సినిమా హిట్ అయితే హీరోకు దర్శకుడికి పేరు వస్తుంది. పరాజయం పాలయితే.. హీరోకూ దక్కుతుంది. అందుకే నేను నటించిన సినిమా పరాజయం పాలయితే దాన్ని ఎవరిపై ఆపాదించలేను. 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' నిరాశపర్చాక... గంటసేపు బాధపడ్డాను అంటూ తన పరాజయాన్ని గురించి చెబుతున్నాడు రాజ్‌తరుణ్. 'ఉయ్యాలా జంపాలా','సినిమా చూపిస్త మావ','కుమారి 21ఎఫ్' వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన రాజ్ తరుణ్‌కు రెండో హ్యాట్రిక్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం మంచు విష్ణుతో కలిసి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'ఈడో రకం.. ఆడో రకం' సినిమాలో నటిస్తున్నాడు. ఈ గురువారమే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్‌తో ఇంటర్వ్యూ.
రీమేక్ సినిమా కదా ఏదైనా మార్పులు చేశారా?
సహజంగానే మార్పులుంటాయి. నాకు సినిమా కథ చెప్పే ముందు పంజాబీ సినిమా సీడీ ఇచ్చి చూడమన్నారు. ఆ సినిమా చూసి చాలాసేపు నవ్వుకున్నాను. ఆ తరువాత నాగేశ్వరరెడ్డి కథనం చెప్పారు.కథ ఒక్కటే అయినా.. కొన్ని మార్పులు చేశారు. చాలా వినోదాత్మకంగా తెరకెక్కించారు. సినిమా షూటింగ్ చేస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేశాను.
టైటిల్‌లో లవర్స్‌నే కన్‌ఫ్యూజ్‌గా చూపిస్తున్నారే?
అవును. ఇదొక కన్ఫ్యూజన్ కామెడీ మూవీ. సినిమా మొదలయినప్పటి నుండి కామెడీ ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ తమకు ఎదురైన పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి అబద్దాలు చెబుతూ ఉంటారు. అందరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇంటర్వెల్ నుండి సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. మేం ఇద్దరం ఇద్దరిని ప్రేమిస్తాం. కానీ ఆ ఇద్దరూ కన్‌ఫ్యూజ్ అవుతారు. అదెలా అనేది సినిమాలో ఆసక్తికరంగా వుంటుంది.
ఫెయిల్యూర్‌ను ఎలా స్వీకరిస్తారు?
అన్ని సినిమాలూ ఒకేలా చేస్తాం. అన్నీ విజయాలు సాధించాలని జాగ్రత్తలు తీసుకుంటాం. అలానే 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' కూడా ఇష్టపడి చేశాను. సినిమా చూసినప్పుడు కూడా మంచి సక్సెస్ అవుతుందనే అనుకున్నాను కానీ మేము అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. ఆ విషయానికి ఎవరిని నిందించలేను. సినిమా రిజల్ట్ తెలిసిన తరువాత ఓ గంటసేపు బాధపడ్డాను. కావాలని ఎవరు పొరపాట్లు చెయ్యరు కదా.
మంచు ఫ్యామిలీతో ఇబ్బందులు రాలేదా?
మొదట్లో నాకు ఇవే మాటలు వినిపించాయి. చాలా మంది నాతో అన్నారు. మోహన్‌బాబు ఫ్యామిలీ అంటే డామినేషన్ ఉంటుందని సన్నిహితులు కూడా కొందరు చెప్పారు. కాని ఆ ఫ్యామిలీకు దగ్గరైతేనే వారు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. విష్ణు చాలా కూల్‌గా ఉంటారు. ఈ సినిమా చేయమని నాపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు. విష్ణు అయితే తన రోల్ కంటే నా రోల్ ఎక్కువ ఉండేలా చూసుకోమని డైరెక్టర్ గారికి చెప్పారు కూడా.
కుమారి.. హీరోయిన్‌నే ఎంపిక చేసుకున్నారు?
అందులో నా ప్రమేయం లేదు. నాకు కూడా వేరే హీరోయిన్‌తో నటించాలనిపిస్తుంది. కాని నాకు ఎవరు సెట్ కావట్లేదు. హెబ్బా హీరోయిన్‌గా సెలెక్ట్ చేయడం నా ఛాయిస్ కాదు ప్రొడ్యూసర్స్ ఛాయిస్.
రాజేంద్రప్రసాద్‌గారితో నటించడం ఎలా అనిపించింది?
రాజేంద్రప్రసాద్ గారు ఈ సినిమాలో విష్ణు తండ్రి పాత్రలో కనిపిస్తారు. మొదట ఆయనతో వర్క్ చేయాలంటే భయపడ్డాను. సీనియర్ నటుడు కదా.. సీరియస్‌గా ఉంటారేమో అనుకున్నాను. కానీ సెట్‌లో ఆయన చాలా ఎనర్జీగా ఉంటారు. ఆయన ఎనర్జీలో 10 శాతం నాకు ఉంటే బావుంటుందనిపిస్తుంది.
కథలు కూడా ఇస్తుంటారా?
ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాను. కాని నా కోసం కాదు. ఇప్పుడైతే డైరెక్ట్ చేసే ఆలోచన లేదు. ఫ్యూచర్‌లో చేస్తా..
కొత్త చిత్రాలు?
మారుతిగారి ప్రొడక్షన్‌లో ఒక సినిమా, దిల్ రాజు గారి బ్యానర్‌లో మరో సినిమా చేస్తున్నాను. అలానే గీతా ఆర్ట్స్, వంశీ గారి సినిమాలు స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి అంటూ తెలిపారు.