చైనాలో ఇటీవల జరిగిన మత ఘర్షణలు 200 మంది ప్రాణాలు బలిగొన్నాయి. దీంతో సమస్యాత్మక జిన్‌జియాంగ్ ప్రావీన్స్‌లో వేర్పాటువాద నిరోధక చట్టాన్ని తీసుకొచ్చేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఒక్క ప్రావీన్స్ కోసం ఉద్దేశించిన వేర్పాటువాద నిరోధక స్థానిక చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చైనా చట్టసభ్యుడొకరు తెలిపారు.
ముస్లిం ఉయ్‌గుర్ వర్గం స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుపుతున్న నేపథ్యంలో చైనా ఈ చర్యలపై దృష్టిపెట్టింది. జిన్‌జియాంగ్ రీజినల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ఇలిగెన్ ఇమిబాఖీ మాట్లాడుతూ దేశ రాజ్యాంగాన్ని, చట్ట పాలనను కాపాడేందుకు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోందని తెలిపారు. జులై 5న ఇక్కడ జరిగిన విధ్వంసకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.