స్వైన్ ఫ్లూ మహమ్మారి ఇప్పుడు అడ్డుకోలేని స్థాయికి చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. తాజాగా ఈ వ్యాధి బారినపడి మరో 12 మంది మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు తెలిపారు. అన్ని దేశాలకు ఈ వ్యాధి వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.
తాజాగా బ్రిటన్, బ్రెజిల్, కొలంబియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాల్లో 12 మంది పౌరులు స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందారు. సౌదీ అరేబియాలో 20 మంది విద్యార్థులకు స్వైన్ ఫ్లూ వైరస్ సోకడంతో ఓ ఇంటర్నేషనల్ స్కూలును మూసివేశారు.
ఇదిలా ఉంటే సెప్టెంబరునాటికి స్వైన్ ఫ్లూ వాక్సిన్‌ను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు పేర్కొన్నారు. అన్ని దేశాల స్వీయరక్షణకు సన్నద్ధమయి ఉండాలన్నారు. హెచ్1ఎన్1 వైరస్ వ్యాప్తి ఇప్పుడు నిరోధించలేని స్థాయికి చేరుకుందని, అన్ని దేశాలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలని డబ్ల్యూహెచ్ఓ వాక్సిన్ పరిశోధన విభాగం డైరెక్టర్ మేరీ పాల్ కీనీ చెప్పారు.