Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌కు అమెరికా సెనెటర్ క్షమాపణ

Advertiesment
అమెరికా సెనెటర్
అమెరికా భద్రతకు భారత్ వలన ముప్పు ఉందంటూ వ్యాఖ్యానించినందుకు ఓ అమెరికా సెనెటర్ క్షమాపణ చెప్పారు. చైనాకు బదులుగా భారత్ పేరును తప్పుగా వాడానని, ఇందుకు క్షమాపణ చెబుతున్నట్లు సెనెటర్ జాన్ కార్నైన్ తెలిపారు. ఆయనకు భారత్ అనుకూలవాదిగా పేరున్నప్పటికీ, భారత్ వలన తమ దేశ భద్రతకు ముప్పు పెరుగుతోందని వ్యాఖ్యానించి ఆదివారం వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం బరాక్ ఒబామా అధికారిక యంత్రాంగం నిలిపివేసిన ఎఫ్- 22 కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో డిమాండ్ చేసిన జాన్ కార్నైన్.. అమెరికాకు ఈ రకం యుద్ధ విమానాల కావాలన్నారు. ఉత్తర కొరియా, ఇరాన్, భారత్ వంటి దేశాల నుంచి దేశ భద్రతకు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయరక్షణ కోసం అమెరికాకు ఈ యుద్ధ విమానాల అవసరం ఉందని పేర్కొన్నారు.

చైనాకు బదులుగా భారత్‌ను తమ దేశ భద్రతకు ముప్పుగా వర్ణించానని తాజాగా కార్నైన్ వివరణ ఇచ్చారు. కార్నైన్ గత కొన్నేళ్లుగా భారత్- అమెరికా సంబంధాలు పటిష్ట పరచడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాకుండా చారిత్రాత్మక అమెరికా- భారత్ పౌర అణు సహకార ఒప్పందం ముందుకు తీసుకురావడంలోనూ ఆయనది ముఖ్యభూమిక. భారత్, అమెరికా వ్యూహాత్మక సంబంధాలు ప్రోత్సహిస్తున్న ప్రధాన మద్దతుదారుల్లో ఆయన కూడా ఒకరు.

Share this Story:

Follow Webdunia telugu