పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌పై పార్లమెంట్ దేశ ద్రోహం కేసు పెట్టవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. రెండేళ్ల క్రితం దేశంలో అత్యాయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించడంతోపాటు, న్యాయమూర్తుల తొలగిస్తూ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
ఈ విచారణకు హాజరుకావాలని ముషారఫ్‌కు పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసింది. అయితే బుధ, గురువారం కోర్టుకు ముషారఫ్ లేదా ఆయన తరపు న్యాయవాది ఎవరూ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై దేశద్రోహం కేసు పెట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరి కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.