శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన వేలుపిళ్లై ప్రభాకరన్‌ను శ్రీలంక సైన్యం చిత్రహింస పెట్టి ఆ తర్వాత క్రూరంగా కాల్చి చంపిందని ఢిల్లీకి చెందిన యూనివర్శిటీ టీచర్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ ( యుథర్) తన నివేదికలో వెల్లడించింది.
ప్రభాకరన్‌ను శ్రీలంక సైన్యం ప్రాణాలతో పట్టుకున్నదనీ, ఆ తర్వాత అతడిని ఓ ప్రముఖ తమిళ రాజకీయనాయకుడు, ఓ జనరల్ సమక్షంలో చిత్రహింసలకు గురిచేసిందని లంక సైన్యానికి చెందిన కొందరు ఉన్నతాధికారులు చెప్పినట్లు తమకు సమాచారం ఉన్నదని తెలిపింది.
ఎల్టీటీఈపై పూర్తి పట్టు బిగించిన అనంతరం లంక సైన్యం ప్రభాకరన్‌ను సజీవంగా పట్టుకున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత అతడిని 53 డివిజన్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో చిత్రహింసకు గురిచేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు ప్రభాకరన్ 12 ఏళ్ల చిన్న కుమారుడు బాలచంద్రన్‌ను సైతం లంక సైన్యం ప్రభాకరన్ కళ్లెదుటే హతమార్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇంతకుమించి మాట్లాడటానికి యుథర్కి చెందిన అధికారులు నిరాకరించారు. అయితే ప్రభాకరన్‌ను చిత్రహింసలకు గురిచేసి చంపిన మాట మాత్రం వాస్తవమని నమ్మేందుకు ఆధారాలున్నట్లు తెలిపారు.