గత ఏడాది ముంబయి మహానగరంలో జరిగిన ఉగ్రవాద దాడుల కేసులో లష్కరే తోయిబా చీఫ్ జాకీవుర్ రెహమాన్ లఖ్వీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పాకిస్థాన్ ప్రభుత్వం శనివారం అడియాలా జైలులో ఛార్జిషీటు దాఖలు చేసింది. ముంబయి మారణహోమానికి లఖ్వీని ప్రధాన సూత్రధారిగా పాక్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఛార్జిషీట్‌లో జరార్ షా, ఇతర నిందితుల పేర్లు కూడా ఉన్నాయి.
పాకిస్థాన్ ప్రభుత్వం ముంబయి ఉగ్రవాద దాడుల్లో నిషేధిత లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ ప్రమేయం ఉందని అంగీకరించడం అధికారికంగా ఇదే తొలిసారి. పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం నిర్బంధంలో ఉన్న లఖ్వీని ప్రధాన నిందితుడుగా పేర్కొంటూ తాజాగా ఆ దేశ ప్రభుత్వం ఛార్జిషీట్ దాఖలు చేసింది.
ఇదిలా ఉంటే ముంబయి ఉగ్రవాద దాడుల కేసుకు సంబంధించి తమకు భారత్ నుంచి మరింత సమాచారం కావాలని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ తెలిపారు. గతంలో తాము అడిగిన 32 ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రావాల్సి ఉందని తెలిపారు.
ఈజిప్టులో ఇరుదేశాల నేతల మధ్య జరిగిన సమావేశంలో పాక్ ప్రభుత్వం ముంబయి దాడులకు సంబంధించి భారత్‌కు 36 పేజీల నివేదిక అందజేసిన కొన్ని రోజులకే లఖ్వీపై ఛార్జిషీట్ దాఖలు కావడం గమనార్హం. భారత్‌కు ఇటీవల పాక్ ప్రభుత్వం అందజేసిన డోసియర్‌లో ముంబయి దాడుల్లో పట్టుబడ్డ అజ్మల్ అమీర్ కసబ్ తమ దేశీయుడేనని ఆ దేశ తొలిసారి అధికారికంగా అంగీకరించింది. అంతేకాకుండా లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ చీఫ్ లఖ్వీ ఈ దాడులకు ప్రధాన కుట్రదారు అని తెలిపింది.