శ్రీలంక జట్టుపై లాహోర్‌లో దాడి చేసిన ఓ తీవ్రవాదిని అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం బుధవారం వెల్లడించింది. పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టును లక్ష్యంగా చేసుకొని కొన్ని నెలల క్రితం లాహోర్‌లో కొందరు సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ తీవ్రవాద దాడిలో శ్రీలంక జట్టు సభ్యులు కొందరు గాయపడ్డారు.
వారికి రక్షణగా ఉన్న ఏడుగురు పోలీసులు మృతి చెందారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న ఓ తీవ్రవాదిని తాజాగా పాక్ అధికారిక యంత్రాంగం అరెస్టు చేసింది. ఈ ఏడాది మార్చి 3న శ్రీలంక జట్టుపై జరిగిన దాడికి బైతుల్లా మెహసూద్ నేతృత్వంలోని తాలిబాన్ తీవ్రవాద గ్రూపు కారణమని ఈ సందర్భంగా పాక్ అధికారులు ఆరోపించారు.
అరెస్టు చేసిన తీవ్రవాదిని జుబైర్ అలియాస్ నెక్ మొహమ్మద్‌గా గుర్తించారు. పంజాబీ తాలిబాన్ తీవ్రవాదులు ఈ దాడి చేశారని లాహోర్ పోలీసు చీఫ్ పర్వేజ్ రాథోడ్ బుధవారం కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
మెహసూద్ నేతృత్వంలోని తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాద గ్రూపు అనుబంధ సంస్థ ఈ దాడి చేసిందని పేర్కొన్నారు. జుబైర్, మరో ఆరుగురు తీవ్రవాదులు కలిసి శ్రీలంక జట్టుపై దాడికి పాల్పడ్డారని, వీరందరూ పంజాబీ తాలిబాన్ గ్రూపుకు చెందినవారేనని రాథోడ్ తెలిపారు. అఖీల్ అలియాస్ అర్‌స్లాన్ అలియాస్ డాక్టర్ ఉస్మాన్ ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని జుబైర్ పోలీసులకు చెప్పాడు.