Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిచ్చి సినిమా తీశావన్నారు : ఉపేంద్ర ఇంటర్వ్యూ

Advertiesment
Actor Upendra Interview
, బుధవారం, 12 ఆగస్టు 2015 (19:45 IST)
కన్నడ సినిమా రంగంలోకి ఎటువంటి సపోర్ట్‌ లేకుండా వచ్చి.. అప్పటి హీరోల్లో తనకంటూ ప్రత్యేక ముద్రను చూపించి ప్రేక్షకులకు దగ్గరయిన నటుడు ఉపేంద్ర. హీరోగానే కాకుండా దర్శకుడిగా పలు చిత్రాలు చేసి ఇప్పుడు నిర్మాతగా కూడా 'ఉప్పి2'ను చేసిన ఆయన ఆ చిత్రాన్ని తెలుగులో 'ఉపేంద్ర2'తో ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యాడు. తెలుగులో సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రంలో విలన్‌గా నటించిన ఆయన.. తనకు వచ్చిన ఆఫర్లను చేస్తూ పోతుంటానని వేటి గురించి పెద్దగా ఆలోచించనని అంటున్నాడు. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ..
 
15 ఏళ్ళ తర్వాత ఉపేంద్ర సీక్వెల్‌ తీయడానికి కారణం?
10ఏళ్ళ క్రితం 'సూపర్‌' చేశాను. నయనతార హీరోయిన్‌గా. ఆ తర్వాత 5 ఏళ్ళకు ఉపేంద్ర చేశాను. ఈ సినిమా సైకలాజికల్‌ ఫీలింగ్‌ నేపథ్యంలో వుంటుంది. అందులో ముగ్గురు హీరోయిన్లు వుంటారు. అందరినీ అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతుంది ఆ పాత్ర. ఆ తర్వాత దీనికి ఏదో ఒక కొనసాగింపు ఇవ్వాలని ఆలోచించగా ఒక థాట్‌ వచ్చింది. అదే ఉపేంద్ర2. మొదటిపార్ట్‌లో నేను అనే ఫీలింగ్‌తో వుంటాను. దీనికి మాత్రం నువ్వు అనే ఫీలింగ్‌తో అందరికీ వర్తిస్తుంది.
 
అసలు ఈ కథకు బ్యాక్‌డ్రాప్‌ ఏమిటి?
ఎక్కడిదో ఎందుకు. నాలో వున్న ఫీలింగే. అందరిలోనూ వుంటాయి. నేను కథగా రాసుకున్నానంతే.
 
అంటే మీలోని భావాలే ఈ సినిమానా?
అవును. నా అనేవాడు అందరిలోనూ వుంటాడు. 
 
క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
మొదటి పార్ట్‌లో అన్నీ వదిలేసి అద్దం పగలగొట్టి వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఎలా వుంటాడు. ఆయన ఆలోచనలు ఎలా వుంటాయనేది క్యారెక్టర్‌. ఫైనల్‌గా ముగింపు ఎలా వుంటుందనేది ఆసక్తికంగా వుంటుంది. స్క్రీన్‌ప్లే బేస్డ్‌ మూవీ.
 
అఘోరాగా పోస్టర్‌లో కన్పించారు?
అది ఒక సీన్‌ మాత్రమే. ఇది ప్రయోగాత్మక సినిమా.
 
ఉపేంద్ర సినిమా యూత్‌కు ఇప్పటి యూత్‌కు తేడా వుంది కదా? ఎలా రిసీవ్‌ చేసుకుంటారనుకుంటున్నారు?
ఎప్పుడైనా లోపల ఆలోచనలు ఒకలాగే వుంటాయి. మారవు. రాఘవేంద్రరావు అప్పుడు లవ్‌ స్టోరీ తీశారు. ఇప్పుడు తీస్తారు. వయస్సు వచ్చినా లోపల భావాలు మారవు. ఒక స్టైల్‌ వుంటుంది.
 
మీరు ఎంచుకున్న కథలు సమాజం లోనుంచి వచ్చేవా? ఇంకా ఏవైనా స్పూర్తా?
నా ఆలోచనలు చాలామందిలో వుంటాయి. దాన్ని వ్యక్తం చేసేందుకు నాకు సినిమా అనే మార్గం దొరికింది. ఉదాహరణకు.. విదేశాల్లో రోడ్లన్నీ క్లీన్‌గా వుంటాయి. ఇక్కడకు రాగానే పరమ చెత్తగా అనిపిస్తుంది. ఆ ఆలోచన రావడమే సూపర్‌. మనమూ నీట్‌గా ఎందుకు వుండకూడదనే ఆలోచన లోంచే ఏదో కొత్తది పుట్టుకొస్తుంది. నా చిత్రాల్లోని కథలు కూడా అలాంటివే. ఇలాంటి పాయింట్‌కు స్పూర్తి రకరకాల పుస్తకాలు చదవడం, సినిమాలు చూడ్డం జరిగాక వచ్చినవే. కొన్ని సంఘటనలు చూశాక.. తెలీకుండా ఓ ఆలోచన వస్తుంది. అదే సినిమాగా తీసేస్తాను.
 
మిమ్మిల్ని ఇన్‌స్పైర్‌ చేసిన పుస్తకం?
జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు బాగా చదువుతాను. ఆయన చెప్పిన దానికి జవాబు దొరకదు. కానీ డెప్త్‌ లోకి తీసుకెళుతుంది.
 
ఆ డెప్త్‌ పాజిటివ్వా? నెగెటివ్వా?
మనం ఎలా తీసుకుంటే అలా వుంటుంది. నెగెటివ్‌ను కూడా లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌గా స్వీకరించవచ్చు. ఇక్కడో విషయం చెప్పాలి. ఆమద్య ఓ జోక్‌ చదివాను. చచ్చిపోయాక ఓ వ్యక్తి పైకి పోయాడు. అక్కడ ఇంద్రుడు స్వర్గం ఎలా వుంది? అని అడిగితే.. ఇంతవరకు ఉండింది నేను స్వర్గంలోనే కదా అన్నాడట. దీన్ని అర్థం చేసుకున్నవారికి అర్థమవుతుంది. నా కథలు కూడా ఇలాగే వుంటాయి.
 
పోస్టర్‌లో రివర్స్‌ ప్రచురించారు?
అది అఘోరా గెటప్‌.. శీర్షాసనం వేసి వుంటుంది. దానికి బెంగుళూరులో పాలాభిషేకం చేశారు. అదొక సీన్‌ వరకే వస్తుంది.
 
ఈ సినిమాలో గ్రాఫిక్స్‌ వున్నాయా?
కొన్నిచోట్ల వాడాం.
 
మీ చిత్రాల్లో అందరికీ ప్రాధాన్యత ఉంటుందా?
నా సినిమాలో అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంటుంది. హీరో అంటే పాట, ఫైట్‌ కాదు.. చిన్న పాత్ర వున్నా.. ప్రాధాన్యత ఉంటుంది. 
 
ఇద్దరు హీరోయిన్‌లతో రొమాన్స్‌ చేశారా...?
ఇద్దరు హీరోయిన్‌లతో రొమాన్స్‌ చేశానా లేదా అనేది సినిమాలోనే చూడాలి. 
 
రియల్‌ లైఫ్‌లో ఎలా వుంటారు?
ఇలానే వుంటాను. ఎక్కువ మాట్లాడను. లోలోపల నాకు నేనే మాట్లాడుకుంటాను.
 
మనిషిలోని ఇన్నర్‌ సైన్స్‌ ఫిలిం తీశారా?
నాకు వున్న అవకాశం అది. ఇందులో అందరీకీ తెలిసిన విషయమే చెప్పాను. కొత్తగా ఏమీ చెప్పలేదు. ఎవ్వరూ ఏమీ చెప్పలేరు కూడా. మనం చెబుతున్నాం అనుకున్నదంతా భ్రమే. ఈ సినిమాకు బెంగుళూరులో ఎడిటింగ్‌ చేసేసరికి టైం పట్టింది.
 నాకు వచ్చిన ఐడియాను సినిమా తీస్తుంటే.. మా మైండ్‌ ఒక రకంగా చెబుతుంది. నీకేం తెలుసు అని సినిమా తీస్తావ్‌ అని.. ఆ తర్వాత ఏదో ఆలోచన వస్తుంది. దాన్ని తీస్తాను. ముందుగా రాసుకుంది. తెరపైకి వచ్చేసరికి ఔట్‌పుట్‌ మరోలా వుంటుంది. ఇదంతా ఫిలాసఫీగా వుంటుంది.
 
నిజం అనేది ఎలా ఉంటుంది?
ఒక్కో వ్యక్తిని బట్టి మారిపోతుంది. నిజమైన ట్రూ అనేది చెప్పలేం. రఫ్‌గా ఏడేళ్ళుగా ఇలా చేయాలనుకుని ఈ సినిమా చేశాను.. కానీ సినిమా వచ్చాక మరోటి వచ్చింది. పక్కా బౌండ్‌ స్క్రిప్ట్‌.. హాలీవుడ్‌లా చేయాలి.. అనుకునేవాడిని. కానీ ఏవోవే ఆలోచనలతో మరోరకంగా వచ్చేది.
 
అంటే మీరు చేసేది బాగోలేదనేకదా అర్థం?
మనం చేసేది ఎప్పుడూ బాగోదు. ఏది మనకు తెలీకుండా జరిగిపోతుందో అదే బాగుంటుంది. 
 
మీ మాటలు ఆధ్యాత్మికంగా టర్న్‌ అయినట్లు కన్పిస్తుంది?
అలా అనిపిస్తుందా.. రియల్‌గా ఉపేంద్ర కూడా అలాంటి సబ్జెక్ట్‌. రఫ్‌గా చేశాను. అహంబ్రహ్మాస్మి.. అనే కాన్సెప్ట్‌తో చేశాను.. అన్ని వదిలేస్తాను.. ఇంత వదిలితే హ్యాపీగా ఉంటానని చెప్పాను.. అప్పుడు ఉపేంద్ర క్లైమాక్స్‌ ఎలా ముగించాలో ఎలా చేయాలో తెలీలేదు.. తర్వాత ఏదో ఫ్లాష్‌ అయింది.. ముగ్గురు హీరోయిన్లను మాయం చేస్తే? అనే ఆలోచన వచ్చింది. అది కో-డైరెక్టర్‌కు చెప్పాను. ఇదేమీ మాయమంత్రం సినిమా కాదుసార్‌ అన్నాడు.
 
తెర వెనుక ఆథ్యాత్మికులా?
ఇది సైకలాజికల్‌గా వుండేది. అసలు నేను ఎవర్ని అంటూ ప్రశ్నించుకుంటాను. నేను ఆలోచిస్తుంది కరెక్టా? కాదా? మనం ఏమిటి? దేవుడు వున్నాడా? వుంటే ఎవరు? అసలు మనం చేస్తుంది కరెక్టా? నీతి, న్యాయం వున్నాయా? అవి ఇలా వుండాలని పెట్టింది ఎరు? సముద్రంలోంచి కొద్దిగా నీరు తీస్తే అది వాటర్‌ అవుతుంది. కానీ అందులో సముద్రంలోని క్వాలిటీస్‌ వుంటాయి. అవే మళ్ళీ సముద్రంలో పోస్తే.. కలిసిపోతుంది. ఇలాంటి యాంగిల్‌లో ఎక్కువగా ఆలోచిస్తుంటాను.
 
కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌?
నాకు పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ లేదు. 'ఎ', 'రా'..అనే చిత్రాలు తీశాను. కొత్తగా వున్నాయన్నారు. కానీ నాలో మైనసే నాకు ప్లస్‌. ఏమీ లేకుండా వచ్చాను. ఎన్నో సంపాదించుకున్నాను. ఒక రకంగా ఏమీ లేకపోతే ధైర్యం వుంటుంది. నన్ను ఎవరూ చూడరు. పెద్ద హీరో. బడ్జెట్‌ లేదు. ఏదో చేయాలి. జనాలు చూస్తారో లేదో అనవసరం. అంటే ధైర్యం వస్తుంది. అప్పుడు క్రియేటివిటీ వస్తుంది. మైండ్‌ ఖాళీగా వుంచుకోవాలి. లేకపోతే.. ఉన్న ఆలోచనలు రిపీట్‌ అవుతుంటాయి. నేనొక సస్పెన్స్‌ సినిమా తీయాలనుకున్నాను. దానికి 'హుష్‌'! అని పేరు పెట్టాను. ఇది విని చాలామంది షాక్‌ అయ్యారు. పిచ్చిపిచ్చిగా వుందన్నారు. ఆ మాటలే.. స్పూర్తి కల్గించాయి. ఇలాంటివే చాలనుకున్నాను. 
 
ఈ చిత్రం ద్వారా కొత్త ఫ్యాన్స్‌ వస్తారా?
ఈ సినిమా ద్వారా మహిళలు ఎక్కువగా ఆదరిస్తారనుకుంటాను.
 
తెలుగు సినిమా చేయకపోవడానికి కారణం?
నిర్మాతలు పిలిస్తే చేస్తాను.
 
తెలుగు సినిమా చూస్తారా? బాగా నచ్చింది?
దర్శకుడిగా చూడను. ఆడియన్‌గా చూసి ఎంజాయ్‌ చేస్తాను. నాతోపాటు వచ్చినవారు.. ఇది లాగ్‌గా వుంది. అది ఇలా వుంటే బాగుంటుందని అంటారు. అవేవీ పట్టించుకోకుండా దాన్నికూడా ఎంజాయ్‌ చేస్తాను.
 
మీ సినిమాలపై ఇంట్లో ఫీడ్‌ బ్యాక్‌ ఎలా వుంటుంది?
అన్ని ఫిలింలు దరిద్రంగా వుంటాయని అంటారు. నా స్నేహితులు కూడా అలానే మాట్లాడతారు. నేను 'ఎ' సినిమా చేశాక. ఓ నిర్మాత నాతో ఆ సినిమా చాలాసార్లు చూశాను. తెగ నచ్చింది. కానీ చాలామంది ఎందుకు నచ్చలేదన్నాడు. దానికి సమాధానం లేదు. అందుకే కొంతమంది ఆటోడ్రైవర్లు, షాప్‌కీపర్లు, పారిశుధ్య కార్మికులు వారికి ప్రత్యేక షో వేసి, అందులో మా స్నేహితుడ్ని కూర్చోపెట్టాను. సినిమా అయ్యాక వారు ఏం మాట్లాడుకున్నారు అని అడిగా.. ఛీ.. ఇదొక సినిమానా! ఏమీ అర్థం కాలేదు. ఏం సినిమా తీశాడు. అని కామెంట్లు చేశారని చెప్పాడు. అందులోనూ ఎంజాయ్‌మెంట్‌ వుంది అని నాకు అనిపించింది. 
 
పిల్లలు చూస్తారా?
చూస్తారు. వారు.. నేను కొత్త గెటప్‌ వేసుకుంటే. ఎంజాయ్‌ చేస్తారు. వారు ఎనలైజ్‌ చేయరు. వారికి భయంలేదు. మనకే సినిమా ఏమవుతుందో అనే భయం. 
 
ఎక్కువగా ఎంజాయ్‌ చేసేది దర్శకత్వంలోనా? హీరోగానా?
నటన అంటే.. ఎవరో చెప్పింది చేయడమే. అందులో రిలాక్స్‌ వుంటుంది. దర్శకుడయితే అన్నీ నేను చూసుకుంటాను కాబట్టి ఎక్కువ సంతోషంగా వుంటుంది.
 
సోషల్‌ సర్వీసెస్‌ చేస్తారా?
చెప్పకూడదు. చేయాలి అంతే.
 
కన్నడ పరిశ్రమ ఎలా ఉంది?
ఇప్పుడు బాగుంది.. వ్యూయర్‌షిప్‌ ఎక్కువే. బడ్జెట్‌ కూడా ఎక్కువయింది. ఫారిన్‌ రిలీజ్‌ కూడా వున్నాయి. వేరే స్టేట్‌లో కూడా కన్నడ సినిమాలు ఆడుతున్నాయి. 
 
డబ్బింగ్‌ సినిమాల నిషేధం ఎంతకాలం?
అవి ఇంకా చర్చల్లోనే వున్నాయి. కానీ డైరెక్ట్‌ సినిమాలే అక్కడికి వచ్చేస్తున్నాయి. అన్ని భాషల చిత్రాలు అదే రోజు రిలీజ్‌ అవుతున్నాయి. 
 
బాహుబలి చూశారా?
అది చూడలేదు. తెలుగులో డైరెక్ట్‌గా విడుదలైంది. కన్నడలో పెద్ద హిట్‌.. కన్నడ చరిత్రలో పెద్ద రికార్డ్‌ కూడా అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu