నేపాల్ భూభాగాన్ని భారత్ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఉపయోగించుకునేందుకు విదేశీ తీవ్రవాద శక్తులు వ్యూహరచన చేస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రభుత్వం తమ భూభాగంలో అటువంటి వాటిని ప్రతిఘటిస్తామని హామీ ఇచ్చింది.
భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు తమ భూభాగం ఉపయోగపడకుండా చూస్తామని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. ఇటువంటి కార్యకలాపాలకు ఎవరైనా ఒడిగడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
నేపాల్ ప్రధానమంత్రి మాధవ్ కుమార్ నేపాల్ విదేశీ వ్యవహారాల సలహాదారు రాజన్ భట్టారీ మాట్లాడుతూ.. తమ భూభాగంలో పొరుగుదేశాల వ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వబోమని స్పష్టం చేశారు.
భారత్‌పై దాడుల కోసం విదేశీ తీవ్రవాద శక్తులు నేపాల్ భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.