భారత్‌పై దాడులు చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ తన గల్ఫ్ నెట్వర్క్ ద్వారా భారీఎత్తున నిధుల సమీకరిస్తున్నట్లు తెలుస్తోంది. భారత పశ్చిమతీర ప్రాంతంలోని గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో కీలక ప్రదేశాలపై దాడులు చేసేందుకు లష్కరే తోయిబా ప్రయత్నిస్తున్నట్లు భారత నిఘా వర్గాల వద్ద సమాచారం ఉన్న సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించి భారత నిఘా వ్యవస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశాయి. గత ఏడాది ముంబయి మహానగరంలో జరిగిన దాడి తరహాలోనే మరిన్ని దాడులు చేసేందుకు లష్కరే తోయిబా తన మెరైన్ విభాగం కుట్ర పన్నుతోందని వర్జీనియాకు చెందిన జేమ్స్టౌన్ పౌండేషన్ వెల్లడించిన నివేదిక పేర్కొంది.
భారత్ దాడులకు పశ్చిమతీర ప్రాంతాన్ని లష్కరే తోయిబా ఉపయోగించుకోవాలనుకుంటుందని తెలిపింది. ఇటీవల భారత హోం శాఖ మంత్రి పి.చిదంబరం కూడా దేశ పశ్చిమతీరానికి తీవ్రవాద ముప్పు పొంచివుందని వెల్లడించిన నేపథ్యంలో.. ఈ నివేదిక వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
నిఘా వ్యవస్థలు కూడా భారత్‌లో తీవ్రవాద చర్యలకు గల్ఫ్ సంబంధాలను నిర్ధారిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లోనూ అనేక లష్కరే తోయిబా సెల్స్ పనిచేస్తున్నాయి. భారత్‌పై తీవ్రవాద చర్యలకు గల్ఫ్ ప్రాంతం నుంచి లష్కరే తోయిబా నిధులు సమీకరిస్తోందని నిఘా వ్యవస్థలు కూడా భావిస్తున్నాయి.