నాగార్జున పక్షవాతం వచ్చిన వాడిగా నటించిన సినిమా 'ఊపిరి'. కథ ప్రకారం.. కుర్చీలో కదలకుండా కూర్చొనే వుండాలి. ఎదురుగా ఎన్నో ఆనందాలు, విషాదాలు జరుగుతున్నా.. చలనం లేకుండా వుండాలి. కథ విన్నప్పుడు.. నాగచైతన్య, అఖిల్‌లు వద్దన్నారు. ఆ పాత్ర చేయడం ఇష్టం లేదని మొహం మీదే చెప్పారు. ఇప్పటికీ.. వారికి డైజెస్ట్ కాలేదు. కానీ వారిని ఒప్పించి.. చేయడం జరిగింది. నటుడిగా ఇటువంటి పాత్రలు కెరీర్‌లో నిలిచిపోతాయని చెప్పాను.. అని నాగార్జున అన్నారు. ఊపిరి సినిమా ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడారు.
అసలు ఇలాంటి పాత్రే చేయాలని ఎందుకనిపించింది?
నటుడిగా అన్ని రకాల పాత్రలు చేసేశాను. వీల్ చైర్‌లో కూర్చొని చేసే పాత్ర చేయలేదు. ఫ్రెంచ్ సినిమా ఇన్‌టచ్‌బుల్స్ చూస్తున్నప్పుడు అందులో డెప్త్ నాకు బాగా నచ్చింది. ఓ మిలియనీర్. డబ్బుతో ఏదైనా కొనవచ్చు. కానీ ఏమీ చేయలేడు. ఆ సినిమా చూస్తున్నంతసేపు.. ఇలాంటి పాత్ర చేయాలనే షడెన్‌గా అనిపించింది. అమలకూ బాగా నచ్చింది.
రెండు భాషల్లో చేయడం ఎలా వుంది?
తెలుగు, తమిళ భాషల్లో సెపరేట్‌గా కొన్ని సీన్లు చేయాల్సివచ్చింది. రెండుసార్లు అలా రిపీట్ సీన్లు.. కూర్చొనే వుండటం చాలా కష్టంగా అనిపించింది. ఫైనల్ ఔట్‌పుట్ చూశాక.. హ్యాపీగా అనిపించింది.
ముందుగా ఎన్‌టిఆర్‌ను అనుకున్నారు. ఆయన చేయకపోవడానికి కారణం?
మామూలుగా కార్తీ నటించే పాత్రను ఎన్‌టిఆర్‌ను అనుకున్నాం. ఆయన్ను సంప్రదించాం. కానీ.. వేరే సినిమా డేట్స్ వల్ల కుదరలేదు. అప్పుడు కార్తీని అడిగాం. ఆయన వెంటనే అంగీకరించారు.
నాగచైతన్యకు తీసుకోవాలని ఎందుకనిపించలేదు?
అస్సలు ఆ ఆలోచనలే మాకు రాలేదు. ఒకవేళ వచ్చి చేసినట్లయితే... అభిమానుల్లో రాంగ్ గైడెన్స్ వెళ్లేది. తండ్రీ కొడుకులు ఇలా చేయడం కథరీత్యా కూడా సాధ్యపడదు. అయినా.. నన్ను అలా చూడలేనివాడు.. నా పక్కన ఎలా నటిస్తాడు.
అఖిల్ రెండో సినిమా ఆలస్యం అవుతుందే?
ఏదో అనుకుంటాం. అన్నీ కుదరాలి కదా.. వంశీ పైడిపల్లి ఓ పాయింట్ చెప్పారు. అది వర్కవుట్ అవుతుందా! లేదా! అనేది పరిశీలించాక చెపుతాను.
మళ్ళీ రాఘవేంద్రరావుతో సినిమా ఎప్పుడు?
శ్రీవేంకటేశ్వరునిపై చిత్రం వుంటుంది. దానికోసం దర్శకుని టీమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మేలో సెట్‌పైకి వెళ్ళవచ్చు అని చెప్పారు.