ప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారిని అరికట్టేందుకు అమెరికా డాక్టర్లు చేసిన కృషి ఫలిచింది. నానాటికీ విజృంభిస్తున్న ఈ అంటువ్యాధి కోసం తొలి వ్యాక్సిన్‌ను ఆ దేశం విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్‌తో వ్యాధిని అరికట్టవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
స్వైన్ ఫ్లూ ప్రభావం అన్ని దేశాల్లో తీవ్రంగా ఉందని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్(సీడీసీ) డైరెక్టర్ అన్నె ఛుఛాట్ అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నారని, అయినప్పటికీ, సరైన వైద్యం తీసుకోకుండా నిర్లక్ష్య పూరిత వైఖరిని అవలంభిస్తున్నారని చెప్పారు.
స్వైన్ ఫ్లూ వైరస్ గర్భవతులపై చాలా ప్రభావం చూపుతుందని, సాధారణ ప్రజల కంటే ఆరు రెట్లు వీరిపై ఎక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కాగా, స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసేందుకు ఆయా దేశాలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా, ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలు ఇప్పటికే అమెరికాకు చేరుకుని వ్యాక్సిన్‌పై ఆరా తీస్తున్నాయి.