మంచు మనోజ్ హీరోగా నటించిన సినిమా 'కరెంట్ తీగ'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఇంతకుముందు పలు చిత్రాలు చేసిన మనోజ్‌కు... విజయాలు అటూఇటూగా వున్నాయి. అయితే ఈసారి కరెంట్ తీగ పెద్ద సక్సెస్ ఇస్తుందని అంటున్నాడు. ఆ విషయం ఆయన మాటల్లోనే....
ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది?
నేను లగడపాటి శ్రీధర్ సినిమా చేశాక.. మరో సినిమా చేయాలనుకున్నాను. అంతకుముందు జి. నాగేశ్వరరెడ్డి ఓ కథ చెప్పారు. అసలు ఇద్దరం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కుదరలేదు. ఒకసారి కథ చెబితే.. అది కుదరలేదు. ఓసారి తమిళ సినిమా నాకు సరిపోతుందనిపించింది. ఆ సినిమా పేరు 'వారుతు పాడదా వాలిబర్ సంఘం'. అది దర్శకుడికీ నచ్చింది. దీన్ని తెరపైకి తెద్దామని అన్నయ్యకు చెప్పాను. ఆ హక్కులు తీసుకుని ప్రారంభించాం.
అందులో ఏమైనా మార్పులు చేశారా?
చాలానే చేశాం. మన నేటివిటీకి తగినట్లుగా కొన్ని సన్నివేశాలు పాత్రలు మారతాయి. అయితే లోపల కంటెంట్ మాత్రం అలానే వుంటుంది.
సన్నీలియోన్‌ను తీసుకోవడానికి కారణం?
ఏదో కొత్తదనం ప్రేక్షకులకు కల్గించాలి. రొటీన్‌గా వచ్చే పాత్రలు, కథనాలు కాకుండా భిన్నంగా వున్నా... ఓ పాత్రను సన్నీ చేత చేయిస్తే బాగుంటుందనిపించింది. ఇదికూడా నా ఫ్రెండ్ సజెష్ట్ చేశాడు. యూనిట్ అంతా ఓకే అన్నారు.
మరి మోహన్ బాబుగారిని ఎలా ఒప్పించారు?
ఆమె గురించి నాన్నగారికి పెద్దగా తెలీదు. కానీ.. ఈ అమ్మాయికి అంత ఖర్చు పెట్టడం ఎందుకు? అని అడిగారు. బాలీవుడ్‌లో ఫేమస్ అని చెప్పాం. మాస్ ఎగబడుతున్నారని అన్నాం. ఆయన షూటింగ్ టైమ్‌లో వచ్చారు. ఆమె పద్ధతిని మెచ్చుకున్నారు. కానీ రామ్‌గోపాల్‌వర్మ గారు.. నీకు ఆ అమ్మాయి గురించి తెలీదనుకుంటా? అన్న విధంగా చెప్పారు. బయటకు నన్ను పిలిచి.. నువ్వు చేసింది ఏమిట్రా అని చీవాట్లు పెట్టారు. బాలీవుడ్‌లో ఫేమస్ అని చెప్పాం. ఇలాంటివి రిపీట్ కానీయకు అని చెప్పారు.
ఆమె వల్లే 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చామని సెన్సార్ చెప్పారు?
ఆమె ఇందులో అసభ్యంగా వుండదు. కాకపోతే ఎం.టీవీ తరహాలో పాట వుంటుంది. ఇళ్ళల్లో ఆ ఛానల్స్ అందరూ చూస్తున్నారుగా...
అందరూ అంటే... హై సొసైటీవారా?
వారేకాదు.. కామన్‌గా అందరూ చూస్తుంటారని అర్థం.
ఇంతకీ.. కరెంట్ తీగ.. సన్నీ గురించా? మీ గురించా టైటిల్?
మీరు అపార్థం చేసుకున్నట్లున్నారు... కరెంట్ ప్రతి మనిషిలో వుంటుంది. దాని పవర్ ఎక్కువగా కరెంట్‌తీగ ద్వారానే వస్తుంది. అలాంటి పాత్ర నాది. సన్నీకి టైటిల్‌కు సంబంధమేలేదు.
సినిమా అటూ ఇటూ అయితే వేరే అర్థం వస్తుందేమో?
సినిమా అనేది సక్సెస్ కోసమే తీస్తాం. తమిళంలో ఆల్‌రెడీ హిట్.. ఈ సినిమా చూశాక.. మీరే అంటారు... సూపర్ టైటిల్ పెట్టారని... షాక్ కొట్టదు. ఎనర్జీ ఇస్తుంది.
మీ పాత్ర ఎలా వుంటుంది?
పనీపాటలేకుండా వుండే హీరో లవ్‌లో పడితే.. ప్రేమంటే ఇష్టంలేని జగపతిబాబుగారిని ఎలా ఒప్పించాడనేది కథ.
ఇలాంటి కథలు చాలానే వచ్చాయిగదా?
వచ్చాయి. కానీ ఇది భిన్నంగా వుంటుంది. ఎక్కడా పాత కథలు కన్పించవు అని చెప్పారు.