ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుడు, జామాదుత్ దవా తీవ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్‌ను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను పాకిస్థాన్ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. సాంకేతిక కారణాలతో పాక్ సుప్రీంకోర్టు సయీద్ విడుదలపై దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది.
ముంబయి దాడుల ప్రధాన నిందితుడిగా భారత్ భావిస్తున్న సయీద్‌ను ఇటీవల లాహోర్ హైకోర్టు గృహ నిర్బంధం నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. సయీద్‌ను గృహ నిర్బంధంలో ఉంచేందుకు పాక్ ప్రభుత్వం బలమైన ఆధారాలు సమర్పించకపోవడంతో కోర్టు సయీద్‌ను విడుదల చేసింది.
సయీద్ విడుదలను సవాలు చేస్తూ పాక్ కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు ప్రక్రియను సరిగా పూర్తి చేయని కారణంగా సయీద్ విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు సోమవారం తిరస్కరించబడ్డాయి. దీంతో ఫెడరల్, పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వాలు మళ్లీ పిటిషన్లు దాఖలు చేయనున్నాయి.