పాకిస్థాన్ సుప్రీంకోర్టు బుధవారం సరబ్‌జీత్ సింగ్ మరణశిక్షను తొలగించేందుకు నిరాకరించింది. 1990నాటికి బాంబు దాడుల కేసులో సరబ్‌జీత్ సింగ్‌కు పాకిస్థాన్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే తనకు విధించిన శిక్షను పునఃపరిశీలించాలని కోరుతూ సరబ్‌జీత్ సింగ్ పాకిస్థాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
పాకిస్థాన్ సుప్రీంకోర్టు సరబ్‌జీత్ సింగ్ పిటిషన్‌ను బుధవారం తోసిపుచ్చింది. అతనికి విధించిన మరణశిక్షను తొలగించేందుకు నిరాకరించింది. ముగ్గురు సభ్యుల పాక్ సుప్రీంకోర్టు ధర్మాసనం 1991లో సరబ్‌జీత్‌కు తీవ్రవాద నిరోధక కోర్టు విధించిన మరణశిక్షను ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది.
అయితే సరబ్‌జీత్ తరపు న్యాయవాది హాజరుకాకపోవడంతో.. సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. గత కొన్నిసార్లుగా కోర్టు విచారణకు సరబ్‌జీత్ న్యాయవాది హాజరుకాలేదు. సోమవారం కూడా కోర్టు విచారణకు న్యాయవాది రాలేదు. రాణా అబ్దుల్ హమీద్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో సరబ్‌జీత్ తరపున వాదిస్తున్నారు. ఆయనను పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం నియమించింది.
1990లో పంజాబ్ ప్రావీన్స్‌లో సంభవించిన నాలుగు బాంబు పేలుళ్లలో 14 మంది మృతి చెందారు. ఈ పేలుళ్లలో సరబ్‌జీత్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో తీవ్రవాద నిరోధక కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. గత ఏడాది ఏప్రిల్ 1న సరబ్‌జీత్ శిక్ష అమలుకు పాక్ అధికారిక యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. అయితే పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ జోక్యంతో సరబ్ మరణశిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేశారు.