పాకిస్థాన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న జమాదుత్ దవా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ నిర్బంధం కేసును వారంపాటు వాయిదా వేయాలని ఆ దేశ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాని నిందితుడిగా భావిస్తున్న సయీద్‌ను గృహ నిర్బంధంలో ఉంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై విచారణను వారంపాటు వాయిదా వేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును కోరింది.
సయీద్ కేసులో బలమైన ఆధారాలు ప్రవేశపెట్టలేకపోవడంతో లాహోర్ హైకోర్టు అతడిని గత నెల 2న గృహ నిర్బంధం నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. లాహోర్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పాక్ సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించి, సయీద్‌ను నిర్బంధంలో ఉంచేందుకు బలమైన ఆధారాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలను ఆదేశించింది.
సరైన ఆధారాలు లేకపోవడంతో పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం కేంద్ర ప్రభుత్వ జోక్యంతో పంజాబ్ ప్రావీన్స్ పిటిషన్ ఉపసంహరణ కూడా నిలిచిపోయింది. పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వ న్యాయవాది "సయీద్ కేసు"ను వారంపాటు వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు.