నెగెటివ్ పాత్రలంటే ఇష్టం.. డబ్బు కోసం వెండితరెకు రావడం లేదు: అనుపమ పరమేశ్వరన్
నటిగా మలయాళం 'ప్రేమమ్' చిత్రంతో గుర్తింపు పొందిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో 'అ.. ఆ..' చిత్రంతో పరిచయమైంది. ఇప్పుడు నాగచైతన్యతో 'ప్రేమమ్' సినిమా చేస్తుంది. మలయాళంలో రెండేళ్ళనాడు చేసిన పాత్రను మళ్ళీ త
నటిగా మలయాళం 'ప్రేమమ్' చిత్రంతో గుర్తింపు పొందిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో 'అ.. ఆ..' చిత్రంతో పరిచయమైంది. ఇప్పుడు నాగచైతన్యతో 'ప్రేమమ్' సినిమా చేస్తుంది. మలయాళంలో రెండేళ్ళనాడు చేసిన పాత్రను మళ్ళీ తెలుగులో చేయడం ఇంకాస్త కొత్తగానూ వుంది. ఎక్కడా బోర్ అనిపించలేదు. నటీనటులు, బేనర్‌వాల్యూ చూసి ఇందులో నటించానని చెప్పింది. ఈ నెల 7వ తేదీన విడుదలవుతున్న సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
* తెలుగు వెర్షన్‌లో పాత్ర పరంగా తేడాలున్నాయా?
'ప్రేమమ్' ఒరిజినల్‌లో ఉన్నట్టే ఇందులోనూ కనిపిస్తాను. కాకపోతే నేటివిటీ పరంగా అక్కడ క్రిష్టియన్, ఇక్కడ హిందూ. ఇందులో నాపేరు సుమ. మలయాళం చేసి రెండేళ్ళు అవుతుంది కాబట్టి నాలో కొన్ని కొన్ని మార్పులు వచ్చాయి అంతే.
* తెలుగులో ఎలాంటి గుర్తింపు వచ్చింది?
తెలుగులో నేను చేసింది రెండే రెండు సినిమాలు. 'అ..ఆ' సినిమాతో ప్రేక్షకులు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నాగ వెళ్లి కదా, మేరీ కదా అని గుర్తుపడుతూ బోలెడంత గౌరవం ఇస్తున్నారు. వాళ్ళ రిసీవింగ్ నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది.
* త్రివిక్రమ్‌ను సలహాలు అడుగుతుంటారా?
అవును. ఆయన నా గురువు. మొదటి సినిమాతోనే ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉండాలో చెప్పేవారు.
* తెలుగు డబ్బింగ్ మీరే చెప్పారా?
'అ.. ఆ..' సినిమాకి డబ్బింగ్ నేనే చెప్పాను. త్రివిక్రమ్ గారే చెప్పమని ఎంకరేజ్ చేశారు. నా వాయిస్‌లో ఇంటెన్సిటీ మారకూడదనే అలా చెప్పారు. నేను కూడా చేసేశాను. 'ప్రేమమ్' సినిమాకి కూడా నేనే చెప్పాను. తెలుగులో కొన్ని కొన్ని పదాలు పలకడం చాలా కష్టంగా ఉండేది. నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నాను.
* ఇంతకీ నవీన్ పాల్, నాగ చైతన్యలలో ఎవరు బెటర్?
మలయాళంలో నవీన్ అక్కడి నేటివిటీకి తగ్గట్టు చేశారు. నాగ చైతన్య తెలుగు నేటివిటీకి తగ్గట్టు నటించారు. ముఖ్యంగా ఏజ్ ఎక్కువగా కనిపించే క్యారెక్టర్లో చాలా బాగా నటించారు నాగ చైతన్య.
* మలయాళం కంటే ఇక్కడే ఎక్కువ రెమ్యునరేషన్ కోసం నటిస్తున్నారా?
ఇక్కడ అవకాశాలు వస్తున్నాయి. కానీ మంచి అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నాను. మంచి పాత్రలు వస్తేనే చేయడానికి ఇష్టపడతాను. నేను చేసే క్యారెక్టర్‌కు సినిమాలో ఏదో ఒక ప్రాముఖ్యత ఉండాలని భావిస్తాను. డబ్బుకు అంత ప్రాధాన్యతనివ్వను. నేనే చేసే పనితో నేను హ్యాపీగా ఉండాలనుకుంటాను.
* హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఎమన్నా చేసే ఆలోచనలున్నాయా?
నాక్కూడా చేయాలనుంది. అలాంటి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కానీ నాలో ఆ పాత్రలతో సినిమాని నిలబెట్టగలనన్న పూర్తి నమ్మకం వస్తే తప్పకుండా చేస్తాను. నాకు నెగెటివ్ పాత్రలు చేయడమంటే ఇష్టం. అవి వస్తే తప్పకుండా చేస్తాను.
* వేటిని దష్టిలో పెట్టుకుని పాత్ర ఎంపిక చేసుకుంటారు?
సినిమాల్ని చేసుకునేప్పుడు నా క్యారెక్టర్లో బలం ఉందా లేదా, అది సినిమాని ఎంత వరకూ ప్రభావితం చేస్తుంది, నటించడానికి స్కోప్ ఉందా, కొత్తగా ట్రై చేయడానికి ఛాన్సులేమన్నా ఉన్నాయా అనే వాటిని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకుంటా.
* మీ హీరో రియల్ లైఫ్‌లో ప్రేమించారు. మరి మీరు కూడా ఎవరినన్నా ప్రేమించారా ?
ప్రతి ఒక్కరికీ లైఫ్‌లో, యంగ్ ఏజ్‌లో ప్రేమ ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇప్పుడంతా సినిమానే. ఇంకా ఆ దిశగా ఆలోచించలేదు.
* చైతన్యతో పని చేయడం ఎలా ఉంది?
చైతన్యతో పని చేయడం చాలా సులువుగా ఉంది. ప్రతిదీ వివరిస్తారు. మంచి సూచనలు ఇస్తారు. సినిమాలో చాలా బాగా నటించారు. చాలా ఈజీ గోయింగ్ పర్సన్. ఎప్పుడూ కూల్‌గా ఉంటారు.
* మరి దర్శకుడు చందూ మొండేటి?
తను చాలా ప్రతిభగల డైరెక్టర్. పెద్దగా మాట్లాడడు. ప్రతి సీన్ అర్థమయ్యేలా చెప్పారు. కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఆయన టాలెంట్ ఏమిటి అర్థమైంది. నేచర్ పరంగా మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి. ఆయనతో పని చేయడం హ్యాపీగా ఉంది.
* మీ తదుపరి చిత్రాలు?
తెలుగులో శర్వానంద్ హీరోగా 'శతమానం భవతి' చేస్తున్నాను. నవంబర్ నుంచి రెండో షెడ్యూల్ జరుగుతుంది. ఇక తమిళంలో ఒక సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. మలయాళంలో రెండు సినిమాలు చేస్తున్నాను.