య గారి సినిమాలకు కలెక్షన్స్ తక్కువగానే ఉంటాయి. కాని ఈ సినిమా కలెక్షన్స్ మేము అనుకున్నట్లుగానే వచ్చాయి. ఈ వీకెండ్ నుండి ఓవర్ ఫ్లో మొదలవుతుంది.
బయ్యర్స్‌కు 15% డిస్కౌంట్ ఇవ్వడానికి కారణం?
ఈ సినిమా బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నాకు తెలిసినవాళ్ళే. మంచి ఫ్యాన్సీ రేట్లకు సినిమాను కొనుగోలు చేశారు. అడ్వాన్సులు కూడా ఇచ్చారు. కాని 4 సినిమాలు రిలీజ్ ఉండటం వలన థియేటర్ల సమస్య వచ్చింది. 30 థియేటర్లు అనుకుంటే 15 మాత్రమే దొరికేవి. దాంతో డిస్ట్రిబ్యూటర్స్‌కు డబ్బులు ఇవ్వడం కష్టం అయింది. సహజంగానే కొంతమంది సినిమా రిలీజ్‌కు ముందు రోజు చెప్పి ఇబ్బంది పెడతారు. కానీ వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 15 రోజుల ముందుగానే చెప్పారు. నేను ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళతో మాట్లాడి బాలయ్య సమక్షంలో 15% డిస్కౌంట్ ఇప్పించాను. ఈరోజు బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు.
బాలకృష్ణ గారి కోసమే కథ రాసుకున్నారా?
'లౌక్యం' సినిమా తరువాత ఆయన నన్ను పిలిపించి నా 99 వ సినిమా మన కాంబినేషన్‌లో చేద్దామని చెప్పారు. కేవలం నామీద నమ్మకంతో ఆయన సినిమా చేయడానికి ఓకే చెప్పారు. కాబట్టి బాలయ్య ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ బాధ పడకుండా క్లాస్ టచ్‌తో ఉండే సినిమా చేయాలనుకున్నాను. కథ రెడీ అవుతున్న సమయంలో టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉండాలని క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలని 'డిక్టేటర్' అనే టైటిల్‌ను సెలెక్ట్ చేసుకున్నాం. అందరూ సేఫ్‌గా వుండాలనే సేఫ్ సైడ్‌లో వెళ్ళాను.
దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కష్టం అనిపించలేదా?
మొదట ఈ సినిమాకు డైరెక్షన్ మాత్రమే చేయాలనుకున్నాం. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వారు తెలుగులో సినిమాలను ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుసుకొని కలిశాను. అయితే వారు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎవరోకరు ఉండాలని భావించారు. ఒక నెలపాటు వాళ్ళతో ట్రావెల్ చేసాక నన్నే ప్రొడక్షన్ చూసుకోమని చెప్పారు. దాంతో వేదాస్వ క్రియేషన్స్ బ్యానర్ స్థాపించాను. భవిష్యత్తులో కూడా ఈరోస్ వాళ్ళతో కలిసి ప్రాజెక్ట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.
బాలకృష్ణతో సినిమా ఎలా అనిపించింది?
నన్ను మొదట్లో అందరూ భయపెట్టారు. కానీ ఆయనతో ట్రావల్ అయ్యాక.. ఆయన మంచితనం తెలుస్తుంది. ఆయన చుట్టూ ఉండేవాళ్ళు నీతిగా, నిజాయితీగా, సింగిల్ ఫేస్‌తో ఉండాలని భావిస్తారు. నేను కూడా ఆయనలానే ఉంటాను కాబట్టి నాకు బాగా దగ్గరయ్యారు. ఒక కుటుంబ సభ్యుడిలాగా చూసుకున్నారు. 95 రోజుల షూటింగ్ సమయంలో ఆయన ఒక్కరోజు కూడా సీరియస్ అవ్వడం చూడలేదు. సినిమా ముగింపు గుమ్మడికాయ ఫంక్షన్‌లో టీం అందరికి సక్సెస్ పార్టీలు, అందరిని పిలిచి డబ్బులు ఇచ్చారు. నా పర్సనల్‌గా బాలకృష్ణ గారితో ఒక కొత్త పాయింట్ తీసుకొని సినిమా చేయడం కంటే అందరికి అర్ధమయ్య పాయింట్‌ను తీసుకొని కొత్తగా చూపించాలనుకున్నాను.
మీకేమైనా గిఫ్ట్ ఇచ్చారా?
బాలకృష్ణ గారు నాకిచ్చిన ఇంపార్టెన్స్ నాకు పెద్ద గిఫ్ట్. నారా చంద్రబాబునాయుడు గారు ఫోన్ చేసి సినిమా చాలా బాగా చేసావని, సంక్రాంతి రోజు మంచి గిఫ్ట్ ఇచ్చావని చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో సమానంగా నన్ను చూడటం చాలా సంతోషంగా అనిపించింది.
అనిల్ అంబాని డ్రెస్‌కోడ్ వేశారని వార్తలు వచ్చాయి?
హీరో డ్రెస్ అదికాదు. కొత్తగా చేయాలి. నేను మొదట ఏం చేయకూడదో..? రాసుకున్నాను. లైట్‌గా డీసెంట్‌గా ఉండే కలర్స్ కాస్ట్యూమ్స్‌గా ఉపయోగించాం. హెయిర్ స్టైల్ కొత్తగా ఉండాలని ట్రై చేశాం. బాలకృష్ణ గారు చెప్పే డైలాగ్స్ కూడా అరిచినట్లు కాకుండా స్మూత్‌గా ఉండాలి. హాలీవుడ్ హీరోలు వాడే కలర్స్ వాడాను. అనిల్ అంబానీ డ్రెస్‌కోడ్‌కు దీనికి సంబంధంలేదు.
రతి పాత్ర ఎవరికైనా సింబాలిక్కా?
కానేకాదు. ఒక పవర్‌ఫుల్ లేడీ విలన్ వుండాలని అలా రాసుకున్నాం.
విజయ యాత్ర ప్రారంభిస్తున్నారా?
శుక్రవారం నుంచి విమానంలో విశాఖ వెళ్ళి.. అక్కడ ఓ ఫంక్షన్‌లో హాజరై బ్రమరాంబ థియేటర్‌కు వెళతాం. ఆ తర్వాత కాకినాడ, రాజమండ్రి, విజయవాడ వంటి ప్రాంతాల్లో పర్యటిస్తాం. బాలకృష్ణ, నేను, నటుడు పృథ్వీ వుంటారు అని తెలిపారు.