రుణ సేకరణ గరిష్ట పరిమితి బిల్లుకు గడువు దగ్గర పడుతుండటంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా టెన్షన్‌లో ఉన్నారు. ఆగస్టు రెండో తేదీన రుణ సేకరణ గరిష్ట పరిమితి బిల్లు కోసం గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. అమెరికానే గాకుండా ప్రపంచ దేశాలన్నీ ఈ అంశంపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నాయి.
దివాలా కాకుండా బయట పడేందుకు సహకరించాలని మార్గాలు అన్వేషించాలని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు. చివరి ప్రయత్నంగా, తమ తమ ప్రజా ప్రతినిధులకు ఫోన్ లేదా ఈ మెయిల్ లేదా ట్వీట్ చేసి చెప్పాల్సిందిగా అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు.
రుణ సమీకరణ గరిష్ఠ పరిమితి బిల్లుపై ప్రతిష్టంభన వీడడం లేదు. బిల్లు విషయంలో ఎవరి దారి వారిదే. డెమోక్రాట్లు అనుకూలంగా ఉంటే రిపబ్లికన్లు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లును శుక్రవారం హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లో ప్రవేశపెట్టారు. దీంతో, ఈ సమస్యకు సత్వర పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. మరి ఒబామా ఈ బిల్లు వ్యవహారాన్ని ఏ మేరకు పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే..!