ఆస్ట్రేలియాలో భారతీయులపై వరుసగా జరుగుతున్న జాతి వివక్ష దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా ఓ భారత సంతతి ట్యాక్సీడ్రైవర్‌ను ఓ ప్రముఖ ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ ఆటగాడు కొట్టాడు. దీనిపై ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రధానమంత్రి జాన్ బ్రుంబై మాట్లాడుతూ.. ట్యాక్సీడ్రైవర్‌పై దాడి చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు చాలా మంచోడని కితాబిచ్చిన్నట్లు తెలుస్తోంది.
మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. ఆస్ట్రేలియా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు మైకేల్ హర్లే ఓ భారత సంతతి ట్యాక్సీడ్రైవర్‌పై వాదన తరువాత దాడి చేశాడు. దాడి చేసిన సమయంలో మద్యం సేవించి ఉన్న మైకేల్ హర్లే మంచి బాలుడని బ్రుంబై పేర్కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మెల్‌బోర్న్‌లోని హడ్లే వీధిలో ఓ ఫాస్ట్‌ఫుడ్ అవుట్‌లెట్ వద్ద ట్యాక్సీడ్రైవర్‌పై హర్లే (19) దాడి చేశాడు.
ఈ దాడిలో ట్యాక్సీడ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇది జరిగిన ప్రదేశంలోనే ఈ ఫుట్‌బాల్ ఆటగాడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెట్టారు. ఇది జాతి వివక్ష దాడి కాదని, ఛార్జీ దగ్గర వచ్చే పేచీ ఈ పరిణామానికి దారి తీసిందని విక్టోరియా పోలీసులు తెలిపారు. హర్లేపై కేసు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.