భూకంపం, సునామి తాకిడికి గురైన జపాన్‌లో పరిస్థితిని అంచనా వేసేందుకు గానూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ ఆ దేశంలో పర్యటించనున్నారు. మార్చి 11న సంభవించిన భూకంపంతో జపాన్‌లోని ఫుకుషిమా అణు కేంద్రంలో రేడియేషన్ స్థాయిలు గరిష్ఠ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
బాన్ కీ మూన్ ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే తన పర్యటనలో మూన్ పునరావాస కేంద్రాన్ని సందర్శించడంతో పాటు ఫుకుషిమా నగరంలోని విద్యార్ధులతో కూడా మాట్లాడతారని ఆయన ప్రతినిధి తెలిపారు.
అనంతరం టోక్యోలో జపాన్ ప్రధాన మంత్రి నొవొటో కన్, విదేశాంగ మంత్రి తకెయకీ మట్సుమటోలతో మూన్ సమావేశమవుతారు. బాన్ కీ మూన్ జపాన్ పర్యటన ముగించుకొని దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లనున్నారు.