ఆఫ్గన్ తాలిబన్ నేత ముల్లా మొహమ్మద్ ఒమర్ పాకిస్థాన్‌లో లేడని.. తాలిబన్ కమాండర్ హయతుల్లా ఖాన్ వెల్లడించాడు. అదంతా అమెరికా అల్లిన కట్టుకథగా అభివర్ణించాడు. పాక్‌లో డ్రోన్ మిస్సైల్ దాడులను జరిపి ఒమర్ కోసం చేస్తున్నట్లు అమెరికా అనవసరంగా ఈదాడులకు పాల్పడుతోందని ఆయన తెలిపాడు.
ఒమర్ మరియు అతని అనుచరులు పాకిస్థాన్‌లోని క్వెట్టా నగర పరిసరాల నుంచి ఆఫ్గన్‌లోకి మిస్సైల్ దాడులు జరిపారని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు వాషింగ్టన్ ఇటీవల వెల్లడించింది. అయితే దీనిని పాక్ ఖండించింది. ఒమర్ లేదా ఇతర తాలిబన్ సంబంధిత కమాండర్లు పాక్‌లో ఎవరూ లేరని.. ఇప్పటికే తాలిబన్ సభ్యులు కొంత మంది నిర్బంధించినట్లు కూడా తెలిపింది.
కానీ, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో మిలిటెంట్లు ఉండే అవకాశాలున్నాయని అమెరికా పైలెట్ రహిత డ్రోన్ ఎయిర్‌క్రాఫ్ట్ దాడులను నిర్వహించింది. ఈ నేపథ్యంలో.. హయతుల్లా ఖాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. ఫోన్‌లో విలేకురులతో మాట్లాడుతూ.. తాలిబన్ వర్గం మొత్తం ఆఫ్గన్‌లో ఉందన్నాడు. ఎందుకంటే.. పాక్ తమకు అంత రక్షణాత్మక ప్రదేశం కాదని వివరించాడు.
ఇప్పటికే.. ఆఫ్గన్ కన్నా.. పాక్‌లోనే అనేక మంది తాలిబన్ దళాలు పట్టుబడ్డారన్నాడు. ప్రస్తుతం ముల్లా ఒమర్‌తో పాటు అందరూ.. ఆఫ్గన్‌లోనే ఉన్నట్లు వ్యాఖ్యానించాడు.