ఆస్ట్రేలియాలో భారతీయులపై జాత్యహంకార దాడులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కలకలం సృష్టిస్తున్న ఈ దాడులకు కొనసాగింపుగా తాజాగా మెల్‌బోర్న్‌లో మరో భారతీయుడిపై దాడి జరిగిన ఘటన తెరపైకి వచ్చింది. భారతీయులపై ఇది ఆరో జాతివివక్ష దాడి కావడం గమనార్హం.
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటువంటి దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, బాధ్యులను చట్టం ముందుకు తీసుకొస్తామని హామీలు ఇచ్చిన నేపథ్యంలో మరో దాడి వెలుగులోకి రావడం గమనార్హం. నగరంలోని కారిక్ ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్న భారత్‌కు చెందిన ఆశీష్ సూద్‌పై దాడి జరిగినట్లు మంగళవారం తెలిసింది.
నగరంలోని చాపెల్ స్ట్రీట్‌లో శనివారం రాత్రి పదిహేను మంది సభ్యుల గ్రూపు ఈ యువకుడిపై దాడి చేసింది. ఇతనిపై, మరో ముగ్గురిపై దుండగులు దాడి చేశారు. ఆశీష్‌ను లోహ వస్తువుతో కొట్టినట్లు తెలుస్తోంది.
ఆశీష్‌ను తీవ్ర గాయాలతో పోలీసులు అల్‌ఫెర్డ్ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కూడా చేశారు. అతను తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాడని, అతని ముక్కు నుంచి ఇప్పటికీ రక్తం కారుతున్నట్లు ఆశీష్ స్నేహితుడొకరు సౌత్ ఏషియా టైమ్స్‌కు ఫోన్‌లో చెప్పాడు.