Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ధనలక్ష్మి...'తో ఈ ఏడాది నాకు ఓ పెద్ద గిఫ్ట్ లభించింది... ఎడిటర్‌తో 'సరదాగా ఓ సాయంత్రం...'

Advertiesment
dhanalakshmi talupu tadithey Editor Siva Interview
, సోమవారం, 31 ఆగస్టు 2015 (21:23 IST)
సినిమా దృశ్యమాలిక క్రియేటర్ డైరెక్టర్. ఐతే ఆ డైరెక్టర్ విజువలైజేషన్‌కు 100% న్యాయం జరగాలంటే తగిన టెక్నీషియన్లు కూడా తోడవ్వాలి. ఇటీవల 'బాహుబలి' తర్వాత 'శ్రీమంతుడు' రెండు అతిపెద్ద భారీ చిత్రాల మధ్యలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన చిత్రం 'ధనలక్ష్మి తలుపు తడితే...'. ఈ చిత్రానికి దర్శకుడు సాయి అచ్యుత్ చిన్నారి.  ధనరాజ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ సంయుక్తంగా నిర్మించారు. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీకి తన టీంలో కొత్తవారికి కూడా అవకాశాన్ని కల్పించారు. ఇంకా యంగ్ టాలెంట్‌ను గుర్తించి మరికొందరికి అవకాశం ఇచ్చారు. అలాంటి వారిలో ఎడిటర్ శివ వై.ప్రసాద్ ఒకరు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు...
 
మీ నేపథ్యం?
మాది మంగళగిరి దగ్గర పెదవడ్లపూడి. నాన్న లారీ డ్రైవర్. బిఎస్‌సి ఎలక్ట్రానిక్స్‌ చదివాను. ఆ తర్వాత ఊర్లో టీవీ షోరూం పెట్టుకున్నాను. యానిమేషన్ నేర్చుకోవాలనే ఇంట్రెస్టుతో హైదరాబాదులోని డిక్యూ అనే సంస్థలో జాయినయ్యాను. అక్కడే 2డి,  3డి కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత అదే సంస్థలో కొన్నాళ్లు ఫేకల్టీగా కూడా పనిచేశాను. ఆ తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేశాను. ఆ సమయంలోనే అక్కడ ఫీచర్‌ ఫిలింలను ఎలా ఎడిటింగ్‌ చేయాలో తెలుసుకున్నాను. చిన్న సినిమాకు పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్కులు అక్కడ జరిగేవి. అలా ఎడిటింగ్ పట్ల ఆకర్షితుడనయ్యాను.
 
యానిమేషన్ అంటే క్రియేటివిటీ వర్క్... మరి ఎడిటింగ్ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు..?
నిజానికి ఎడిటింగ్ చేసేవారికి పోస్ట్ ప్రొడక్షన్సుకు సంబంధించిన అన్ని విభాగాల్లోను అనుభవం ఉంటే ఎడిటింగ్ ఈజీగా ఉంటుంది. దీనివల్ల ఫిలిం ఎడిటింగ్‌లో చిత్రాన్ని మరింత మెరుగులు దిద్దే అవకాశం ఉంటుంది.
 
డబ్బింగ్‌ సినిమాలకు రీ-ఎడిటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అసలు డబ్బింగ్‌ సినిమా రీ-ఎడిటింగ్‌ చాలా కష్టమైంది. అప్పటికే తమిళం, కన్నడలో చేసిన ఎడిటింగ్‌ను తెలుగులో మార్పులు చేయాలంటే చాలా మ్యాజిక్‌ చేయాలి. ఎక్కడా లింక్‌ చెడిపోకుండా చూసుకోవాలి. రెండు వెర్షన్‌లు చూసినవారికి ఎక్కడ కట్‌ చేశామో అర్థంకాకుండా వుండేలా చేయడమే ఎడిటింగ్‌ అంటే. శీనుగాడి లవ్‌స్టోరి తమిళ వెర్షన్‌ తీసుకుని తెలుగులో 20 నిముషాల నిడివి కట్‌ చేయాల్సి వచ్చింది. కొన్ని సన్నివేశాల ఆర్డర్ కూడా మార్చాల్చి వచ్చింది. కానీ చూసిన నిర్మాతకే ఇక్కడ ఎడిటింగ్‌ చేశారనేది తెలీలేదు. దీనికి ముందు అజిత్ వీరుడొక్కడే సినిమా కూడా అలానే చేయాల్సి వచ్చింది.
 
ధనలక్ష్మి... చిత్రంలో సాంకేతికంగా ఇబ్బంది పెట్టిన సీన్లేమైనా ఉన్నాయా...?
దర్శకులు అత్యుచ్ గారికి అన్ని రంగాల్లో అనుభవం ఉన్నవారే కావడం నాకు ప్లస్ అయింది. ఏ సీన్ ఎక్కడ ఎలా అనేది ఆయన దగ్గరుండి చూసుకునేవారు. దాంతో చాలామటుకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు సినిమా నిర్మాణ అంతా ఫిల్ములో కాకుండా డిజిటల్‌లో జరగడం వల్ల అవగాహన లేని వారు కూడా దర్శకులవుతున్నారు. అలాంటప్పుడు కొద్దిగా కష్టమవుతుంది. ఎలాబడితే అలా షూట్ చేసేసి ఆ సీన్లన్నీ ఎడిట్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. 
 
ఈ విషయంలో అచ్యుత్ గారు చాలా పక్కాగా ప్రణాళికాబద్ధంగా చేశారు. ఆయన ముందుగానే మేకింగ్ డేస్ షెడ్యూల్ వేసుకోవడం నాకు తెలుసు. అలాగే ప్రి-ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ విషయాల్లో ఆయనకు పూర్తి అవగాహన ఉంది. దర్శకుడికి పూర్తి అవగాహన లేకపోతే ఎడిటర్‌కు కూడా కష్టమే.
 
ధనలక్ష్మి... చిత్రంలో ఎడిటర్‌గా మిమ్మల్ని అభినందించిన సందర్భం?
ప్రధానంగా ఎడిటర్‌కు టెక్నికల్‌గా పట్టు వుండాలి. రీ-రికార్డింగ్‌ను ముందుగానే దృష్టిలో పెట్టుకుని షాట్స్ కట్ చేసుకోవాలి. అందుకు భిన్నంగా ఈ చిత్రం వర్క్ జరిగింది. అది ఎలాగంటే పోస్ట్ ప్రొడక్షన్లో చేయించుకోవాల్సిన రీ-రికార్డింగును దర్శకుడు అచ్యుత్ గారు ప్రి-ప్రొడక్షన్లో పక్కా ప్లానింగుతో ముందుగానే చేయించుకున్నారు. ఈ సినిమాలో రీ-రికార్డింగుగా వచ్చే కనకధార శ్లోకాలన్నీ ముందుగానే రికార్డింగ్ పూర్తయి మా చేతికి వచ్చాయి. అందువల్ల కట్ చేయాల్సిన షాట్ లెంగ్త్ ఎంత అనేది ముందుగానే మాకు తెలిసిపోయిందన్నమాట. దాంతో పని సులభమైంది. శ్లోకం నిడివికి తగ్గట్లుగానే షాట్ షూట్ చేసివ్వడంతో, ఆ లెంగ్తులో నేను ఎలా ఎడిట్ చేయగలిగాను అనేది నాకు టాస్క్ అయిందన్నమాట. అందుకే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎడిటర్‌గా నన్ను అభినందించారు. 
 
అచ్యుత్ గారు మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం?
అచ్యుత్‌ గారితో నాకు ఇంతకుముందే పరిచయం. సచ్చినోడు ప్రేమకథ గురించి అనుకున్నప్పుడు, సీజి వర్క్ కోసం మీట్ అయ్యాను. తర్వాత ఎవరి వర్క్ మీద వారు వెళ్లిపోయాము. మళ్లీ మూడేళ్ల తర్వాత అనుకోకుండా మా నిర్మాతలు రామసత్యనారాయణ గారు, ధనరాజ్ గారు నన్నే ఎడిటర్‌గా ఎంచుకుని అచ్యుత్ గారితో కలిసి ప్రయాణించే అవకాశం ఇచ్చారు. ఇక భీమవరం టాకీస్‌లో రామసత్యనారాయణ గారు ‘ట్రాఫిక్‌’ వంటి డబ్బింగ్ సినిమాలు మొదలుపెట్టిన దగ్గర్నుంచి శీనుగాడి లవ్ స్టోరీ చిత్రం వరకూ ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నేనే చూస్కున్నాను. సినిమా కొనే విషయంలో ఆఫ్షన్ నాకే ఇస్తారు. ఓకే అంటేనే డబ్బింగ్ రూపం నుంచి బయటకు వస్తుంది. ఇలా చెప్పడం నాకు గర్వంగా ఉంటుంది.
 
ప్రస్తుతం మీరు పని చేస్తున్న చిత్రాలు...?
సత్య విత్ నిత్య అనే చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. దానికి నేనే ఎడిటర్‌ను. కీ సినిమా దర్శకుడు నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అలాగే ఇటీవల ఆయన దర్శకత్వంలోనే సరదాగా ఓ సాయంత్రం అనే చిత్రాన్ని 9 రోజుల్లో ముగించాము. దీనికి ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. దీనికి ఎడిటింగ్, 5.1 మిక్సింగ్, డీఐ, గ్రాఫిక్స్ అన్నిటినీ 4 రోజుల్లో పూర్తి చేశాను. 
 
సినిమా ఇండస్ట్రీలో మీ లక్ష్యం...?
మంచి ఎడిటర్‌గా పరిశ్రమలో స్థానం సంపాదించడమే ప్రస్తుతం నా లక్ష్యం ఎడిటింగే.  నా అదృష్టంకొద్దీ వరుసగా అవకాశాలయితే వస్తున్నాయి. కేడీ బిల్ల... కిలాడి రంగ అనే తమిళం చిత్రాన్ని తెలుగులోకి నిర్మాత రామసత్యనారాయణ గారు తీసుకొస్తున్నారు. దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పేరు నాదే వేయమన్నారు. అన్ని కలిసి వస్తే సినీ నిర్మాణాలు చేయలన్నది నా అభిలాష. ఆ భగవంతుడు నన్నలా దీవిస్తాడనే భావిస్తున్నాను.
 
మరి నిర్మాతగా ఎప్పుడు ముందడుగు వేయబోతున్నారు..?
ఆల్రెడీ ఓ అడుగు వేశాను. ఇటీవల తమిళంలో విజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో ధనాధన్ పేరుతో విడుదల చేయబోతున్నాను. ఈ చిత్రంలో వైభవ్ కథానాయకుడు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా రాజీపడలేదు. ఈ చిత్రం విజయవంతమైతే స్ట్రెయిట్ చిత్రాన్ని నిర్మిస్తానా లేదా అనేది అప్పుడు ఆలోచించాలి( నవ్వులు).
webdunia
 
ధనలక్ష్మి తలుపు తడితే.. చిత్రంతో మీ అనుభవం...?
అనుభవం అనే కంటే నాకు పెద్ద గిఫ్టు. అదేమిటంటే ఈ చిత్రంలో మా అబ్బాయి జైవర్థన్ ను దర్శకులు అచ్యుత్ గారు బాల నటుడిగా పరిచయం చేయడం. ఆ క్షణాలను నేను ఎన్నటికీ మరువలేనివి. ఆయన మా అబ్బాయిని న్యూ ఇయర్ ఈవెంట్‌లో చూశారట. అప్పుడే తన మైండ్‌లో మా వాడితో నటింపజేయాలని ఫిక్స్ అయ్యానని చెపుతుంటే నాకు పట్టలేని ఆనందం కలుగుతుంది. ఆయన నిర్ణయాన్ని నిర్మాతలు ధనరాజ్, రామసత్యనారాయణ సపోర్ట్ చేయడంతో మావాడు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. నేను డిగ్రీ చదివాక, ఎన్నో ప్రయత్నాల తర్వాత ఫీల్డులోకి ప్రవేశించాను. అలాంటిది మావాడికి బాలనటుడిగా అచ్యుత్ గారు పరిచయం చేయడం సంతోషంగా ఉంది.
 
సినీ ఇండస్ట్రీ అంటే కుటుంబం ఎంకరేజ్‌మెంట్ అంతగా ఉండదు.. మరి మీ ఫ్యామిలీ విషయంలో ఎలా ఉంది..?
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కారణం నా భార్య సహకారమే. నేను కొంత నిరుత్సాహపడిన సందర్భాల్లో ధైర్యం చెప్పి లక్ష్యం వైపు పట్టుదలతో వెళ్లేట్లు చేసిందామె. ఎమ్ఎసీ చదివిన ఆమె ప్రోత్సాహం లేనిదే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరం. ఎప్పటికీ దర్శకనిర్మాతలకు అనువుగా ఉండే క్రమశిక్షణ కలిగిన ఎడిటర్‌గా ఉండాలన్నదే నా ఆశ అని ముగించారు.
 

Share this Story:

Follow Webdunia telugu