Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమానం హైజాక్ కేసు నుంచి షరీఫ్‌కు విముక్తి

Advertiesment
పాక్ మాజీ ప్రధానమంత్రి
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు విమానం హైజాక్ కేసు నుంచి విముక్తి కల్పించింది. పదేళ్ల క్రితం నాటి విమానం హైజాక్ కేసు నుంచి షరీఫ్ శుక్రవారం పూర్తిగా బయటపడ్డారు. పాక్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వం షరీఫ్‌పై ఈ కేసు పెట్టింది.

తాజా కోర్టు తీర్పుతో పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్- ఎన్) చీఫ్ నవాజ్ షరీఫ్ పూర్తిస్థాయిలో మళ్లీ ప్రజా జీవితంలోకి వెళ్లేందుకు మార్గం సుగమైంది. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం.. సరైనా సాక్ష్యాధారాలు లేనికారణంగా నవాజ్ షరీఫ్‌ను విమానం హైజాక్ కేసు నుంచి విముక్తుడిని చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరి నేతృత్వంలోని న్యాయవ్యవస్థను ఈ ఏడాది మార్చిలో పాక్ ప్రభుత్వం పునరుద్ధరించిన తరువాత షరీఫ్ విమానం హైజాక్ కేసులో తీవ్రవాద నిరోధక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేశారు. షరీఫ్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనపై వచ్చిన నేరారోపణలు నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవని నిర్ధారణకు వచ్చింది.

ఆరోపణలు నిరూపించలేని కారణంగా షరీఫ్‌ను ఈ కేసు నుంచి విడిచిపెట్టింది. షరీఫ్ విమానం హైజాక్ కేసుపై మొదట విచారణ జరిపిన తీవ్రవాద నిరోధక కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండా షరీఫ్‌పై నిషేధం విధించింది.

ఈ తీర్పు వెలువడిన వెంటనే షరీఫ్, ఆయన సోదరుడు షహబాజ్ షరీఫ్‌లు ప్రవాసంలోకి వెళ్లారు. అనంతరం సింధ్ ప్రావీన్స్ హైకోర్టు కూడా షరీఫ్‌కు కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. అక్టోబరు 1999లో అప్పటి సైనిక జనరల్ ముషారఫ్‌ను తీసుకొస్తున్న విమానాన్ని దారిమళ్లించేందుకు షరీఫ్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ముషారఫ్ విదేశాల నుంచి వస్తున్న విమానాన్ని కరాచీ విమానాశ్రయానికి రావాల్సి ఉండగా, దానిని దక్షిణ సింధ్ ప్రావీన్స్‌లో ఉన్న నవాబ్‌షా విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో విమానంలో ఇంధన సరిపడ స్థాయిలో లేదని, అది కూలిపోయి ఉండేదని ఆ సమయంలో ముషారఫ్ పేర్కొన్నారు.

షరీఫ్ ఈ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు. అనంతరం అప్పటి ప్రధానమంత్రి షరీఫ్ నుంచి ముషారఫ్ రక్తపాతరహిత సైనిక తిరుగుబాటు ద్వారా పాకిస్థాన్ అధికార పగ్గాలు చేపట్టారు. ముషారఫ్ దేశాధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన అనంతరం షరీఫ్ విమానం హైజాక్ కేసులో విధించిన శిక్షను తప్పించుకునేందుకు ప్రవాసంలోకి వెళ్లారు.

అయితే తాజాగా సుప్రీంకోర్టు షరీఫ్ విమానం హైజాక్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఆయనను ఈ కేసు నుంచి పూర్తిగా విముక్తుడిని చేసింది.

Share this Story:

Follow Webdunia telugu