అంతర్జాతీయ ఒత్తిళ్లను లెక్క చేయని ఉత్తరకొరియా తాజాగా మరో నాలుగు క్షిపణి పరీక్షలను నిర్వహించింది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ సెలవు రోజైన శనివారం ఈ పరీక్షలను నిర్వహించి తన సత్తాను చాటింది. గత మే నెలలో అణు పరీక్షలు నిర్వహించి సంచలనం సృష్టించిన ఉత్తరకొరియా, తాజాగా స్వల్ప శ్రేణి క్షిపణి పరీక్షలు నిర్వహించడం గమనార్హం.
ఈ క్షిపణులు సుమారు 500 కిలోమీటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయితే, ఈ పరీక్షలపై ఉత్తర కొరియా అధ్యక్ష భవనం వివరణ ఇచ్చింది. రక్షణ విన్యాసాల్లో భాగంగానే ఈ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది.
దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్స్ మాట్లాడుతూ.. శనివారం ఉదయం మూడు పరీక్షలు నిర్వంచగా, నాలుగో క్షిపణిని మధ్యాహ్నం నిర్వహించినట్టు తెలిపారు. ఈ క్షిపణి పరీక్షలు స్కడ్ మిస్సైల్‌గా ఉన్నట్టు యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
ఉత్తర కొరియా నుంచి ఉత్పన్నమయ్యే ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టేందుకు లేదా ఎదుర్కొనేందుకు తమ దేశ మిలిటరీ సర్వ సన్నద్ధంగా ఉందని దక్షిణ కొరియా మిలిటరీ అధికారులు తెలిపారు. దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందించక పోగా, జపాన్ ప్రభుత్వం మాత్రం ఈ పరీక్షలను తీవ్రంగా ఖండించింది.