పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ముగ్గురు బిడ్డల శాస్త్రీయ తండ్రి వేరొకరంటూ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అమెరికాకు చెందిన ఓ వారపత్రిక మైఖేల్ వారసుల శాస్త్రీయ తండ్రి ఆయన వైద్యుడని తన కథనంలో పేర్కొంది. లాస్ ఏంజెలెస్‌కు చెందిన మైఖేల్ డెర్మటాలజిస్ట్ (చర్మరోగ నిపుణుడు) దివంగత పాప్ కింగ్ ఇద్దరు బిడ్డల శాస్త్రీయ తండ్రి అని అమెరికా మేగజైన్ వెల్లడించింది.
పలువర్గాలు వెల్లడించిన వివరాలను ఆధారంగా చేసుకొని ఆ మేగజైన్ మంగళవారం ఈ కథనాన్ని వెల్లడించింది. జాక్సన్- రెండో భార్య డెబ్బీకి ప్రిన్స్, పారిస్ అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు. అయితే వీరిద్దరి శాస్త్రీయ తండ్రి ఆర్నాల్డ్ క్లెయిన్ అని యూఎస్ మేగజైన్ తెలిపింది. వృత్తిరీత్యా నర్సు అయిన డెబ్బీ రౌ జాక్సన్‌కు పరిచయం కాకముందు ఆర్నాల్డ్ క్లెయిన్ ఆస్పత్రిలోనే పనిచేశారు.
ఆమెను జాక్సన్ వివాహం చేసుకున్నారు. జాక్సన్‌కు ఈమె రెండో భార్య. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన జాక్సన్, అనంతరం రెండో భార్యతోనూ విడిపోయారు. అయితే బిడ్డల శాస్త్రీయ తండ్రికి సంబంధించిన నిజాన్ని ఎప్పటికీ ఇతరులకు వెల్లడించరాదని జాక్సన్, డెబ్బీల మధ్య ఒప్పందం కుదిరినట్లు యూఎస్ మేగజైన్ వెల్లడించింది. ఇదిలా ఉంటే మైఖేల్ మూడో బిడ్డ తల్లి ఎవరో ఇప్పటికీ ప్రపంచానికి తెలియదు.