ఆస్ట్రేలియాలో భారతీయులపై జాతి వివక్ష దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఆపడంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం విఫలమవుతోంది. ఇదిలావుండగానే ఆస్ట్రేలియాలో విదేశీయులపై 2007 నవంబరు నుంచి 2008 నవంబరు వరకూ జరిగిన దాడుల్లో కనీసం 50 మంది విదేశీయులు మృతి చెందారని అక్కడి ప్రముఖ పత్రిక అయిన "సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్" ప్రచురించింది.
ఈ విషయాన్ని ఆసీస్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడానికి వెనుకాడుతోందనీ, దీనికి కారణం విదేశీ విద్యార్థుల ద్వారా వచ్చే 15.5 బిలియన్ డాలర్లను ఎక్కడ కోల్పోవలసి వస్తుందోనన్న భయమని ఆ పత్రిక పేర్కొంది.
ఆస్ట్రేలియాలో గత ఏడాది విదేశీయులపై జరిగిన దాడుల్లో 50 మంది విద్యార్థులు మృతి చెందగా అందులో 25మంది భారతీయులేనని ఆ పత్రిక పేర్కొంది. ఈ గణాంకాలను ప్రభుత్వం నుంచి సేకరించి ప్రచురించినట్లు తెలిపింది. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య 150కి పైగానే ఉండవచ్చని తెలుస్తోంది.
భారతీయ విద్యార్థుల అనంతరం అధిక సంఖ్యలో మృతిచెందినవారు చైనా, కొరియా దేశస్థులని తేలింది. దీనిపై ఆస్ట్రేలియా పార్లమెంటులో చర్చ సాగింది. విపక్ష నేతలు విదేశీ విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరాయి.
ప్రతిపక్ష నేతల అడిగిన ఒక ప్రశ్నకు ఆ దేశ విద్యాశాఖా మంత్రి సమాధానమిస్తూ... విదేశీ విద్యార్థుల భద్రకు సంబంధించిన చట్టాన్ని ఈ ఏడాది మరోసారి సమీక్షించి వారి రక్షణకు అవసరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.