రీసెచ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ- రా) తమ దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించిందనేందుకు సంబంధించిన ఆధారాలను భారతదేశానికి పంపించామని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.
లాహోర్‌లో ఇటీవల శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన ఉగ్రవాద దాడి, నగర శివారుల్లోని పోలీసు అకాడమీపై జరిగిన దాడితో సహా తమ దేశంలో వివిధ తీవ్రవాద చర్యల్లో భారత్‌కు చెందిన విదేశీ గూఢచర్య సంస్థ "రా" ప్రమేయం ఉందని పాకిస్థాన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా తమ దేశంలో తీవ్రవాద కార్యకలాపాల్లో "రా" ప్రమేయం ఉందనేందుకు కావాల్సిన ఆధారాలను తాము భారత ప్రభుత్వానికి అందజేశామని పాక్ తెలిపింది. పాక్ అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాలతో డాన్ అనే పత్రిక ఈ మేరకు ఓ కథనం వెల్లడించింది.
ఇటీవల ఈజిప్టు పర్యటనలో ఇరుదేశాల ప్రధానులు సమావేశమైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ తమ దేశంలో జరిగిన తీవ్రవాద దాడుల్లో భారత్ ప్రమేయం ఉందనే వాదనను బలపరిచే ఆధారాలను భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అందజేసినట్లు డాన్ వెల్లడించింది. ఈ ఆధారాలను తాము ఆమెరికా, ఆఫ్ఘనిస్థాన్ దేశాలతోనూ పంచుకున్నామని పాక్ అధికారులు డాన్‌తో చెప్పారు.