పొరుగున ఉన్న చైనాతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌కు మరింత ఆందోళన కలిగించే విషయం. హిందూ మహాసముద్ర గర్భంలో దాగియున్న పాలీమెటాలిక్ సల్ఫైడ్ ఖనిజాన్ని పదివేల కిలోమీటర్ల వరకూ అన్వేషించే హక్కులను చైనా పొందింది.
నైఋతి హిందూమహాసముద్రంలో అన్వేషణ కోసం తాము చేసుకున్న దరఖాస్తుకు ఇంటర్నేషనల్ సీబెడ్ అధారిటీ(ఐఎస్ఏ) ఇటీవల అనుమతినిచ్చినట్లు చైనా సముద్ర ఖనిజ వనరుల పరిశోధన, అభివృద్ధి సమాఖ్య గత రాత్రి వెల్లడించింది. ఈ అనుమతికి అనుగుణంగా చైనా సమాఖ్య ఐఎస్ఏతో 15 సంవత్సరాల అన్వేషణకు సంబంధించిన ఒప్పందాన్ని చేసుకోనుంది. ఖనిజ నిల్వల అభివృద్ధిపై కూడా చైనాకు హక్కులు లభించనున్నాయి.