Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాసరితో ఎర్రబస్సు యూనిట్ ఇంటర్వ్యూ

Advertiesment
dasari narayana rao interview
, మంగళవారం, 11 నవంబరు 2014 (20:46 IST)
సినిమా ప్రముఖులను మీడియా ఇంటర్వ్యూ చేయడం, సినిమా విడుదలకు ముందు దర్శకనిర్మాతలు ఇంటర్వ్యూలు ఇవ్వడం సర్వసాధారణం. రొటీన్‌గా జరిగే తంతు ఇది. ఒకవేళ సినిమాలో నటించిన నటులు, వర్క్ చేసిన ఇతర టెక్నీషియన్లు దర్శకుడిని ఇంటర్వ్యూ చేస్తే..? కొంచం వెరైటీగా ఉంటుంది కదూ..! మంగళవారం అటువంటి సందర్భం చోటు చేసుకుంది. దాసరి స్వీయ దర్శకత్వంలో తారక ప్రభు ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన సినిమా ‘ఎర్రబస్సు’. మంచు విష్ణు, కేథరిన్‌ త్రేసా జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దాసరితో ‘ఎర్రబస్సు’ యూనిట్ జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..
 
చక్రి, రాజన్, కరుణాకరన్, సుద్దాల అశోక్ తేజ్, అంజి ప్రశ్నలు అడుగగా.. దాసరి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారు. సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ.. తొలిసారిగా గురువు గారి సినిమాకు సంగీతం అందించాను. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తండ్రి లాంటి వారు. భవిష్యత్ లో ఆయన సలహాలు పాటిస్తాను.
 
ప్రశ్న) మ్యూజిక్ పరంగా సినిమాకు నేను ఎంత వరకూ న్యాయం చేశానని భావిస్తున్నారు..? 
స) సినిమాలో ఆరు పాటలకు అద్భుతమైన స్వరాలను సమకూర్చాడు చక్రి. రీ రికార్డింగ్ ఇంకా బాగా చేశాడు. సినిమా కథకు అనుగుణంగా సంగీతం అందించాడు. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ మాట చెప్తారు. సంగీతపరంగా 100 శాతం న్యాయం చేశాడు.
 
నటుడు రాజన్ మాట్లాడుతూ… మోహన్ బాబు గారు, విష్ణు ఇద్దరితోనూ మీరు పని చేశారు. మోహన్ బాబు గారు సమయపాలన, క్రమశిక్షణ లకు మారుపేరు అంటారు. సెట్ లో విష్ణు కూడా తండ్రిలాగే క్రమశిక్షణతో మేలిగాడా..?
స) క్రమశిక్షణలో ఇద్దరూ సమానమే. ఇక సమయపాలన విషయానికి వస్తే కేవలం ఒక్క రోజు మాత్రమే విష్ణు ఆలస్యంగా షూటింగ్ కి వచ్చాడు. అది కూడా ముందుగానే తెలియజేశాడు.
 
ప్రశ్న) నటన(పెర్ఫార్మన్స్) పరంగా మోహన్ బాబు, విష్ణు మధ్య గల వ్యత్యాసం ఏంటి..?
స) ‘స్వర్గం – నరకం’ సమయంలో మోహన్ బాబు ఒక ముడిసరుకు లాంటి వాడు, రా మెటీరియల్. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ప్రతి విషయం నేర్చుకున్నాడు. విష్ణు అలా కాదు, పుట్టినప్పటి నుండి (30 ఏళ్ళుగా) ఒక సినిమా హీరో ఇంట్లో పెరిగాడు. నటనపరంగా, టెక్నికల్ అంశాల పరంగా ప్రతి విషయం తెలుసు.
 
అయినా, డైలాగ్ డెలివరీలో మోహన్ బాబు తర్వాతే ఎవరైనా..! మోహన్ బాబు నటనలో ఆల్ రౌండర్. విష్ణు అలా అనిపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుత తరం హీరోలలో సెటిల్ పెర్ఫార్మన్స్ ఇవ్వగలిగిన హీరో విష్ణు అని చెప్పగలను.
 
ప్రశ్న) ఇద్దరిలో హీరోయిన్లను ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? 
స) ఒకవేళ హీరోయిన్ కు ఎవరైనా లవర్ ఉంటే, మోహన్ బాబు వారిద్దరి మధ్య గొడవలు (ఫిట్టింగ్స్) పెడతాడు. విష్ణు గొడవలు పడుతున్న వారిని కలపడానికి ప్రయత్నిస్తాడు. అది వీరిద్దరి మధ్య తేడా.
 
పాటల రచయిత కరుణాకరన్ మాట్లాడుతూ.. కాశి విశ్వనాధ్ ఈ సినిమాలో ‘అయ్యో.. అయ్యో తాతయ్య.. ‘ పాట రాశాను. గురువుగారితో కలసి పని చేసే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్కసారి పాట విన్న తర్వాత ఓకే చేశారు. ఎటువంటి కరెక్షన్స్ చెప్పలేదు.
 
ప్రశ్న) నాకు వయసు, అనుభవం తక్కువ. నాతో పాట రాయించడానికి గల కారణం..? 
స) తాతయ్య మీద మనవడు లాంటి వాడు రాయాల్సిన పాట ఇది. అందుకే నీతో రాయించాను. గతంలో నన్ను కలసినప్పుడు నువ్వు ఒక పాట వినిపించావు. నీలో ప్రతిభ ఉందనిపించింది. నువ్వు రాస్తే ఈ పాట కొత్తగా ఉంటుందని భావించాను.
 
ప్రశ్న) పాట విన్న వెంటనే ఒకే చెప్పారు. అంత త్వరగా నిర్ణయం ఎలా తీసుకోగలిగారు..? 
స) నేను ఎప్పుడు కూడా నడుస్తున్న తరానికి రెండు అడుగులు ముందు ఉండాలి అనుకుంటాను. ప్రతి విషయంలో వేగంగా ఆలోచించగలగాలి. మనకు ఏం కావాలో క్లారిటీ ఉన్నప్పుడు నిర్ణయం త్వరగా తీసుకోగలం.
 
మరో పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ్ మాట్లాడుతూ.. గురువు గారి సినిమాలో పాట రాసే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ లో ఎందరో ప్రతిభావంతులను పరిచయం చేసిన ఘనత గురువు గారికి చెందుతుంది. ఒక వ్యక్తితో పరిచయమైన కొద్ది సమయంలోనే అతని ప్రతిభను అంచనా వేస్తారు.
 
ప్రశ్న) ఎదుటివ్యక్తిలో ప్రతిభను గుర్తించడం మీకు మాత్రమే ఎలా సాధ్యపడుతుంది..? 
స) ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు, చెప్పడం కష్టం. నీలో అమ్మవారి శక్తి ఉంది అని మా అమ్మమ్మ అంటూ ఉండేది. ఒకవేళ అది నన్ను కాపాడుతూ ఉందేమో. అందుకే అందరి అమ్మవార్లకి పూజ చేస్తూ ఉంటాను. ఆ శక్తి వల్లే ఎదుటి వ్యక్తిలో ప్రతిభ(టాలెంట్) గుర్తించగలుగుతున్నాను. నేను పరిచయం చేసిన వ్యక్తులు ఇండస్ట్రీలో మంచి స్థానాలలో ఉండటం సంతోషంగా ఉంది.
 
సినిమాటోగ్రాఫర్ అంజి మాట్లాడుతూ.. హీరో విష్ణు గారి ద్వారా దాసరి గారితో కలసి పని చేసే అవకాశం లభించింది. టెక్నికల్ గా అప్ టు డేట్ ఉన్నారు. ఒక సన్నివేశంలో ఏ తరహా కెమెరా (జిమ్మీ, ట్రాలీ, క్రేన్) ఉపయోగించాలో..? ఒక షాట్ ఎలా తీయాలో..? వివరించి మరి చెప్పేవారు. ప్రస్తుత తరంలో అతి తక్కువ మంది దర్శకులకు ఇలాంటి అవగాహన ఉంటుంది. కెమరామెన్ చెప్పే వరకు తెలియదు. దాసరి గారితో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
 
ప్రశ్న) టెక్నికల్ గా మీరు ఇంత అడ్వాన్స్డ్ గా ఎలా మూవ్ అవుతున్నారు..? 
స) విడుదలైన ప్రతి సినిమా చూస్తాను. హిట్ అయితే ఎందుకు హిట్ అయ్యింది..? ప్లాప్ అయితే ఆ సినిమాలో ప్రేక్షకులకు ఏం నచ్చలేదు, ఎందుకు ప్లాప్ అయ్యింది అని చూస్తాను. ఆ సినిమాలో టెక్నికల్ గా ఏం కొత్తగా ఉంది అని పరిశీలిస్తాను, నేర్చుకుంటాను. అందుకే ఎప్పటికప్పుడు నేను అడ్వాన్స్డ్ గా ఉండగలుగుతున్నాను. ఇప్పటికీ ప్రతి రోజూ ఒక సినిమా చూస్తాను. ఎక్కువగా మలయాళ, తమిళ సినిమాలు చూస్తాను. ఫ్యామిలీ డ్రామాలు అంటే ఇష్టం. ఇంగ్లీష్ సినిమాలు అస్సలు చూడను. అందుకే వాటి ప్రభావం నా మీద తక్కువ. అందువల్ల నా సినిమాలలో పాత్రలు మనలో ఒకరిగా అనిపిస్తాయి. మన సొసైటీలో నుండి క్యారెక్టర్లను తీసుకుంటాను అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu