యెమెనియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హిందూ మహాసముద్రంలో ఉన్న కొమరస్ ద్వీపాల్లో కూలిపోయింది. ఈ ద్వీపాలకు సమీపంలో సముద్రంలో కూలిపోయిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ప్రమాదానికి గురైన విమానంలో 142 మంది ప్రయాణికులు, 11 మంది యెమెనీస్ సిబ్బంది ఉన్నారు.
ఇప్పటివరకు జరిగిన గాలింపు చర్యల్లో విమానంలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి మినహా, మిగిలినవారెవరినీ సహాయక సిబ్బంది ప్రాణాలతో గుర్తించలేదు. మంగళవారం ఇంకాసేపట్లో కొమరస్ ద్వీపాల రాజధాని నగరం మొరానీలో ల్యాండ్ కావాల్సిన ఈ విమానం పెనుగాలుల కారణంగా సముద్రంలో కూలిపోయింది.
విమాన ప్రమాదం నుంచి చిన్నారి రూపంలో ఒకరు ప్రాణాలతో బయటపడగా, మిగిలినవారందరూ మృతి చెంది ఉంటారని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. విమానంలోని ప్రయాణికుల మృతదేహాలు సముద్రతీరానికి వస్తున్నట్లు కొమరస్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురు ప్రయాణికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
యెమెన్ రాజధాని సానా నుంచి గ్రాండ్ కొమరేలోని మొరానీ వెళుతూ ఈ విమానం కూలిపోయింది. విమానంలో ఎక్కువ మంది ప్రయాణికులు కొమరస్ ద్వీపాలకు చెందినవారుకాగా, 66 మంది ఫ్రాన్స్ పౌరులు కూడా ఉన్నారు. మొత్తం ముగ్గురు చిన్నారులు కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికీ విమాన శకలాలు, ప్రయాణికుల మృతదేహాలను గుర్తించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలిపోవడానికి గల స్పష్టమైన కారణాలు తెలుసుకునేందుకు ఫ్రాన్స్, కొమరన్ అధికారిక వర్గాలు సహకరించుకుంటున్నాయి. అధికారిక వర్గాలు ఇప్పటికే విమాన ఇంధనం ఆనవాళ్లను గుర్తించారు.
విమానాశ్రయం నుంచి సముద్రంలో 16, 17 మైళ్ల దూరంలో ఇంధనం ఆనవాళ్లు బయటపడ్డాయి. విమాన శకలాలు, మృతదేహాల కోసం మూడు కొమరన్ బోట్లు సంఘటనా స్థలానికి వెళ్లాయి. విమానం ల్యాండ్ అవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో గంటకు 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.