దేశంలో దశాబ్దాలుగా అమలులో ఉన్న అత్యవసర చట్టాలను ఎత్తివేయాలని శ్రీలంక నిర్ణయించడం మంచి పరిణామంగా పేర్కొన్న అమెరికా యుద్ధనేరాల ఆరోపణలపై నిష్పక్షపాతమైన, జవాబుదారీ ప్రక్రియతో కొలొంబో దర్యాప్తును ప్రారంభించాలని డిమాండ్ చేసింది.
తమిళ టైగర్ల నుంచి ముప్పు ఎదుర్కోవడానికి సుమారు 30 సంవత్సరాల క్రితం విధించిన అత్యవసర చట్టాలను ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక శుక్రవారం ప్రకటించింది.
"అత్యవసర చట్టాలను తొలగించాలని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స పార్లమెంట్‌కు చేసిన ప్రతిపాదన వార్తను మేము స్వాగతిస్తున్నాం, శ్రీలంక ప్రజలకు ఇది సానుకూల అడుగుగా మేము భావిస్తున్నాం" అని అమెరికా హోం శాఖ ప్రతినిధి విక్టోరియా న్యూలాండ్ పాత్రికేయులకు తెలిపారు.