ఇండోనేషియా చిచ్చుబుడ్డి మరోసారి బద్దలైంది. జావాలో ఉన్న మౌంట్ మెరాపీ అగ్నిపర్వం ఇప్పట్లో శాంతించేలా కనబడటం లేదు. గత కొద్ది రోజులుగా మెరుస్తున్న మెరాపీ వల్ల అక్కడి జన జీవనం అస్తవ్యస్తమవుతోంది. ఆ ప్రాంతంలో రవాణ వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. ఇదే వరుసలో బుధవారం రాత్రి కూడా మెరాపీ పెద్ద శబ్ధంతో మరోసారి బద్దలై భారీ ఎత్తును ధూళిని, లావాను ఎగజిమ్మింది.
ఒబామా రాక కోసం విమాన సేవలను పునరుద్ధరించినప్పటికీ.. తాజా పేలుడుతో మరోసారి విమాన సర్వీసులను రద్దు చేశారు. మెరాపీ నుంచి ఎగసిపడుతున్న లావా కారణం ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 191కి చేరింది. అక్టోబర్ నుంచి మెరాపీ అగ్నిపర్వతం నుంచి లావా వెలువడుతుండడంతో ఆ పరిసర గ్రామాలను వదిలి సుమారు 3,40,000 మంది ప్రజలు పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్నారు.
ఈ లావా వల్ల శిథిలమైన గ్రామాలలో సహాయక సిబ్బంది తవ్వకాలు జరపగా.. మృతుల సంఖ్య 151 నుంచి పెరిగిందని ఓ విపత్తు నిర్వహణాధికారి వెల్లడించారు. కాగా.. ఈ మృతదేహాలు అన్నింటనీ సామూహికంగా దహనం చేసినట్లు ఆయన తెలిపారు. జాకార్తాకు వందల కిలోమీటర్ల దూరంలో ఈ అగ్నిపర్వతం నుండి ఎగసిపడుతున్న లావా, బూడిద, వేడిగాలుల దృష్ట్యా హాంగ్‌కాంగ్‌కు చెందిన కేథీ పసిఫిక్, ఆస్ట్రేలియాకు చెందిన క్వాటాస్ తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి.