మయన్మార్ రూపంలో భారత్ పొరుగున మరో అణ్వస్త్ర రాజ్యం అవతరించబోతుందనే అనుమానాలకు ఇటీవల లభించిన ఆధారాలు బలం చేకూరుస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటైన మయన్మార్ అణు రాజ్యాల సరసన చేరబోతుందనే వార్త చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నప్పటికీ, ఇటీవల దొరికిన భారీ సొరంగాల ఛాయాచిత్రాలు, ఓ అత్యున్నత స్థాయి సమావేశం ఈ వాదనలు బలపడుతున్నాయి.
ఉత్తర కొరియా సాయంతో మయన్మార్ అణు రాజ్యంగా అవతరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్‌లో మిలిటరీ పాలనలో ఉన్న మయన్మార్ అణు బాంబు చేతబట్టుకుంటుందని ఎవరూ ఊహించడం లేదు. అయితే అంతర్జాతీయ సమాజం దృష్టి నుంచి ఇప్పుడు మయన్మార్ తప్పించుకునే అవకాశం లేదు. అణ్వాయుధాలు సమకూర్చుకోబోతుందనే అనుమానాల కారణంగా మయన్మార్‌పై కూడా అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టింది.
మయన్మార్‌లో ఈ దిశగా ఏదో జరుగుతుందనే అనుమానాలు మాత్రం బలంగా ఉన్నాయి. ఇటీవల ఉత్తర కొరియాకు చెందిన ఓ నౌక మయన్మార్ బయలుదేరింది. ఈ నౌకలో ఉన్న వస్తువులు వివరాలేవీ ఉత్తర కొరియా వెల్లడించకోపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఈ నౌకను అమెరికా నేవీ వెంబడించడంతో అది తిరిగి ఉత్తర కొరియా వెళ్లిపోయింది. ఈ నౌకలో మయన్మార్ అణు కార్యక్రమానికి సంబంధించిన పరికరాలు, స్కడ్ తరహా క్షిపణులు ఉన్నట్లు ఉపగ్రహ ఛాయచిత్రాలను విశ్లేషించిన కొందరు నిపుణులు వెల్లడించాయి.