మైఖేల్ జాక్సన్ 2002లో రాసిన వీలునామా బహిర్గతమైంది. ఆయన ఆస్తిపాస్తులకు సంబంధించి చివరిసారి రాసిన వీలునామా ఇదేనని ప్రచారం జరుగుతోంది. తన తల్లి, బిడ్డలకు ఎస్టేట్‌ను అప్పగించాలని మైఖేలా జాక్సన్ ఈ వీలునామా రాశారు. ఈ వీలునామాలో తండ్రి పేరును చేర్చలేదని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
తల్లి కేథరీన్, తన బిడ్డలు ముగ్గురికి ఎస్టేట్‌పై హక్కులు కల్పిస్తూ మైఖేల్ 2002 వీలునామా రాశారని వస్తున్న వార్తలను ఆయన కుటుంబ న్యాయవాది ఎల్ లండెల్ మెక్‌మిలన్ తోసిపుచ్చారు. తమకు లేదా కుటుంబసభ్యులకు ఇటువంటి వీలునామా ఏదీ అందలేదని ఆయన "వాల్‌స్ట్రీట్ జర్నల్"తో చెప్పారు.
ఇదిలా ఉంటే మైఖేల్ జాక్సన్ మాజీ న్యాయవాది జాన్ బ్రాన్కా పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ తన సమక్షంలో వీలునామా రాశారని, అది తన వద్దే ఉందని వెల్లడించారు. ఈ వీలునామాను బ్రాన్కా గురువారం లాస్ ఏంజెలెస్ సుపీరియర్ కోర్టులో సమర్పించే అవకాశం ఉందని జాక్సన్ కుటుంబానికి సన్నిహితులైన వ్యక్తులు చెప్పారు.
మైఖేల్ జాక్సన్‌కు 1980 నుంచి 2002 మధ్యకాలంలో బ్రాన్కా న్యాయవాదిగా వ్యవహరించారు. జాక్సన్ మరణానికి కొన్నివారాల ముందు తనను తిరిగి న్యాయవాదిగా నియమించుకున్నారని బ్రాన్కా పేర్కొన్నారు. జాక్సన్ ఎస్టేట్ విలువ ప్రస్తుత అంచనాల ప్రకారం 70 కోట్ల డాలర్ల వరకు ఉండవచ్చు. జాక్సన్‌కు 50 కోట్ల డాలర్ల అప్పులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.