Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండు బాషల చిత్రాల్లో చేయాలంటే కాస్త భయమేస్తుంది- వైభవ్‌

Advertiesment
actor vaibhav interview
, బుధవారం, 15 జులై 2015 (19:11 IST)
దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడుగా పరిచయమైన వైభవ్‌ తమిళ రంగలోనే కాకుండా తెలుగులోనూ నటుడిగా నిరూపించుకుంటున్నాడు. 'గొడవ'తో తెలుగువారికి పరిచయమయి 'సరోజ', 'బిరియాని', 'అనామిక' చిత్రాల్తో గుర్తింపు పొందాడు. తాజాగా తమిళంలో కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందిన 'కప్పల్‌' చిత్రంలో నటించాడు. ఆ చిత్రం తెలుగులో 'పాండవుల్లో ఒకడు' అనే పేరుతో ఈ నెల 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా వైభవ్‌ చిత్రం గురించి ఇలా వెల్లడించారు.
 
సినిమా నేపథ్యమేమిటి?
ఇది ఐదుగురు స్నేహితుల కథ. చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన వల్ల పెళ్లి చేసుకోకూడదనుకుంటారు. కానీ అందులో ఒకడు ప్రేమించి పెండ్లి చేసుకోవాలనే సిటీకి వస్తాడు. అయితే తన ప్రేమకు స్నేహితులు అడ్డుగా మారతారని గ్రహిస్తాడు. కానీ ఆ స్నేహితులే వాడి ప్రేమను ఎలా గెలిపించారన్నదే కథ. ఇది రెగ్యులర్‌ ప్రేమకథలకు భిన్నంగా వుండే పాయింట్‌. ఇందులో నా పాత్ర పేరు వాసు. నాతోపాటు కరుణాకరన్‌, అర్జున్‌, సుందర్‌, వెంకట్‌ నటించారు. ప్రేమ, పెళ్లే లక్ష్యం అనుకోని బ్రతికే యువకుడిగా కన్పిస్తాను.
 
చిత్రంలో హైలైట్స్‌ ఏమిటి?
ఇది తమిళంలో విజయాన్ని సాధిచింది. అందుకు కారణం హాస్యంతోపాటు స్క్రీన్‌ప్లే చక్కగా వుండడమే. పంచ్‌ డైలాగ్‌లు ఏమాత్రం మార్చకుండా తెలుగు నేటివిటీకి దగ్గరగా రాయడంలో మారుతీ ఎంతో కృషి చేశారు. అవే ఈ చిత్రానికి హైలైట్స్‌.
 
మీ కెరీర్‌కు ఎంతవరకు దోహదపడుతుంది?
తమిళంలో కుదిరినట్లుగా తెలుగులో కథలు ఎందుకనో కుదరడంలేదు. ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్‌ నేనే చెప్పాను. ఈ చిత్రం తర్వాత తెలుగులో చేసే కథలు వస్తాయనుకుంటున్నాను.
 
అప్పుడు ద్విభాషా చిత్రాలు చేయవచ్చుగదా?
రెండు బాషల చిత్రాల్లో చేయాలంటే కాస్త భయమేస్తుంది. ఎందుకంటే తమిళంలో రూరల్‌గా వుండే కథలైనా చూస్తారు. కానీ తెలుగులో అంత త్వరగా అంగీకరించరు. తెలుగులో పాటలు, ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా వుంటేనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అందుకే ద్విభాషా చిత్రాలంటే దూరంగా వుంటాను.
 
దర్శకుడు శంకర్‌ సమర్పకులుగా వుండటానికి కారణముందా?
ఈ సినిమా దర్శకుడు కార్తీక్‌.. శంకర్‌ శిష్యుడే. చిత్రం తొలికాపీ సిద్ధమయ్యాక శంకర్‌ ఫ్యామిలీకి చూపించారు. ఆయన భార్యకు నచ్చి ఆమె సమర్పకురాలిగా వ్యవహరిద్దామని నిర్ణయించుకన్నారు. తమిళంలో ఈ సినిమా పెద్ద సినిమాల పోటీ మధ్య విడుదలైంది. శంకర్‌గారి వల్లే ఈ సినిమాకు థియేటర్లు దొరికాయి. లేదంటే కష్టమయ్యేది.
 
దర్శకత్వం ఎంతవరకు వచ్చింది?
నేను నటుడ్ని కాకముందు పూరీ జగన్నాథ్‌ దగ్గర 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి', 'శివమణి' చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ తర్వాత నటుడిగా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు కూడా నాలుగు సినిమాకు కమిట్‌ అయ్యాను. అవి పూర్తయ్యేసరికి రెండేళ్ళు పడుతుంది. ఆ తర్వాత ఏమిటనేది ఆలోచిస్తా అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu