Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమె బూతు అన్నట్లు చూసింది... అంజలి మహానటి అవుతుంది... బాలకృష్ణ ఇంటర్వ్యూ

Advertiesment
Dictator balakrishna interview
, శుక్రవారం, 1 జనవరి 2016 (21:31 IST)
నేను డిక్టేటర్‌నే.. నా పనిలో నేను డిక్టేటర్‌నే.. అంటే నియంతగా వుంటాను. ఒక క్రమశిక్షణలో వుండేవాడిని.. అంటూ నందమూరి బాలకృష్ణ తెలియజేస్తున్నాడు. శ్రీవాస్‌ దర్శకత్వంలో ఆయన తాజాగా నటిస్తున్న సినిమా 'డిక్టేటర్‌'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సంగతులు.
 
2016లో డిక్టేటర్‌ మీ ఫ్యాన్స్‌కు ఎలాంటి సినిమా ఇవ్వబోతున్నారు?
ముందు కథ, కథలోని పాత్రలు చాలా బాగుంటాయి. ఎందుకనో నా సినిమాలకన్నీ యాదృశ్చికంగానే ఆంగ్ల టైటిల్స్‌ వస్తున్నాయి. డిక్టేటర్‌ అంటే నియంత. తననుకున్నది జరగాలి. నా పాత్ర కూడా అలాంటిదే. దర్శకులంతా నాలో వున్న వివిధ కోణాలు అలా చూపిస్తుంటారు. బోయపాటి శ్రీను కానీ, మరొకరు కానీ.. నా మేనరిజం.. నా ఆవేశంలోని ఓ పాయింట్‌ పట్టుకుని కథలు తయారుచేస్తారు. నా ఆంగికం కూడా సినిమాల్లో పెట్టేస్తుంటారు. గెడ్డంను చేతితో సవరదీసుకుంటూ మెడవైపు చేయి పెట్టడం నా మేనరిజం. దాన్ని 'సింహా'లో పెట్టేశారు. ఒకరకంగా నేను నియంతనే.. క్రమశిక్షణలో కానీ, ఆర్టిస్టులకు మర్యాద ఇవ్వడంలోకానీ.. నాన్నగారి నుంచి నేర్చుకున్న లక్షణాలే ఈ నియంత. ముందుగా దర్శకుడు టైటిల్‌ పెట్టినప్పుడు భయపడ్డాను. ఆ టైటిల్‌కు రీచ్‌ కావాలి అని చెప్పాను. డబ్బింగ్‌ చెప్పినప్పుడు చూసుకుని అనుకున్నదాని కంటే బాగా వచ్చిందనిపించింది.
 
దర్శకుడే నిర్మాతగా మారడానికి కారణం?
దర్శకుడిలో కసి వుంది. తను నమ్మిన కథను బాగా తీస్తాననే కాన్‌ఫిడెన్స్‌ రావడంతో.. ఈరోస్‌ అనే ఇంటర్‌నేషన్‌ బేనర్‌తో తను కలిసి సినిమా చేశాడు.
 
ఇందాక క్రమశిక్షణ అన్నారు.. తెల్లావారుజామున 3 గంటలకు లేచి ఏయే పనులు చేస్తుంటారు?
నేను సినిమా వాడ్ని.. నా డైలాగ్‌లు... దాన్ని కాపాడుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటాను. ప్రిపేర్ అవుతాను. పొద్దునే లేవడం అనేది నాన్నగారి నుంచి తూ.చ. తప్పకుండా నేర్చుకున్నాను. నాన్నగారు లేచి వ్యాయామం.. పూజ చేసేవారు. నేను గంట సేపు పూజ చేస్తాను. మా ఇంట్లో ఎవ్వరూ నిద్రలేవక ముందే నేను లేచి ఈ కార్యక్రమాలు పూర్తిచేస్తాను. ఈ రోజు ఏం చేయాలి.. అనేవి.. షూటింగ్‌ విషయాలు కావచ్చు. నియోజకవర్గ విషయాలు కావచ్చు. కేన్సర్‌ ఆసుపత్రి విషయాలు కావచ్చు. వాటికి ఎలా ప్రిపేర్‌ కావాలో చూసుకుంటాను. 
 
ట్రైలర్‌ చూశాక.. చాలా యంగ్‌గా కన్పిస్తున్నారు. సీక్రెట్‌ ఏమిటి?
నేను హోంవర్క్‌ చేయను. పాత్ర ఇన్‌స్పైర్‌ చేస్తుంది. జనరల్‌గా బాడీ మౌల్డింగ్‌ను చేసుకుంటాను. సమరసింహారెడ్డి టైమ్‌లో లావుగా వుండాలి.. మామూలుగా వుండాలి. కొన్ని నియమనిష్టలతోనే అది సాధ్యం. డిక్టేటర్‌లో బిజినెస్‌ బ్యాక్‌డ్రాప్‌ తీసుకున్నాం. చాలా రిచ్‌గా వుండాలి. అసలు దేశాన్ని పాలిస్తుంది మంత్రులు, నాయకులు కాదు.  బ్యూరోక్రాస్ట్స్‌. దేశ ఆర్థిక వ్యవస్థను మనిషి శాసిస్తున్నారు. అది సినిమా కథలో ఓ మలుపు..
 
మీ చిత్రాలంటే అన్నీ విస్తరిలో వడ్డించినట్లు వుంటాయి. ఇందులో కూడా వున్నాయా?
సినిమా అంటే అన్నీ వుండాలి. మేము నిత్యావసర వస్తువులాంటివాళ్లం. బాలకృష్ణ సినిమా అంటేనే థియేటర్‌కు వచ్చి చూడాలి. పైరసీని అస్సలు పట్టించుకోను. నా సినిమాలు అలా చూస్తే మావాళ్ళకు తృప్తి వుండదు. థియేటర్‌లో చూసి.. అన్ని రసాలు వుంటేనే ఆంనదిస్తారు. థియటర్లలో కాగితాలు చించడం, చప్పట్లు కొట్టడం, డబ్బులు విసరడం అనేది మా సినిమాలతోనే సాధ్యం. మల్టీప్లెక్స్‌ థియేటర్లలో కూడా అలా డబ్బులు విసరడం సింహా, లెజెండ్‌ సినిమాతోనే మొదలయింది. అందుకే పైరసీ వచ్చి నా సినిమాను బ్రేక్‌ చేస్తుందనే ఢోకా లేదు. పైరసీ చూస్తే మజా వుండదని వారికి తెలుసు. జనాల్లో చూసి ఎంజాయ్‌ చేయాల్సిందే.
webdunia
 
అంజలితో తొలిసారిగా నటించారు?
సోనాలి చౌహాన్‌ కూడా వుంది. తను లెజెండ్‌లో చేసింది. యంగ్‌స్టర్స్‌ కొందరిని అడగడం జరిగింది. వారి పేర్లు అనవసరం. దేనికైనా కొత్తవారు రావడం.. వారిని ఎంకరేజ్‌ చేయడం మంచి పద్ధతి. వారికి అదృష్టం కూడా. నా సినిమాల్లో నటించిన హీరోయిన్లకు పేరు వస్తుంది. 'శ్రీరామరాజ్యం'లో కాస్టింగ్‌ లేకపోతే సినిమాలేదు.. 'రానా'లో ఒకామెను సిస్టర్‌గా అనుకున్నాం. ఆమెకు ఈ విషయం చెబితే.. సిస్టారా! అంటూ బూతులా వుందనేట్లు ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. నాన్నగారు సావిత్రితో హీరోయిన్‌గా చేశారు. 'రక్తసంబంధం'లో సిస్టర్‌గా ఆమె చేసింది. ఆర్టిస్టు ఇవన్నీ తెలుసుకోవాలి. ఏదో ఒక పాత్ర వేసి అవే పాత్రలు కావాలంటే ఎలా.. ఒక్కోసారి అనుకున్న ఫలితం రాకపోవచ్చు. దానిగురించి బాధపడకూడదు. సోనాల్‌ చౌహాన్‌కు నాపై నమ్మకం.. కథ కూడా వినలేదు. నా సినిమా అనగానే ఒప్పేసుకుంది. డేట్స్‌ కూడా వీలుచూసుకుని ఇచ్చేసింది.
 
ఇక అంజలి తెలుగమ్మాయి. ఇండస్ట్రీలో ఒక్కశాతం కూడా తెలుగువారు లేరు. ఆమె ఒక సావిత్రిలా మంచి టాలెంట్‌ వున్న నటి. ఇప్పటికే ఒక ఇమేజ్‌ వున్న ఆమెకు ఈ సినిమా మరో మలుపు అవుతుంది. రైటర్‌ కోన డైలాగ్స్‌.. యూనిట్‌ కృషి.. మంచి సినిమాగా మార్చాయి. అయితే.. నాలాగే తను లొడలొడ వాగేస్తుంది. ఈ విషయమే దర్శకుడితో చెప్పాను. ఇప్పుడు ఇద్దరినీ కంట్రోల్‌ చేయడం కష్టం అని చెప్పాను.. అమ్మాయికి చాలా గ్రాస్పింగ్‌ వుంది. టైంకు విలువ ఇస్తుంది. మహానటి అవుతుంది.
 
మీ సినిమాలో మహిళలు మెచ్చే డైలాగ్‌లు వుంటాయి. ఇందులోనూ వున్నాయా?
సమాజంలో మహిళలపై రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి. లైంగిక దాడులు, యాసిడ్‌ దాడులు, చైన్‌ స్నాచింగ్‌ ఇలా వున్నాయి. 'సింహాలో' యాసిడ్‌ దాడి గురించి, లెజెండ్‌లో.. చెల్లెలు కట్నం గురించి, ఆడపిల్ల పుట్టడం నేరం అనేదానిపై చూపించాం. అలాగే డిక్టేటర్‌లోనూ మరో కోణం వుంది. ఇందులో సోనాల్‌.. ఆర్టిస్టు.. వేషాల కోసం వెతుక్కుంటుంది. తన అన్నయ్య మీడియేటర్‌ దగ్గర డబ్బులు తీసుకున్నాడనీ.. ఈమెను హింసిస్తుంటాడు. ఆ సమయంలో నేను పరిచయం కావడం.. ఆమెతో క్లోజ్‌గా వుండగానే.. వీడు హీరో అంట్రా.. అంటూ నాతో ఎకసెక్యాలు ఆడటం.. ఆ తర్వాత వాడి విజిటింగ్‌ కార్డు నాకు ఇచ్చి.. ఏదైనా అవసరం వస్తే ఇక్కడి రా అని అనడం జరుగుతుంది. ఆ తర్వాత సోనాల్‌.. కిడ్నాప్‌ అవుతుంది. ఎవరు చేశారో తెలీక గందరగోళంగా వున్న టైంలో.. వాడిచ్చిన విజిటింగ్‌ కార్డు కన్పించడంతో.. అప్పుడు కొన్ని డైలాగ్స్‌లు, యాక్షన్‌ సీన్సు.. అద్భుతంగా పండాయి. 
 
'ఆడదని తప్పుడు కూతలు కూస్తే ఊరుకున్నా.. పాడు చేసి చంపేస్తానంటే మూసుకూర్చున్నాననుకుంటావా.. అంటూ ఆవేశంగా పలికే డైలాగ్స్‌ అలరిస్తాయి. బాలకృష్ణ సినిమా అంటే అన్నీ సెక్షన్లు ఆకట్టుకొనేలా వుండాలి. అన్ని రుచులు వుండాలి. 
 
ఆడియో వేడుక రాజకీయ వేదికలా అనిపించింది?
అమరావతిలో మొదటసారిగా చేశాం. ఇంత విలువైన అభిమానం దొరకడం పూర్వజన్మ సుకృతం. కాళిదాసు చెప్పినట్లు.. ఒక జన్మలో ఒకర్ని పొందడం పోయినజన్మలో చేసిన పుణ్యం. అలాంటిది ఇంతమందిని పొందడం.. వెలకట్టలేని విడదీయలేని అనుబంధం ఏదో వుంది.
 
ముమైత్‌,, శ్రద్దాదాస్‌తో ఐటంసాగ్‌ ఎలా వుంది?
కొన్నికొన్ని సినిమాలు అన్నీ కుదురతాయి.. లెజెండ్‌.. అన్నీ అద్భుతాలే. దేవీశ్రీ అని ఊహించలేదు. గనేష్‌పై పాట వుంది. ఇందులోనూ 'ధనధన.. దన ఆంధ్రా తెలంగాణ. అదిరే సూపర్‌ జోడీ మనదే... ధనధన కడప కర్నూలు బాజా..  నన్ను నిన్ను చూసి జనం విజిల్‌ వేయాలి' అనే పాట హైలైట్‌గా నిలుస్తుంది.
 
నిర్మాణపు వాల్యూస్‌ ఎలా అనిపించాయి?
చాలా రిచ్‌గా చేశారు. బల్గేరియాలో ఓ హోటల్‌లో చేశాం. మలేషియా రిచ్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథ. దానికి మ్యాచింగ్‌... హర్యానాలో ఓ స్టార్‌ హోటల్‌లో చేశాం. ప్రైవైట్‌ జెట్‌లు తీసుకున్నాం. ఢిల్లీలో ఎయిర్‌పోర్టు పర్మిషన్‌ తీసుకున్నాం. దానికి మ్యాచింగ్‌ హైదరాబాద్‌లో చేశాం. ఇలా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మాతలు రిచ్‌ వాల్యూస్‌తో తీశారు.
 
రతి అగ్నిహోత్రి విలన్‌గా చేయడం ఎలా అనిపించింది?
పోతులూరి వీరబమ్రేశ్వరస్వామి చరిత్రలో ఆమెతో నటించాను. అప్పట్లో స్టూడెంట్‌ను. సెలవ్‌ పెట్టి  షూటింగ్‌కు వచ్చెయ్‌ అనేవారు నాన్నగారు. ఆ సినిమాలో ఇన్‌వాల్వ్‌ అయి చేశామన్నారు. కానీ అలాంటిది ఏమీలేదు. నాన్నగారంటే భయంతో చేశాను. పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ.. ఆవిడ చాలా బాగా నటించింది. చాలా రిచ్‌గా కన్పించాలి. ఆ పాత్రకు కొంతమందిని అనుకున్నాం.. ఒకరోజు సడెన్‌గా.. దర్శకుడు ఆమె పేరు చెప్పారు. వెంటనే ఓకే చేసేయండి అని చెప్పాను. ఆమె పాత్ర చాలా హుందాగా చేసింది. నాకు ఒకరు బంగారు ప్లేకార్డ్‌ ప్రజెండ్‌ చేశారు. వాటిని దాచుకోవాలి. అలాంటివి.. ఆమెకు ఇచ్చి.. మొదటి షాట్‌ తీశాం. ఎందుకంటే షాట్‌లో అంత రిచ్‌ అని తెలియాలి.. ఇలా కొన్ని ప్రాపర్టీని స్వంతమైవని.. అవసరం మేరకు షూటింగ్‌లో వాడేస్తుంటాను. నాన్నగారు కూడా అంతే.
 
డాన్స్‌తో పాటు యాక్షన్‌ కూడా చేశారు?
నేను యాక్షన్‌ సీన్లు అంతా నాచురల్‌గా చేస్తాను. గ్రాఫిక్స్‌ పెడదామని అంటే ఒప్పుకోను. లెజెండ్‌లో గ్లాస్‌ బ్రేక్‌ చేయాలి.. మీరు ఇలా అనండి.. గ్రాఫిక్స్‌లో ముక్కలయినట్లు చూపిస్తామని దర్శకుడు చెప్పాడు. వద్దని నేనే చేశాను.. ఇందులోనూ అలా చేశాను. బల్గేరియాలో అక్కడి ఫైట్‌ మాస్టర్‌ చేశాడు. ఇక్కడ రవివర్మ అనే ఫైట్‌ మాస్టర్‌ చేయించాడు.
 
డిక్టేర్‌ను ఒక్క మాటలో ఎలా చెబుతారు?
డైలాగ్‌లో చెప్పేశాను. డిక్టేటర్‌ ఇంట్రడక్షన్‌ చాలా క్రూరంగా వుంటుంది. అంతే స్టయిలిష్‌గా వుంటుంది. నాపేరు చంద్రశేఖర్‌.. నా అహం.. డిక్టేటర్‌ అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu