రామ్ చరణ్, దర్శకుడు శ్రీను వైట్లల కాంబినేషన్లో 'బ్రూస్ లీ' పేరుతో సినిమా సిద్ధమయింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ శుక్రవారమే పెద్దఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
'బ్రూస్ లీ' అంటూ యాక్షన్ టైటిల్‌తో వస్తున్నారు. ఎలా ఉండబోతోంది?
బ్రూస్ లీ అనేది పూర్తి యాక్షన్ టైటిల్‌లా కనిపిస్తున్నా, సినిమా మాత్రం ఫ్యామిలీ మొత్తం కలిసి చూడగలిగే సరదా సినిమా. కథ, పాత్ర రీత్యా ఈ సినిమాకు బ్రూస్ లీ అనే టైటిల్ పెట్టామే కానీ, ఇదేదో కంప్లీట్ యాక్షన్ సినిమా కాదు. మొదట్లో ఈ టైటిల్ విషయమై కాస్త భయపడ్డాం. అయితే శ్రీనువైట్ల గారి బ్రాండ్, ఆయన సినిమాలకు సాధారణంగానే కనిపించే అప్పీల్‌పై నమ్మకంతో 'బ్రూస్ లీ' అనే పేరుతోనే ముందుకెళ్ళాం. అదీకాక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని స్పష్టం చేసేసింది.
బ్రూస్‌లీ చిత్రాల్లో మీకు బాగా నచ్చిన సినిమా?
చాలా చిత్రాలు చూశాను. అన్నింటిలో 'ఎంటర్ ది డ్రాగన్' సినిమా బాగా నచ్చింది. సిస్టర్ సెంటిమెంట్ బాగుంది.
'గోవిందుడు అందరివాడేలే', తర్వాత 'బ్రూస్ లీ'.. ఇలా ఫ్యామిలీ కథలతోనే వెళ్తున్నారు. ఏదైనా ప్రత్యేక కారణమా?
సమయానికి ఈ రెండు కథలు అలా వచ్చాయి. 'బ్రూస్ లీ' కథ కూడా 'గోవిందుడు..' టైమ్‌లోనే వచ్చింది. ఈ సినిమాలో అక్క, తమ్ముడు, తండ్రి, కొడుకుల సెంటిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆ ఎమోషన్‌కు బాగా కనెక్ట్ అవ్వడంతో వెంటనే ఒప్పేసుకున్నా. ప్రత్యేకంగా ఇలాంటి సినిమాయే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు.
శ్రీను వైట్ల సినిమా కామెడీకి పెట్టింది పేరు. ఈ సినిమాలో ఆయన బ్రాండ్ కామెడీ ఉంటుందా?
ఆయన సినిమాల్లో కనిపించే ఫన్ నాకు తెలిసి ఆయన వ్యక్తిత్వం నుంచే వచ్చిందనుకుంటా. సెట్లో చాలా సరదాగా ఉంటారు. బ్రూస్ లీ లోనూ శ్రీను వైట్ల మార్క్ కామెడీ తప్పకుండా ఉంటుంది. ఈ సినిమాలో అంతా కథరీత్యా సాగిపోయే ఫన్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఈ తరహా కామెడీ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ముందే చెప్పినట్లు ఫ్యామిలీ సెంటిమెంట్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.
స్టంట్ మాస్టర్‌గా కొద్దిసేపే వుంటారా?
నా పాత్ర నాకే కొత్తగా కనిపించింది. మొదట్లో ఈ సినిమాలో లుక్ కోసం రకరకాల హెయిర్‌స్టైల్స్ అన్నీ ట్రై చేశాం. చివరగా ఇప్పుడు చూస్తున్న ఈ లుక్‌కి ఫిక్సయ్యాం. కార్తీ అనే ఓ స్టంట్ మాస్టర్‌గా ఈ సినిమాలో కనిపిస్తా. ఈ తరహా క్యారెక్టర్, నేపథ్యం మన సినిమాల్లో తక్కువగా చూశాం కాబట్టి కచ్చితంగా కొత్తగా ఉంటుందని చెప్పగలను.
కేవలం నాలుగు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. కారణం?
సినిమా ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ కూడా ప్రకటించాం. ఓపెనింగ్‌కి, రిలీజ్‌కి నాలుగు నెలలో టైమ్ ఉండడంతో ఈ గ్యాప్‌లో షూటింగ్ పూర్తి చేయడం కోసం చాలా కష్టపడ్డాం. ఇదే విషయమై శ్రీనువైట్ల గారితో మాట్లాడుతూ.. 'సినిమా లేట్ అయినా పర్లేదు, క్వాలిటీ బాగుండాలి. కావాలంటే రెండు నెలలు వెనక్కి వెళదాం' అని చెప్పా. శ్రీను వైట్ల గారు మాత్రం కెమెరామెన్ మనోజ్ పరమహంసతో ఎలా సెట్ చేసుకున్నారో తెలీదు కానీ ఇంత తక్కువ టైమ్‌లో అద్భుతమైన ఔట్‌పుట్ తెచ్చారు.
చిరంజీవి పాత్ర గురించి?
నాన్నను స్క్రీన్‌పై చూడటానికి నేను కూడా అందరిలానే ఎగ్జైటింగ్‌గా ఉన్నా. ఈమధ్యే డబ్బింగ్‌లో ఆయన విజువల్స్ చూశా. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని చెప్పొచ్చు. మొదట్లో ఈ గెస్ట్ రోల్‌ను వేరొక హీరోతో చేయించాలని ప్లాన్ చేశాం. చివరి నిమిషంలో అది కుదర్లేదు. దీంతో నాన్నే స్వయంగా ఈ రోల్ చేస్తానని నన్ను ఒప్పించాడు. నేనైతే అస్సలు ఒప్పుకోలేదు. నాన్న, శ్రీనువైట్ల కలిసి నన్ను కన్విన్స్ చేసేశారు. శ్రీను వైట్ల గారు ఓ పాట కూడా ప్లాన్ చేద్దాం అన్నారు. నేను ససేమిరా అన్నాను. 150వ సినిమాలోనే నాన్న డ్యాన్స్ చేయాలి.
150వ సినిమా గురించి పూరీ కామెంట్ చేశారు. దాన్ని ఎలా స్వీకరిస్తారు?
పూరీగారు చెప్పిన కథలో మొదటి భాగం చాలా బాగుంది. రెండో భాగం సరిచేసుకోమని చెప్పాం. చాలా క్లియర్‌గా ఆయనకే చెప్పాం. కానీ మీడియాకు ఆయన మరోలా ఎందుకు చెప్పారో తెలీదు.
150 సినిమాకు కథ రెడీ అయిందా?
లేదు. ప్రతిష్టాత్మకంగా తీయాలని మంచి కథ కోసం చూస్తున్నాం. తమిళ 'కత్తి' కథ నాన్నగారికి నచ్చింది. ఇంకా రైట్స్ తీసుకోలేదు. అయితే 151, 152, 153 కథలు మాత్రం సిద్ధంగా వున్నాయి. 150 కథ అయ్యాకే మిగిలినవి.
పెద్ద సినిమాకు మూడు వారాలు గ్యాప్ వుంటే బాగుంటుందని దాసరి అన్నారు?
అనడం బాగుంది. కానీ ప్రాక్టికల్‌గా సాధ్యపడదు. అంతకుముందు బాహుబలి, శ్రీమంతుడు చిత్రాల గురించి ఒకరికొకరు ముందుగానే అనుకుని సర్దుబాటు చేసుకున్నారు. బ్రూస్ లీ ప్రారంభంరోజే రిలీజ్ డేట్ చెప్పేశాం. కానీ రుద్రమదేవికి విడుదల్లో జాప్యం వల్ల అలా జరిగింది.
తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరిగింది. మీ సినిమా ఎలాంటి రికార్డులు సాధించనుంది?
సినిమా బాగా ఆడాలి, నిర్మాతకు డబ్బులు తెచ్చిపెట్టాలన్నదే నా బలమైన కోరిక. సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. నాకైతే ఈ రికార్డుల టెన్షన్ అస్సలు లేదు. సినిమా బాగా ఆడుతుందా.. ఫైన్. ఇంతకుముందు సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందా.. గుడ్. అంతేకానీ రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా చూడకూడదు.
మీ తదుపరి సినిమా విశేషాలేంటి?
తమిళంలో సూపర్ హిట్ అయిన 'తని ఒరువన్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళుతుంది. గౌతమ్ మీనన్ గారితో ఓ సినిమా చర్చల్లో ఉంది.
'ట్రూ జెట్' విమానాలపై విమర్శలు వున్నాయి?
దానికి కేవలం బ్రాండ్ అంబాసిడర్‌నే. టెక్నికల్ విషయాలు అన్నీవారే చూసుకోవాలి. నేనూ పేపర్లలో చదివి వాటిని సరిచేసుకోమని చెప్పాను. బాలీవుడ్‌లోనూ అమితాబ్ మ్యాగీకి అంబాసిడర్.. కానీ ఆయన తినరు. విమర్శలు వస్తే ఆయనపై కేసు వేశారు. ఇదెక్కడి న్యాయం.
నిర్మాణ సంస్థను స్థాపిస్తున్నారా?
వైట్‌హౌస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు తీయాలనుంది. కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్నాక.. దాని గురించి ఆలోచిస్తా. బాబాయ్ బేనర్‌తో కలిసి సినిమా చేయాలనే ఆలోచన కూడా వుంది.
ఇంతకుముందు కంటే ఇప్పుడు శాంతంగా కన్పిస్తున్నారు?
నిజమే. ఇంతకుముందు ఎందుకో తెలీని టెన్షన్‌కు గురయ్యేవాడిని.. ఇప్పుడు హ్యాపీగా వుండటమే నేర్చుకున్నా... ఇదంతా అనుభవం మీదనే వస్తుంది.
మీరు కూడా ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారా?
నాన్నగారు నర్సాపురం పక్కన ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దాని అవసరాలు నేను చూస్తున్నాను. భవిష్యత్‌లో నేను చేయాల్సివస్తే తప్కకుండా చేస్తా.
ఎన్‌టిఆర్, అల్లు అర్జున్‌కు ప్రమోషన్ (తండ్రిగా) వచ్చింది.. మీకు ఎప్పుడు?
నవ్వుతూ.. ఇంకా ఆ ప్రమోషన్ రాలేదు. వస్తే మీకే చెబుతాను.
సినిమా తర్వాత ఏదైనా ప్లేస్‌కు వెళ్ళాలనుకుంటున్నారా?
రెండు రోజుల నుంచి ఉపాసన అడుగుతుంది. ఎక్కడికైనా తీసుకెళతావా? లేదా? అంటూ.. నాకు బ్రూస్ లీ చిత్రం అయ్యాక.. యాక్షన్ ఎపిసోడ్స్ వల్ల ఒళ్లు హూనమయింది. చేతులుకాళ్ళు బాగా పెయిన్‌గా వున్నాయి. ఒళ్ళంతా అలసిపోయినట్లుంది. సినిమా విడుదల తర్వాత వెళ్లవచ్చన్నాను అని చెప్పి ముగించారు.