పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యకేసులోని నిందితుల్లో ఒక నిందితుడు సెకండరీ స్కూల్ ఎగ్జామ్స్‌లో మూడో స్థానంలో నిలిచాడు. ఈ నిందితుడు రావల్పిండి జైలు నుంచే పరీక్షలు రాశాడు. అబ్దుల్ రషీద్ అహ్మద్ అలియాస్ అబ్దుల్ రహీం తెర్బీ అనే వ్యక్తి 2007లో చోటు జరిగిన బెనజీర్ భుట్టో హత్య కేసులో అరెస్టు చేసిన ఐదుగురు నిందితులుల్లో ఒకడు. ఈ నిందితుడు రావల్పిండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల్లో మొత్తం 1,050 మార్కులకు గాను 848 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచాడు. ఈ పరీక్షా ఫలితాలను సోమవారం ప్రకటించారు.
ఖైబర్ ఫఖ్తున్ఖావా రాష్ట్రంలోని బటర్గామ్ అనే గ్రామానికి చెందిన అహ్మద్ ప్రస్తుతం మిగిలిన నలుగురు నిందితులతో కలిసి అడియాల జైలులో జీవితం గడుపుతున్నాడు. ఈ నిందితుడు అకోరా ఖట్టక్ అనే మదర్సాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. అహ్మద్‌ను 2008 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని కమ్రాలో చోటు చేసుకున్న తీవ్రవాదుల దాడి కేసులో కూడా అరెస్టు చేశారు.
ఈ కేసులో అరెస్టు అయిన తర్వాత అహ్మద్ తన చదువును పూర్తి చేసేందుకు ఆసక్తి చూపడంతో జైలు అధికారులు ఉపాధ్యాయులు, పుస్తకాలు, ఇతర సౌకర్యాలను సమకూర్చినట్టు అడియాలా జైలు ఎస్పీ మోషిన్ రఫీక్ వెల్లడించారు. అలాగే బెనజీర్ హత్య కేసులో మరో నిందితుడైన అతిజాజ్ షా కూడా ఇస్లామిక్ ఎడ్యుకేషన్ విద్యను అభ్యసిస్తూ మూడో స్థానంలో నిలిచాడు.