భూగోళంపై 87 లక్షల జీవజాతులు ఉన్నట్టు జీవశాస్త్ర పరిశోధకులు తేల్చారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 10 శాతం జీవజాతులను మాత్రమే వర్గీకరించారు. 80 దేశాలకు చెందిన 2700 మంది శాస్త్రవేత్తల బృందం సముద్రాలు, మహాసముద్రాల జీవన వైవిధ్యంపై గత పదేళ్ళ పాటు అధ్యయనం జరిపారు.
ఈ అధ్యయనంలో ఇప్పటి వరకు గుర్తించిన జీవ జాతులు కేవలం 1.2 మిలియన్‌లు మాత్రమే ఉన్నాయని తేల్చారు. మిగతా 90 శాతం జాతులను గుర్తించాల్సి ఉందని వారు తెలిపారు. క్షీరదాలు, పక్షులు, చేపలను గుర్తించిన పద్ధతినే మిగతా జీవజాతులను వర్గీకరించడానికి వాడుతామని వారు పేర్కొన్నారు.
ఇప్పటివరకు గుర్తించిన జీవజాతులలో 77 లక్షల వరకు జంతువులుండగా అందులో 10 లక్షల జంతువులను మాత్రమే ఇప్పటి వరకు వర్గీకరించామని తెలిపారు. భూమిపై 611,000 రకాల శిలీంధ్ర జాతులు, 2,98,000 రకాల వృక్ష జాతులు ఉన్నట్లు వివరించారు.